తెలుసుకుంటే చాలు

 special  chit ahat with Retired ex DGP Aravinda Rao

నేను  నా దైవం

ప్రేమకు నిర్వచనం ఒకటే ఉంటుందా?! ఎన్నో రకాలుగా ఉంటుంది.
మూమూలు ప్రేమకే అంత శక్తి ఉంటే.. మరి దైవశక్తిలో ఎంత ప్రేమ ఉండాలి?!
అందుకే.. భగవద్గీతను తెలుసుకోవచ్చు కానీ... తెలిసిపోయిందనుకోవడం సరికాదు.
గీతలో ప్రతి అధ్యాయం, ప్రతి శ్లోకం... ప్రతిసారీ ఒక కొత్త కోణంలో దైవప్రేమను
సాక్షాత్కరింపజేస్తుంది. జీవితంలోని ప్రేమను అర్థం చేసుకోడానికి భగవద్గీతను తెలుసుకుంటే చాలు!

మీలో ఎప్పుడూ ఒక బ్యాలెన్స్‌ కనిపిస్తుంది. అటు ఉద్యోగధర్మాన్ని, ఇటు జీవన ధర్మాన్ని బ్యాలెన్స్‌ చేయడం అంత సులువు కాదు కదా!
(నవ్వుతూ)పెరిగిన గ్రామీణ వాతావరణం, సంప్రదాయ జీవనశైలి, అమ్మనాన్న (అన్నపూర్ణ, లక్ష్మీనారాయణ)ల వద్ద నేర్చుకున్న రామాయణ, భారత కథలు, స్కూల్లో చదువుకున్న వేమన, సుమతీ శతకాలు ఇందుకు కారణాలు అయ్యుంటాయి. మాది అనంతపురం జిల్లా, గోరంట్ల గ్రామం. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని. ఎప్పుడూ పెద్ద పెద్ద కోరికలు లేవు. దేనికీ పెద్దగా ఎగై్జట్‌ అవను. మోడ్రన్‌ కాన్వెంట్‌లో చదివిన విద్యార్థికంటే మామూలు స్కూల్‌లో చదివిన విద్యార్థి జీవితంలో వేటినైనా ఎదుర్కోగలడు అని స్వయంగా తెలుసుకున్నాను. మా సర్వీస్‌లో చూసినా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చినవారు అందరితో కలిసిపోతుంటారు. అదే పెద్దపెద్ద కాన్వెంట్‌లలో చదివి వచ్చిన వాళ్లు మామూలు వాళ్లతో కలవరు. వారిలో కాన్ఫిడెన్స్‌ లెవల్‌ తక్కువగా ఉండటం చూశాను. ఇక నా విషయానికి వస్తే, దేవుడంటే భయం కాకుండా భక్తి, ప్రేమ ఉంది. అలాగే భక్తి నుంచి దైవాన్ని అర్థం చేసుకునే దిశగా పయనిస్తున్నాను. ఇవన్నీ జీవితంలో అన్నింటినీ బ్యాలెన్స్‌ చేసుకోవడం నేర్పుతున్నాయి.

దైవాన్ని అర్ధం చేసుకునే దిశగా పయనిస్తున్నాను అంటున్నారు? ఎలా?
భగవద్గీతను చదవడం, అర్థం చేసుకునే క్రమంలో ఈ విషయం స్పష్టమైంది. అప్పట్లో నేను నలభై ఏళ్ల వయసులో డీఐజీగా గుంటూరు, కృష్ణా జిల్లాలలో విధులు నిర్వర్తిస్తున్నాను. పోలీసు వ్యవస్థలో స్పెషల్‌ బ్రాంచ్‌ అనేది ఉంది. అక్కడికి వివిధ మతాలకు చెందిన ఏవేవో కరపత్రాలు వస్తుండేవి. ఇవన్నీ చదివినప్పుడు సమాజంలో మతం గురించి ఇంత యాక్టివిటీ జరుగుతుందేంటా అనే ఆలోచన మొదలైంది. ఆ టైమ్‌లోనే కొంతమంది ప్రొఫెసర్లను కలిశాను. భగవద్గీత ఔన్నత్యం గురించి అప్పుడే తెలిసింది. పుల్లెల శ్రీ రామచంద్రుడు వంటివారి ద్వారా సీరియస్‌గా భగవద్గీతను చదవడం అలవాటు చేసుకున్నాను. సంస్కృతం కూడా తెలిసి ఉండటం వల్ల భగవద్గీతతో పాటు రామాయణం, భారతం, ఉపనిషత్తులనూ అధ్యయనం చేస్తూ వచ్చాను.
 
