పిల్లల ఆరోగ్యమే.. మన మహాభాగ్యం

summer care to child - Sakshi

సమ్మర్‌ కేర్‌

వేసవి వచ్చిందంటే పిల్లలకు పరీక్షలు వస్తాయి. వాటి తర్వాత సెలవులు వచ్చేస్తాయి. ఆ సెలవులకు పిల్లలు అమ్మమ్మల ఇంటికీ, నానమ్మల ఇంటికీ బిరబిరా వచ్చేస్తారు. ఇక అస్తమానమూ ఆటలే. అందునా ఎర్రటి ఎండలో! నగరాల్లో, పెద్దపట్టణాల్లో ఇలా ఎండల్లో ఆటలాడే పరిస్థితి లేకపోయినా మిగతా చోట్ల పిల్లలు ఎంతో కొంత ఎండలో ఆడుతూనే ఉంటారు. ఇక నగరాల నుంచి పట్టణాలకు వచ్చిన పిల్లలూ అంతే. అలా ఈ వేసవి వేడిమిలో వాళ్లు ఆటలాడటం వల్ల వారిలోని శక్తి సన్నగిల్లుతూంటుంది. ఒంట్లోని నీళ్లూ, ఖనిజ లవణాలూ తగ్గిపోతాయి. మరి వాటిని భర్తీ చేయాల్సిన బాధ్యత తల్లులదే కదా. అందుకే ఆటల అల్లరి పిల్లల కోసం తల్లుల కోసం ఇవి కొన్ని ఆహార సూచనలూ, న్యూట్రిషన్‌ చిట్కాలు. 

►పాల ఉత్పత్తులు పుష్కలంగా పెట్టండి.  పిల్లలకు తాజా లస్సీ, తాజా మజ్జిగ, ఫ్లేవర్డ్‌ మిల్క్, ఫ్రూట్‌ మిల్క్‌ షేక్‌లు (మ్యాంగో మిల్క్‌ షేక్‌) వంటివి ఇవ్వండి. అవి పిల్లల శరీరానికి అవసరమయిన శక్తిని ఇస్తాయి. వాళ్లకు ప్రొటీన్లను అందజేస్తాయి. ఎముకల బలం కోసం క్యాల్షియమ్‌ను ఇస్తాయి. వేడిమిలో ఆడటానికి వీలుగా అదనపు ద్రవాలను  (ఫ్లూయిడ్లను) ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుంటాయి. 

►పిజ్జాలు, శాండ్‌విచ్‌ వంటివాటి కోసం వాళ్లు గొడవ చేస్తుంటారు. అవి హానికరమంటూ ఆ వయసు పిల్లలను సముదాయించడం, సమాధానపరచడం కష్టం. కాబట్టి వాటిలో పనీర్, తాజాకూరగాయలు పుష్కలంగా నిండి ఉండేలా ఇవ్వండి. కానీ ఎక్కువగా చీజ్‌ వేసిన వాటిని తినే విషయంలో మాత్రం అంతగా ప్రోత్సహించకండి. గ్రిల్‌డ్‌ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. లేదా పనీర్‌ రోల్స్‌ కూడా ఇవ్వవచ్చు.

►ఐస్‌క్రీముల కోసం కూడా వాళ్లు గొడవ చేస్తుంటారు. అలాంటప్పుడు ఇంట్లో తయారుచేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్‌ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్‌ వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఇవన్నీ ఆరోగ్యకరమే. కాకపోతే కూల్‌డ్రింక్స్‌ కోసం కూడా వాళ్ల గొడవ ఎక్కువగానే ఉండవచ్చు. కానీ అందుకు ప్రోత్సహించకండి. మరీ ముఖ్యంగా కోలా డ్రింక్స్‌. వాటికి బదులు చల్లటి తాజా పండ్లరసాలను ఇస్తామంటూ బేరంపెట్టండి. ఈ బేరం అటు పెద్దలకూ, ఇటు పిల్లలకూ... ఇద్దరికీ లాభదాయకమే.  ఈ వేసవి సెలవులు పూర్తయ్యేవరకూ పిల్లల విషయంలో ఇదే న్యూట్రిషన్‌ను కరాఖండీగా ఫాలో అవ్వండి. ఎందుకంటే పిల్లల హెల్తే... మన వెల్త్‌! 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top