బోరు తవ్వడానికి ముందే కందకాలు!

Trenches before borewell - Sakshi

పండ్ల తోట వేయాలనుకున్న భూమిలో బోరు వేయడానికి ముందే కందకాలు తవ్వించుకొని.. వాన నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాన్ని పెంపొందించుకున్న ఓ రైతు గాథ ఇది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మేరెడ్డి ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి తన 5 ఎకరాల ఎర్ర భూమిలో పండ్ల తోట నాటాలనుకున్నారు. అయితే, వర్షపాతం తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో బోర్లు వేసినా పెద్దగా నీరు రావటం లేదు. తన పొరుగు పొలంలో ఒక రైతు 2, 3 బోర్లు వేసినా వ్యవసాయానికి సరిపోయేంత నీరు రావడం లేదు.

ఇది గమనించిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తొలుత తన భూమిలో కందకాలు తవ్వించుకోవడం విశేషం. తన సోదరుడు, తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074), అధ్యక్షులు సంగెం చంద్రమౌళి(98495 66009)లను రెండేళ్ల క్రితం వెంటబెట్టుకెళ్లి వాలుకు అడ్డంగా, ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో, మీటరు లోతు మీటరు వెడల్పున కందకాలు తీయించారు. కందకం 25 మీటర్ల పొడవున తవ్విన తర్వాత 5 మీటర్ల ఖాళీ వదిలి ఆ తర్వాత.. అదే వరుసలో మరో కందకం తవ్వించారు. తర్వాత ఏడాది వర్షాలు పడినప్పుడు భూమిలో కురిసిన ప్రతి నీటి బొట్టూ కందకాల ద్వారా భూమిలోకి ఇంకి భూగర్భ నీటి మట్టం పెరిగింది.

గత ఏడాది బోరు వేయడంతో రెండించుల నీరు పడింది. తదనంతరం 5 ఎకరాలకు ఫెన్సింగ్‌ వేయించారు. ప్రస్తుతం పండ్ల తోట నాటడానికి సిద్ధమవుతున్నారు. పండ్ల మొక్కల మధ్యలో అంతరపంటగా చిరుధాన్యాలను సాగు చేయాలని భావిస్తున్నానని ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి(99636 41978) తెలిపారు. కందకాల వల్లనే తన భూమిలోని బోరులో నీరు పుష్కలంగా వస్తున్న విషయం తెలిసి కూడా ఇతర రైతుల్లో ఆలోచన రావటం లేదని, కందకాలు తవ్వితే భూమి వృథా అవుతుందని ఆలోచిస్తున్నారని అన్నారు. కందకాల ద్వారా వాన నీటి సంరక్షణ ప్రయోజనాలను రైతులకు వివరించి వారిలో చైతన్యం తెచ్చేందుకు తమ గ్రామంలో సదస్సు నిర్వహించాలని కూడా ఆయన భావిస్తుండటం ప్రశంసనీయం.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top