భగవద్గీత మిమ్మల్ని అంతగా ఎందుకు ఆకట్టుకుంది? ఏ విషయాలు మిమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి?
మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా మంది మేధావులను ప్రభావితం చేసిన మహాగ్రం£ý ం భగవద్గీత. దీనిని అర్జునుడికి కృష్ణుడు బోధించి ఉండవచ్చు. కానీ, ఇది కృష్ణుడు గురించి కాదు... దేవుడంటే ఫలానా వ్యక్తి కాదు. దేవుడు ఆకాశంలో మాత్రమే ఉండడు. అతనో సూపర్‌ కాప్‌ లేదా సూపర్‌ కంప్యూటర్‌ కాదు. దేవుడు నీలోనే ఉన్నాడు అనే విషయం భగవద్గీత స్పష్టం చేస్తుంది. మతం ఎప్పుడూ మనిషిని మంచిమార్గంలో పెట్టడానికి పనిచేస్తుంది. అయితే, అసలు తత్త్వం ఏమిటనేది భగవద్గీత చెబుతుంది. ఈ అనంత విశ్వం దేవుడైతే అందులో నువ్వూ ఉన్నావు. నీలో ఉన్నదే భగవంతుడు అని కళ్లకు కడుతుంది. మనిషి మనస్తత్వాన్ని బాగా అవగాహన చేసి మన మందుకు తెచ్చిన మహాగ్రంథం. ప్రకృతిలో ఉన్న రజో, తమో, సత్వ గుణాలున్నట్టే అవి మనిషిలోనూ ఉన్నాయి. అయితే, ఒకరిలో ఒక్కోగుణం ఎక్కువ ఉంటుంది. అవే మంచి చెడులుగా నిర్ణయమవుతాయి. వీటిని దాటి బయటకు రా అంటుంది భగవద్గీత. మూర్ఖస్థాయి నుంచి అమోఘ స్థాయికి చేరుకోవడం ఎలాగో చెబుతుంది. సర్వాత్మభావన, ఆత్మశుద్ధికి అమోఘంగా పనికి వస్తుంది. నెల రోజుల క్రితం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో గ్లోబల్‌ గీతా కాన్ఫరెన్స్‌ జరిగింది. అందులో ‘కర్మయోగ’పై పేపర్‌ ప్రెజెంట్‌ చేశాను. ఈ సమావేశానికి ఎంతోమంది పాశ్చాత్య ప్రొఫెసర్లు కూడా వచ్చి మన భగవద్గీత గురించి ఎంతో వివరణాత్మకంగా మాట్లాడారు.
 
భగవద్గీత చెప్పినట్లు దేవుడు ఒక వ్యక్తి కాదు? మరి దేవుడు అంటే ఎవరు?
మతపరంగా రెండు రకాల దేవుళ్లున్నారు. ఒకటి– చారిత్రక దేవుళ్లైన రాముడు, కృష్ణుడు మొదలైనవారు. రెండు– పురాణాల దేవుళ్ళైన శివుడు, విష్ణువు, గణేషుడు, అమ్మవారు.. వీరిని ఒక్కో శక్తికి గుర్తులుగా మనమే ఏర్పాటు చేసుకున్నాం. ఉపనిషత్తుల్లో చెప్పినవిధంగా దేవుడు అనేది శుద్ధచైతన్యం. ఆ చైతన్యం నుంచి ఈ ప్రపంచం విస్తరించింది. ఇప్పుడు సైన్స్‌ ఎలా చెబుతుందో ఒకప్పుడు ఉపనిషత్తుల ద్వారా వివరించారు. అయితే, ఉపనిషత్తులో ఉన్నటువంటి విషయాలు కథల రూపంలో తీసుకువచ్చారు. లలితాత్రిపురసుందరి ఫొటోని గమనించండి. శివుడు పడుకొని ఉంటాడు. ఆయన పైన అమ్మవారు కూర్చొని ఉంటారు. ఎందుకు? ఇక్కడ శివుడు శుద్ధ చైతన్యానికి గుర్తు. ఈ చైతన్యంలోనే శక్తి ఉంటుంది. ఈ శక్తిని మనం అమ్మవారిగా భావించుకున్నాం. అంటే, చైతన్యం పైన ఆధారపడిన సృజనాత్మక శక్తిని మనిషి స్త్రీ రూపంగా సృష్టించాడు. సృష్టించినవాడు బ్రహ్మ అని, విష్ణువు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని, శివం అంటే మంగళకరమైన వాడనీ అర్థం. శివుడికి, విష్ణువుకు తేడా ఎలాంటిదో వేదాల్లో చెబుతారు. కానీ, మతపరంగా మనవాళ్లు మరోలా తీసుకున్నారు. నిజానికి భౌతికంగా దేవుడు అంటే ఇలాగే ఉంటాడని లేదు. మనిషి ఊహలో పుట్టినవారు దేవుళ్లు. భాగవతంలో చిన్న చిన్న కథలు ఉంటాయి. వాటిని వయసు తేడా లేకుండా చిన్నపిల్లవాడు ఎంజాయ్‌ చేస్తాడు, పెద్దవాళ్లూ ఎంజాయ్‌ చేస్తారు. అందుకే అందరి దేవుళ్లపైనా రకరకాల కథలు సృష్టించబడ్డాయి. దేవుడు ఫలానాచోటు మాత్రమే ఉండడు. మన ఇంట్లోనూ, ఒంట్లోనూ, మనసులోనూ ఉన్నాడు. తత్త్వం స్థాయిలో తెలుసుకునేవాడికి ఏ దేవుడైనా ఒకటే! దేవాలయాల్లో, పూజల్లో చివర్లో చెప్పే మంత్రపుష్పంలో లాగా మనం ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో ఫలం లభిస్తుంది. అల్లా, జీసస్‌ అనుకున్నా అదే విధమైన ఫలం వస్తుంది.  
 
