తనంతటివాడు

 There was an urgent need to go out - Sakshi

 చెట్టు నీడ

అతను ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. సైన్స్‌ అంటే ఇష్టం. ఒక రోజున ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్‌ హెమ్ప్రీ డేవీ ఉపన్యాసం వినేందుకు వెళ్లాడు. డేవీని కలిశాడు. ‘మీ ప్రయోగశాలలో ఏదయినా ఉద్యోగం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను’ అన్నాడు. డేవీ అతని ఉబలాటాన్ని గమనించి, తన ప్రయోగశాలలో చేర్చుకున్నాడు.
ఒకరోజు రాత్రి డేవీ తన ల్యాబ్‌లో ఏదో ద్రావణాన్ని తయారు చేస్తున్నాడు. ఇంతలో ఆయనకు అత్యవసరంగా బయటకు వెళ్లవలసిన పని పడింది. దాంతో ఆయన ‘నేను ఈ ద్రావణంతో కొత్త ప్రయోగం చేయబోతున్నాను. అందుకు దీన్ని చేతితో కదుపుతూ ఉండాలి. నీవు దీనిని నేను వచ్చేంతవరకూ కదుపుతూ ఉండు. నేను త్వరగానే వస్తా’ అని చెప్పి బయటికి వెళ్లాడు. 

ఆ కుర్రాడు ఆ ద్రావణాన్ని కదిపే పని ప్రారంభించాడు. అలా గంటలు గడిచిపోతున్నా, విసుగూ విరామం లేకుండా అతను ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్నాడు. తెల్లవారుతుండగా వచ్చాడు డేవీ.  ఏకాగ్రతతో తన పనిలో ఏమాత్రం లోటు రానివ్వకుండా ఆ ద్రావణాన్ని కదుపుతూనే ఉన్న తన యువ శిష్యుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు. ఆజ్ఞాపాలన,  ఉత్సాహం గల ఈ కుర్రాడు పెద్దయ్యాక ఎంతో ఎత్తుకు ఎదుగుతాడని గ్రహించి, మరింత వాత్సల్యంతో అతనికి పాఠాలు చెబుతూ, తనంతటివాడిగా తయారు చేశాడు.  డేవీ అంచనా వమ్ము కాలేదు. ఆ కుర్రాడు అనతికాలంలోనే డైనమో ద్వారా కరెంట్‌ను ఉత్పత్తి చేయగలిగాడు. రసాయన శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేసి, చిరస్మరణీయుడయ్యాడు. అతనే మైఖేల్‌ ఫారడే. 
– డి.వి.ఆర్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top