పురుషులూ భాగస్వాములు కావాలి

special interview with santha sinha - Sakshi

మనసుకి బాధ కలిగించేది హింస. శారీరక, మానసిక, లైంగిక... ఏ హింస అయినా హింసే. అన్నిరకాల హింసా ఒకటే. దీనికి ఎక్కువ, తక్కువ స్థాయిలు ఉండవు.  ముఖ్యంగా  స్త్రీకి సంబంధించి ఇలా ఆమెను బాధపెట్టి ఆమె నోరుమూయించే ప్రయత్నం జరుగుతోంది. ఇది పితృస్వామ్యంలో భాగం. ఇది సరైంది కాదు. ఎక్కడ హింస జరుగుతుందో అక్కడ మానవహక్కుల ఉల్లంఘన జరిగినట్టే. హ్యూమన్‌ డిగ్నిటీ దెబ్బతిన్నట్టే. అసలు నిత్యజీవితంలో స్త్రీ, పురుషులు యుద్ధరంగంలో ఉన్నట్టే ఉంటాము. ఎవరూ గమనించని సత్యం ఇది.

దెప్పడం, హేళన చేయడం, తిట్టడం, అనుమానపడటం వంటివి జరుగుతూనే ఉంటాయి. చుట్టుపక్కల అందరికీ తెలుస్తుంటుంది ఇది. కాని ఎవ్వరూ జోక్యం చేసుకోరు. అది ప్రైవేట్‌ వ్యవహారం అని ఊరుకుంటారు. ఇలా ఊరుకోవడం వల్ల ఆ హింస శారీరక హింసకు దారితీస్తుంది. మనదగ్గర చట్టాల గురించి ఎవరికీ తెలియదు. పోలీసులు అంటే భయం. కంప్లయింట్‌ చేయడం అంటే భయం. ఎవిడెన్స్‌ అడిగితే ఎక్కడినుంచి తేవాలి? రోజూవారి కార్యక్రమాలను పక్కన పెట్టి పోలీసుల చుట్టూ తిరగడం అంటే భయం. వీటన్నిటికీ భయపడి సమస్యను భరించడమంటే మానవహక్కుల ఉల్లంఘనను సమర్థిస్తున్నట్టే.

తన పొరుగు ఇంట్లో హింస జరుగుతున్నా పట్టించుకోవట్లేదంటే ఆ హింసను సమర్థిస్తున్నట్టే. ఈ హింసకు ధనిక,పేద తేడా లేదు. పేదవర్గంలో జరిగేది బయటకు వస్తుంది. ధనికవర్గంలో జరిగే హింస బయటకు రాదు. దీని మీద మన దేశంలో కొన్నేళ్లుగా పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. స్త్రీలు తమ హక్కుల కోసం పోరాడుతూ డౌరీ ప్రొహిబిషన్‌ యాక్ట్, ది ప్రొహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌మ్యారేజ్‌ యాక్ట్, డౌరీ ప్రొహిబిషన్‌ యాక్ట్, మెటర్నిటీ బెనిఫిట్‌ యాక్ట్, సెక్సువల్‌ హెరాస్‌మెంట్‌ ఆఫ్‌ విమెన్‌ ఎట్‌ వర్క్‌ప్లేస్‌ యాక్ట్, ఇండీసెంట్‌ రిప్రంజెంటేషన్‌ ఆఫ్‌ విమెన్‌ యాక్ట్, నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ విమెన్, ఈక్వల్‌ రెమ్యూనరేషన్‌ యాక్ట్, డొమెస్టిక్‌ వయలెన్స్‌ యాక్ట్‌  వంటి చట్టాలను తెచ్చుకున్నారు.

ఇంకా ముందుకు వెళ్లాలి.  మహిళలు, మగవాళ్లు అనేది ఓ డివిజన్‌. డైవర్సిటీ ఆఫ్‌ నేచర్‌. కాని హక్కులు అందరికీ సమానమే. స్త్రీలు తక్కువ కాదు. మహిళల విషయంలో కాస్ట్‌ అప్రెషన్, జెండర్‌ అప్రెషన్‌ రెండూ ఉన్నాయి. స్త్రీలంటే తక్కువ. అందులో దళిత స్త్రీలంటే ఇంకా తక్కువచూపు ఉంది. ఇది పోవాలి అంటే ఈ పోరాటంలో పురుషులూ పాలుపంచుకోవాలి. సమానత్వం, కొత్త సంస్కృతి, భద్రత కోసం ఈ పోరాటంలో వాళ్లూ భాగస్వాములు కావాలి. అయితే ఇదివరకన్నా ఇప్పుడు పరిస్థితి కొంత మారింది.

ఇంతకుముందు చేసిన ఉద్యమాలు, చర్చల వల్ల కొంత చైతన్యం అయ్యారు. ముఖ్యంగా మన దేశంలో స్త్రీలకు సంబంధించి పురుషుల ఆలోచనా ధోరణి కొంత మారింది. మహిళల హక్కులను గుర్తిస్తున్నారు. వాళ్ల స్పేస్‌ను యాక్సెప్ట్‌ చేస్తున్నారు. గౌరవిస్తున్నారు. ఇంకా మార్పు రావాలి. ఈ ఉద్యమం మరింత లోతుకు వెళ్లాలి. స్త్రీ, పురుషులు, ఎల్‌జీబీటీ అందరూ సమానమే అని ఆలోచిస్తూ అంతా ఒక్క తాటిమీదకు రావాలి. ఆ బీజం ఉంది. ఆ ఆశయసాధన కోసం స్త్రీపురుషులు కలిసి పోరాటం చేయాలి!!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top