ఆలయానికి తరచూ వెళుతుంటారా? ఏ ఆలయం బాగా నచ్చుతుంది?
ఆలయాలు అన్నీ సందర్శిస్తుంటాను. అయితే, ఏదైనా కోరుకోవడం కోసం వెళ్లను. ముఖ్యంగా ప్రాచీన ఆలయాలు, వాటి నిర్మాణ శైలిని ఇష్టపడతాను. తమిళనాడు దేవాలయాలు మహాకావ్యంలా ఎంతో శిల్పశాస్త్రం, నాట్యశాస్త్రం కళ్లకు కడతాయి. మన వైపు శ్రీకాళహస్తి ఆలయం అద్భుతంగా కనిపిస్తుంది.
 
మీ నాన్నగారు గ్రామ కరణంగా ఉండేవారు. మీరు పోలీసు శాఖలోకి వచ్చారు. అసలు ఖాకీకి–ఉత్తరీయానికి పొత్తు ఎలా కుదిరింది?
యాక్సిడెంటల్‌గా జరిగింది. అనేక ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మా ప్రొఫెసర్లు చెప్పి, ప్రోత్సహించారు. మిగతా అన్ని పరీక్షలతో పాటు నేనూ, మా స్నేహితులు యూపీఎస్సీ ఎగ్జామ్‌ కూడా రాశాం. ఈ ఉద్యోగానికి నేను సెలక్ట్‌ అయ్యాను.  

దైవం తప్పు చేసినవారిని కూడా క్షమించమంటుంది. మీ విధి నిర్వహణేమో శిక్షించమంటుంది. ఈ మీమాంసను ఎలా ఎదుర్కొన్నారు?
దేవుడు ఇంకా క్రూరంగా శిక్షిస్తాడు! అందుకేగా నరకం అంటూ ఉంది. తప్పు చేసినవాడిని శిక్షించాల్సిందే! ఇందులో ఎలాంటి మీమాంస లేదు. అయితే, పశ్చాత్తాపం చెందినవాడిని మాత్రం శిక్షించకూడదు. నక్సలైట్‌ రీహాబిలిటేషన్‌ ఈ కేటగిరి కిందకే వస్తుంది. నక్సలైట్లలో చాలా మంది పల్లెల్లో ఉన్నవారే. వాళ్లు అమాయకులు. ఏదో కొత్త రాజ్యాన్ని స్థాపిస్తానని నక్సలిజంలోకి వెళ్లినవారు కొన్నాళ్లకు ఇదంతా సరైనది కాదు అని బయటకు వచ్చినవారున్నారు. అలాంటి వారిని జనంలోకి తీసుకురావడానికి కృషి చేశాం.

