యూరాలజీ కౌన్సెలింగ్ | Urology Counseling | Sakshi
Sakshi News home page

యూరాలజీ కౌన్సెలింగ్

Jul 21 2015 11:08 PM | Updated on Apr 3 2019 3:50 PM

నా వయసు 78 ఏళ్లు. ఇటీవలే మూత్రం రాక అల్లల్లాడి డాక్టర్‌ను సంప్రదిస్తే ప్రోస్టేట్ గ్రంథి వాచిందని.....

ప్రోస్టేట్ వాచింది...  చికిత్స ఏమిటి?

 నా వయసు 78 ఏళ్లు. ఇటీవలే మూత్రం రాక అల్లల్లాడి డాక్టర్‌ను సంప్రదిస్తే ప్రోస్టేట్ గ్రంథి వాచిందని, ఈ సమస్యను బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా (బీపీహెచ్) అంటారని చెప్పారు. సర్జరీ అవసరమని అన్నారు. నాకు ఆపరేషన్ అంటే భయం. సురక్షితమైన సర్జరీ ప్రక్రియలు ఏవైనా ఉన్నాయా తెలియజేయగలరు.
 - రఘురామయ్య, ఒంగోలు

మీరు చెబుతున్న బినైన్ ప్రోస్టేటిక్ హైపర్‌ప్లేసియా అనే సమస్య చాలా పెద్ద వయసు వారిలో కనిపిస్తుండటం చాలా సాధారణం. ఈ సమస్య ఉండి, ఈ కింది లక్షణాలు కనిపిస్తే మాత్రం దాన్ని పరిష్కరించడానికి సర్జరీ అవసరమవుతుంది. అవి...

మూత్రాశయం నిండిపోయినా... మూత్రవిసర్జన సాధ్యం కాకపోవడం.
దీర్ఘకాలంపాటు ఈ సమస్యతో బాధపడుతుండటం వల్ల అది కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీయడం.
మూత్రవిసర్జన జరుగుతున్నప్పుడు పెద్ద ఎత్తున రక్తం పడుతుండటం
మూత్రాశయంలో రాళ్లు ఉండటం.
 
పై సమస్యలు ఉన్నప్పుడు హైరిస్క్ పేషెంట్లలో సాధారణమైన ఓపెన్ సర్జరీ కంటే ఎండోస్కోపిక్ రెసెక్షన్‌తో ప్రోస్టేట్‌లో పెరిగిపోయిన భాగాన్ని తొలగించడం మేలు. ఈరోజుల్లో లేజర్ కిరణాలను ఉపయోగించడం ద్వారా ప్రోస్టేట్ సంబంధిత శస్త్రచికిత్సలను చాలా సురక్షితంగా చేయడం సాధ్యమవుతోంది. లేజర్స్ ఉపయోగించడం వల్ల రక్తాన్ని పలచబార్చే మందులను వాడే రోగులకూ శస్త్రచికిత్స చేయవచ్చు. ఎందుకంటే సంప్రదాయ శస్త్రచికిత్స ప్రక్రియలతో పోలిస్తే లేజర్స్ వల్ల రక్తస్రావం ఎక్కువగా జరిగే అవకాశం ఉండదు. పైగా ప్రోస్టేట్‌కు చేసే సంప్రదాయ శస్త్రచికిత్స వల్ల కొందరికి సైడ్‌ఎఫెక్ట్‌గా అంగస్తంభన వైఫల్యాలు రావచ్చు. కానీ లేజర్‌తో చేసే చికిత్సలో ఈ అవకాశం చాలా అరుదు అనే చెప్పాలి.

ఇక ప్రోస్టేట్ గ్రంథి పెరిగిపోయిన హైరిస్క్ పేషెంట్లలో ఒక చిన్న గొట్టాన్ని (దీన్ని ప్రోస్టేటిక్ స్టెంట్ అంటారు) యురెథ్రాలోకి అంటే మూత్రనాళంలోకి అమర్చడం ద్వారా ప్రోస్టేట్ పెరుగుదల వల్ల మూత్రప్రవాహానికి పడ్డ అడ్డంకిని అధిగమించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
డాక్టర్ నందకుమార్ మాధేకర్
యూరాలజిస్ట్, యాండ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్,
సన్‌షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement