
అందమైన జుట్టుకు ఆరు పోషకాలే చాలా కీలకమని, ఆహారంలో భాగంగా ఈ పోషకాలను తీసుకుంటే జుట్టు గురించి దిగులు పడాల్సిన పనే లేదని అంతర్జాతీయ కేశ చికిత్స నిపుణులు చెబుతున్నారు. వారు చెబుతున్న ఆరు పోషకాలూ అందరికీ తెలిసినవే. అయితే, వాటిని సమతులంగా తీసుకుంటే చాలంటున్నారు.
ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, నీరు తగిన పరిమాణంలో తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని, ఆహార సమతుల్యత లేదా ఇతర కారణాల వల్ల మాడు పల్చబడిపోయినా, తిరిగి జుట్టు ఆరోగ్యకరంగా పెరుగుతుందని ఆస్ట్రేలియాకు చెందిన కేశ చికిత్స నిపుణురాలు సిమోన్ లీ చెబుతున్నారు. జుట్టు పెరుగుదలకు ప్రొటీన్లలో ముఖ్యంగా సిస్టీన్, లైసైన్, ఆర్గినైన్, మెథియోనైన్ అనే నాలుగు అమినో యాసిడ్లు కీలకమైనవని ఆమె వివరించారు.
వీటిలో లైసైన్, మెథియోనైన్ అమినో యాసిడ్లు శరీరంలో తయారయ్యేవి కావని, వీటిని ఆహారం ద్వారా మాత్రమే పొందగలమని, గుడ్లు, పాలు, పెరుగు, చీజ్, చికెన్, మటన్, చేపలు వంటి పదార్థాల్లో ఇవి పుష్కలంగా ఉంటాయని, వీటిని తరచుగా తీసుకుంటూ, ఇతర పోషకాలు కూడా ఆహారంలో ఉండేలా చూసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని సిమోన్ లీ వివరిస్తున్నారు.