ఈ లుకేమియా గురించి తెలుసుకోండి...

Today is cml day - Sakshi

నేడు  సీఎమ్‌ఎల్‌  డే

తెల్లరక్తకణాలు సైనికుల్లాగా మన దేహాన్ని కాపాడుతుంటాయి. అవన్నీ మన ఎముకలోని మూలగలో పుడుతుంటాయి. ఇలా పుట్టే క్రమంలో ఒక కణం రెండు కావాలి. ఆ రెండూ మళ్లీ మరో రెండుగా మారాలి. ఇదీ దేహధర్మం. విభజనలో కణాల పాటించాల్సిన ధర్మం ఇది. అయితే లుకేమియా వచ్చినప్పుడు మాత్రం ఒకటి రెండు కావాల్సినవి కాస్తా... వందలవుతాయి. దాంతో దేహంలో 5,000 నుంచి 11,000 ఉండాల్సిన తెల్లరక్తకణాలు కాస్తా ఒక లక్షా, రెండు లక్షలకు పెరుగుతాయి. ఇది రక్తానికి వచ్చే ఒక క్యాన్సర్‌. ఈ క్యాన్సర్‌నే లుకేమియా అంటారు. 

లుకేమియాలో రెండు రకాలు... 
ఈ లూకేమియాలో రెండు రకాలు ఉంటాయి. మొదటిది అక్యూట్‌ లుకేమియా. అంటే  ఇందులో కణాల విభజన తక్షణం కనిపిస్తుంది. లక్షణాలు వెంటనే  బయటపడతాయి. అంటే కణవిభజన చాలా వేగంగా త్వరత్వరగా జరుగుతుంది. క్రానిక్‌ లుకేమియాలో ఒక రకం క్రానిక్‌ మైలాయిడ్‌ లుకేమియా. ఇది దీర్ఘకాలిక క్యాన్సర్‌. చాలాకాలం పాటు ఈ క్యాన్సర్‌ ఉంటుంది. ఇది మెల్లగా పెరుగుతుంది. రక్తానికి సంబంధించిన ఈ క్రానిక్‌ మైలాయిడ్‌ లుకేమియా వ్యాధిపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం.  

ఈరోజే ఎందుకు...? 
ఈ రోజును ‘సీఎమ్‌ఎల్‌–డే’ గా నిర్ణయించడానికి ఒక కారణం ఉంది. ఈ కారణాన్ని  తెలుసుకోవాలంటే నిజానికి సీఎమ్‌ఎల్‌ ఎలా వస్తుందో, అలా రావడానికి దేహంలో ఎలాంటి ప్రక్రియలు జరుగుతాయో కాస్త అర్థం చేసుకోవాలి.  మన ఒంట్లో నిత్యం రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. రక్తంలో అనేక రకాల అంశాలు ఉన్నప్పటికీ ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్స్‌లెట్స్‌ అనేవి చాలా ప్రధానమైనవి. ఇందులో తెల్లరక్తకణాలు మన దేహంలో రక్షణ కల్పించే సైనికుల భూమిక నిర్వహిస్తాయి. ఇవి మన ఒంట్లోకి ప్రవేశించే అనేక హానికారక సూక్ష్మజీవులు, వాటి వల్ల వచ్చే వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాయి. ఇవి ఎముక మధ్య భారంలో ఉండే మూలుగ/మజ్జలో నిత్యం పుడుతూ ఉంటాయి. పాతవి నశిస్తూ... వాటి స్థానంలో కొత్తవి పుడుతూ ఉండటం వల్ల వాటి సంఖ్య ఎప్పుడూ తక్కువలో తక్కువ 5,000 నుంచి గరిష్టంగా 11,000 వరకు ఉండాల్సిన వాటి సంఖ్య అపరిమితంగా పెరిగి దాదాపు రెండు లక్షలకు చేరుకుంటుంది. అలాంటప్పుడు అవి వాటి రక్షణ బాధ్యతలు నిర్వహించకపోవడంతో తరచూ ఇన్ఫెక్షన్లు సోకడం, జ్వరాలు రావడం జరుగుతుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో చూద్దాం. 

మనిషిలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అంటే... మొత్తం 46 అన్నమాట. ఆ క్రోమోజోముల్లోని 9వ, 22వ క్రోమోజోముల్లో తేడాలు వస్తాయి. అంటే తొమ్మిదో క్రోమోజోములోని కొంత భాగం 23వ క్రోమోజోముకూ, అదే విధంగా 23వ క్రోమోజోములోని మరికొంత భాగం 9వ క్రోమోజోముకు వెళ్తాయి. దీన్నే క్రోమోజోమల్‌ ట్రాన్స్‌లొకేషన్‌ అంటారు. ఈ ట్రాన్స్‌లొకేషన్‌ కారణంగా ‘ఫిలడెల్ఫియా క్రోమోజోమ్‌ అనేది çరూపొందుతుంది. (అమెరికన్‌ పద్ధతిలో చెబితే) ఈ రోజు తేదీ 9 / 22 కాబట్టి... ఈ క్రోమోజోమల్‌ మార్పునూ 9 : 22 అంటారు కాబట్టి ఈ తేదీని ‘క్రానిక్‌ మైలాయిడ్‌ లుకేమియా’ డే గా చెబుతారు. ప్రతి ఏడాదీ ఈ తేదిని క్రానిక్‌ మైలాయిడ్‌ లుకేమియా (సీఎమ్‌ఎల్‌) అవగాహన దినంగా వ్యవహిరిస్తుంటారు. 