టెక్‌ మధు అనే అతను రాకెట్స్‌ తయారుచేసేవాడు. మద్రాసులో పెద్ద షాప్‌ పెట్టారు. ముందు షాపులో వస్తువులు అమ్మేవారు. వెనకాల రాకెట్స్‌ తయారు చేసేవాళ్లు. కొన్నాళ్లకు అతడే రియలైజ్‌ అయ్యాడు. బయట అంతా ఎంతో అభివృద్ధి కనిపిస్తోంది. ఇంత అభివృద్ధి చెందుతున్న వ్యవస్థను మనం భూస్వామ్యం అంటూ కూలగొట్టడం ఎందుకు... అని బయటకు వచ్చేశాడు. అభినందించి, గవర్నమెంట్‌ నుంచి రావాల్సిన మొత్తాన్ని అందజేశాం. తిరిగి కొత్త జీవితం ఆరంభించాడు. ఇలాంటివి జరిగినప్పుడు సంతోషం అనిపిస్తుంది. చాలా మందితో సరెండర్‌ అవమని చెప్పినవి, అలా సమాజంలో వారికో స్థానం కల్పించిన సంఘటనలు ఎక్కువ.

దేవుడా గట్టెక్కించు అనుకున్న సందర్భాలు న్నాయా?
తప్పకుండా ఉన్నాయి. నలభై ఏళ్ల వరకు ఏమీ అనుకోలేదు. ఆ తర్వాత మాత్రం కష్ట సమయాలు వచ్చినప్పుడు దేవుణ్ణి పూజించడం వంటివి ఉన్నాయి. కోరుకున్నవీ ఉన్నాయి. ఇప్పుడైతే లేవు. వయసు పెరిగే కొద్ది ఆలోచనల్లో మార్పు వస్తుంది. అందుకు గ్రంథపఠనాలూ తోడ్పడతాయి.

కొన్నేళ్ల క్రితం మీ భూమి ఆక్రమణకు గురైనట్లు పేపర్లలో వార్తలు వచ్చాయి. ఈ కష్టాన్ని గట్టెక్కించమని దైవాన్ని కోరుకున్నారా?
కీసర గ్రామంలో ఈ సంఘటన జరిగింది. పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చాను. నేను పోలీసుశాఖకు చెందినవాడినే. ఓ పోలీసాఫీసర్‌ నుంచే ఆ స్థలం కొన్నాను. కొని కూడా పదేళ్లు అయ్యింది. కానీ, మధ్యలో కొందరు వచ్చారు. గ్రామాలలో ఉండే చిన్నస్థాయి లీడర్ల వల్లే ఇలాంటివి జరుగుతాయి. ‘ఎవరొచ్చినా ఈ భూమి కొనకూడదు’ అని సమస్యను సృష్టించారు. నేను కేసు పెట్టకపోతే తప్పుడు ల్యాండ్‌ కొన్నారనో, ఆక్రమించుకున్నారనో నలుగురూ అనుకుంటారు. ఏంట్రా దేవుడా ఈ సమస్య అనుకున్నానే కానీ, దీన్నుంచి గట్టెక్కించు అనుకోలేదు. మొత్తానికి క్లియర్‌ అయ్యింది.

మీ పిల్లలకు దైవం గురించిన విషయాలు ఎలాంటివి చెబుతుంటారు?
హిందూయిజం గురించి పిల్లలకు ఏవిధంగా చెప్పాలి (హౌ టు టెల్‌ హిందూయిజమ్‌ టు యువర్‌ చైల్డ్‌) అనే అంశాలతో పుస్తకం రాశాను. నేను మా పిల్లలకు చెప్పిన విషయాలన్నీ ఆ పుస్తకంలో ఉన్నాయి. హిందూయిజం అనేది మిగిలిన మతాల్లాంటిది కాదు.చాతుర్వర్ణం మయా సృష్టం.. గుణ కర్మ విభాగశః.. అని భగవద్గీతలో కుల ప్రసక్తి లేదు. అక్కడ వర్ణం గురించే చెప్పారు. సత్వరజస్తమో గుణాల వర్ణన అది. సత్వ గుణానికి అహింస మూలం, సత్యం, దానం, శౌచం.. ఈ గుణం ఉన్నవాడే బ్రాహ్మణుడు. ఈ గుణాలు లేనివాడు బ్రాహ్మణుడు కాదు. ప్రపంచంలో ఈ గుణాలు ఎవరిలో ఉన్నా అతడిని బ్రాహ్మణుడిగానే పరిగణించాలి అని చెప్పారు. అంటే గుణాలను బట్టి మనుషులను వర్గీకరించారు. రజోగుణంలో ఉన్నవాడిని క్షత్రియుడు అన్నారు. వీటిలోనూ రెండు వర్గాలున్నాయి. తమో గుణం ఉన్నవాడిని శూద్రుడు అన్నారు. మనుషుల పనులు వారు చేసే వ్యాపారాలను బట్టి మారి అవి కులాలుగా స్థిరపడ్డాయి. దీనికి కొన్నేళ్లుగా రాజకీయాలూ తోడయ్యాయి.
 