లక్షణాలు: సీఎమ్‌ఎల్‌ వచ్చిన రోగుల్లో అన్ని వయసులో వారు ఉంటారు. ముఖ్యంగా పెద్దల్లో ఇది 50, 60 ఏళ్లు దాటిన వారిలో కనిపించడం సహజమే అయినా చిన్న పిల్లల్లోనూ ఇది చాలా సాధారణం. చిన్న పిల్లల్లో వచ్చే క్యాన్సర్లలో లుకేమియాలే  ఎక్కువ. చిన్నపిల్లల్లో వచ్చే సీఎమ్‌ఎల్‌ను జువెనైల్‌ లుకేమియా అంటారు. ఇది వచ్చిన వారిలో తెల్లరక్తకణాలు సరిగా పనిచేయకపోవడంతో తరచూ ఇన్ఫెక్షన్లు సోకడం, జ్వరం రావడం, నిస్సత్తువగా, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక పిల్లల్లోనైతే వారు పాలిపోయినట్లుగా ఉండటం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, నీరసం, అలసట ఎక్కువగా ఉండటం, త్వరగా చర్మం కమిలిపోవడం, మచ్చలుమచ్చలుగా ఉండటం, తీవ్రమైన రక్తస్రావం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే లుకేమియాను అనుమానించాల్సి ఉంటుంది. 

నిర్ధారణ పరీక్షలు: సాధారణంగా జ్వరం లేదా ఇన్ఫెక్షన్లు మాటిమాటికీ వస్తున్నప్పుడు చేయించే సాధారణ రక్తపరీక్షలోనే (పెరిఫెరల్‌ స్మియర్‌) అసాధారణంగా పెరిగిపోయిన తెల్లరక్తకణాల సంఖ్య (కౌంట్‌)తో ఇది బయట పడుతుంది. కొన్నిసార్లయితే జనరల్‌ చెకప్‌లో భాగంగా చేయించిన రక్తపరీక్షలలో బయటపడవచ్చు. అప్పుడు నిర్ధారణ కోసం బోన్‌ మ్యారో పరీక్ష అనే నిర్దిష్టమైన  పరీక్ష చేయించాలి. సైటోజెనిక్‌ టెస్ట్‌గా పేర్కొనే ఆ పరీక్షలో మూలకణంలో వచ్చిన మార్పుల కారణంగా రూపొందిన ‘ఫిలడెల్ఫియా క్రోమోజోమ్‌’ ఉనికితో సీఎమ్‌ఎల్‌ను నిర్ధారణ చేయడం జరుగుతుంది. 

దశలు: తీవ్రతను అనుసరించి ఇందులో స్టేజ్‌–1, స్టేజ్‌–2, స్టేజ్‌–3 అనే దశలు ఉంటాయి. మొదటిదాన్ని క్రానిక్‌ దశ అని, రెండో దశను యాక్సిలరేటెడ్‌ దశ అని, మూడోదాన్ని  బ్లాస్ట్‌ క్రైసిస్‌ అని అంటారు. అయితే ఇటీవల స్టేజ్‌–1లోనే చాలా ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. పైగా ఈ దశలో కనుకొన్నప్పుడు దాని నియంత్రించడం కూడా తేలిక. 

చికిత్స: ఒకప్పుడు అంటే... 1990లలో క్రానిక్‌ మైలాయిడ్‌ లుకేమియా వస్తే గరిష్ఠ ఆయుఃప్రమాణం ఐదేళ్లు, బతికి బయటపడేవారు కేవలం 30% మాత్రమే ఉండేది. కానీ 1990లలో వచ్చిన ఇమాటనిబ్‌ మిసైలేట్‌ అనే ఒకే ఒక టాబ్లెట్‌తో దీన్ని చాలా సమర్థంగా అదుపు చేయవచ్చు. దాంతో ఇప్పుడు ఈ జబ్బు వచ్చిన ప్రతివారు దాదాపుగా నార్మల్‌ వ్యక్తిలాంటి ఆయుప్రమాణం తోనే జీవించవచ్చు. ఫలితంగా ఇప్పుడు బతికి బయటపడేవారు దాదాపు 80% – 90% వరకు ఉంటున్నారు. అయితే ఈ ఇమాటనిబ్‌ మిసైలేట్‌ అనే మాత్రతో జబ్బు పూర్తిగా నయం కాదు... కానీ అదుపులో ఉండి, వ్యక్తులు సాధారణ ప్రజల్లాగే నాణ్యమైన జీవితం గడపగలుగుతారు. అయితే జబ్బు పూర్తిగా లేకుండా పోవాలంటే మాత్రం  ‘బోన్‌ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేన్‌’ చేయించాలి. కానీ ఇటీవల కేవలం మాత్రలతోనే జబ్బు ఎప్పటికీ నియంత్రణలో ఉండటం వల్లనూ, అనేక స్వచ్ఛంద సేవా సంస్థలతో పాటు ఆరోగ్యశ్రీ లోనూ ఇవి ఉచితంగా లభిస్తూ ఉండటం వల్ల ఇమాటనిబ్‌  మిసైలేట్‌ను వాడుతూ వ్యాధిని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడమే జరుగుతోంది. 
డాక్టర్‌ కె. సుధీర్‌రెడ్డి, ఎండీ,, డీఎమ్,  మెడికల్‌ ఆంకాలజిస్ట్, 
ఒమెగా హాస్పిటల్స్,  కర్నూలు.  ఫోన్‌ నెం. 08518273001 నుంచి 008 వరకు

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top