ఇప్పుడు విశ్రాంత జీవనంలో మీరు ఎంచుకున్న మార్గం?  
అద్వైత అకాడమీ పేరుతో భగవద్గీత ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకుంటున్నాను. వెబ్‌సైట్‌ ఉంది. యూ ట్యూబ్‌లో రామాయణం, భగవద్గీత, ఉపనిషత్తుల గురించి క్లాసులు తీసుకున్న వీడియోలు ఉన్నాయి. తెలుసుకున్నది పుస్తకాలలోనూ, వీడియోలలోనూ పొందుపరచడంలో తీరికలేకుండా ఉన్నాను.

మీ విధి నిర్వహణలో ఒకోసారి అవతలివారి ప్రాణం తీయాల్సిన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటప్పుడు దైవం పోసిన ప్రాణాన్ని.. మనం తీయడం ఏంటి, అనే భావన కలిగేదా?  
ఒక బా«ధ్యతాయుత ఉద్యోగంలో ఉన్నప్పుడు షూట్‌ చేసే సంఘటనలు ఉంటాయి. అలాంటివి చేయకపోతే మా వృత్తికి మేం అన్యాయం చేసుకున్నట్టే. దైవం దృష్టిలో కూడా అంతేగా... మన విధిని మనం నూటికి నూరు శాతం నిర్వర్తించాలి. క్లిష్ట సమయంలోనే షూట్‌ చేసే పరిస్థితి వస్తుంది. అలా లేకపోతే ‘ఆ వ్యక్తి’ మరో పదిమందినో, వంద మందినో చంపుతాడు. అయితే, చంపాలనే ఆలోచనతో చేయం. షూట్‌ చేసే సమయంలో కాలికో, చేతికో గాయం చేసి దోషిని పట్టుకోవాలని చూస్తాం.

ఎదుటివాడికి సాయపడటం దైవం అయితే, మనుషుల్లో మీరు చూసిన దైవత్వం?
పోలీసు శాఖలో ఇవి నిత్యకృత్యం. ఒకటని చెప్పలేను. ప్రజలకు రక్షణ ఇచ్చేందుకు కఠినంగా కనిపిస్తాం. కానీ, పోలీసులే సాయానికి మారుపేరుగా కనిపిస్తారు. దేవుడు రక్షకుడైనట్టే పోలీసు ఆ బాధ్యతను తీసుకున్నాడని భావిస్తాను.

 దైవం పట్ల భక్తి గొప్పదా? భయం గొప్పదా?
భగవద్గీత చదివిన తర్వాత దేవుడంటే ప్రేమ ఉంటుంది కానీ, భక్తి, భయం రెండూ ఉండవు. దేవుడంటేనే ఒక వెరీ ఫ్రెండ్లీ కాన్సెప్ట్‌. కృష్ణుడు, శివుడు, గణేషుడు.. వీరిని మనం ఎంత ప్రేమగా ఆరాధిస్తాం.  

అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి?
‘హూ యామ్‌ ఐ’ అంటే ‘నేను ఎవరిని?’ రమణ మహర్షి రచనల్లో మొదట ఈ ప్రశ్న కనిపిస్తుంది. అధి+ఆత్మ. నా గురించి అనేది ‘అధి.’ నేను ఏమిటి అనేది ఆత్మ. ఆత్మ గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఆత్మ గురించి తెలుసుకున్నాక దీని వెనుక ఉన్న చైతన్యం ఏంటి? అని ఆ స్థాయిలో మనం ఆలోచిస్తే అప్పుడు దేవుడు అంటే భయం, భక్తి అనే స్థాయిని దాటిపోతాం. ఇవన్నీ మన మంత్రాల్లో ఉన్నాయి. కానీ, మనవాళ్లు వివరించరు. ఒకరిద్దరు వివరించినా అవి అందరికీ చేరవు. ‘ఇక్కడ మునిగితేనే పుణ్యం, ఈ పూజ చేస్తేనే ఫలం’ అంటూ ఏమీ లేదు. అందరం అర్థం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ, వాటిని చెప్పగలిగేవారు లేరు. భగవద్గీత చదివితే మూఢనమ్మకాలన్నీ పోతాయి. సొంతంగా తప్పు చేయని స్థాయికి మనిషి ఎదుగుతాడు.
- నిర్మలారెడ్డి చిల్కమర్రి

తల్లి శ్రీమతి అన్నపూర్ణమ్మతో రిటైర్డ్‌ డీజీపీ కె. అరవిందరావు

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top