రాణినీతి

She is Recognized as her Fathers Successor - Sakshi

మహారాజు కొడుకు రాజైతే రాజనీతి చెల్లుతుంది మహారాజు కూతురు.. మహారాణి కావాలనుకుంటే రాణినీతి రాజ్యమేలుతుంది ఈ స్టోరీ చదవండి అధికారం కోసం కాక.. ఆత్మభిమానం కోసం తనను తను నిరూపించుకునేందుకు ఒక కూతురు చేసినవారసత్వ యుద్ధమిది!

‘‘ఆషు ఏడి?’’ కళ్లు తెరిచిన ఆమేయరావు గైక్వాడ్‌ అడిగాడు కూతురు పూర్ణిమను. ‘‘వచ్చేస్తూంటాడు..’’ చెప్పే లోపే ఆషిష్‌ రానే వచ్చాడు. గైక్వాడ్‌ బెడ్‌కి ఒకపక్క కొడుకు.. ఇంకోపక్క కూతురు నిలబడి ఉన్నారు. కళ్లతోనే ‘‘కండువా’’ అని కూతురికి చెప్పాడు. వెళ్లి కండువా తెచ్చి తండ్రికి ఇచ్చింది. ఆ కండువా ఎవరి చేతికిస్తాడోనని పిల్లలిద్దరిలోనూ ఉత్కంఠ! అమేయరావు గైక్వాడ్‌ ఆ కండువాను కొడుకు చేతికిచ్చాడు. మహారాష్ట్ర జనశక్తి పార్టీ పగ్గాలను తన తర్వాత కొడుకుకు అప్పజెప్తూ!ఖిన్నురాలవుతుంది పూర్ణిమ. ‘‘నీ మీద దాడి చేయించిన ముఖ్యమంత్రి గోపాల్‌ గురవ్‌తో చేయి కలిపాడని తెలిసీ పార్టీ నాయకత్వాన్ని తమ్ముడికి కట్టబెడ్తున్నావా  నాన్నా?’’ అడుగుతుంది కూతురు. అవునన్నట్టు తలూపాడు అమేయరావు. ‘‘నా తర్వాత పార్టీని నడిపించే అర్హత నీకే ఎక్కువ పూర్ణీ! నీతో పోలిస్తే వయసులోనే కాదు అన్నిట్లో వాడు తక్కువే. కాని వాడు మగపిల్లాడు. ఆషిష్‌ గైక్వాడ్‌.

నువ్వు ‘శ్రీమతి పూర్ణిమా ఆమ్రే’వి. ఒప్పుకుంటాను వాడికి ఆవేశం ఎక్కువని. కాని నేర్చుకుంటాడు. బాధ్యత నేర్పిస్తుంది. అదిగాక.. వాడిలో క్రూరత్వం ఉంది. రాజకీయాల్లో రాణించడానికి అది చాలా అవసరం. ప్రకృతి మగాళ్లకి మాత్రమే క్రూరత్వం ఇచ్చింది. స్త్రీలను సహనవంతులుగానే ఉంచింది’’ అంటూ పిల్లలిద్దరి చేతులను తీసుకుని కలిపే ప్రయత్నం చేశాడు ఆమేయరావు. తండ్రి చేతుల్లోంచి తన చేతిని విడిపించుకుంది పూర్ణిమ. కోపం, ఆవేశం, బాధ తన్నుకొస్తుంటే తండ్రికి ఎదురుతిరిగింది.. ‘‘నీ నిర్ణయాన్ని ఒప్పుకోవట్లేదు  నాన్నా! డ్రగ్స్, అమ్మాయిలు, ఆవేశం, అవివేకం తప్ప ఏమీ రాని, చేతకాని తమ్ముడిని నాయకుడిగా ఎంచుకున్నావ్‌. దీన్ని నేను సహించట్లేదు. కేవలం అమ్మాయిగా పుట్టడమే నా అనర్హతనే మీ అభిప్రాయం తప్పు. అన్నిట్లో నేను మీకు సాటిరాగలను. నేనూ గైక్వాడ్‌నే’’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోతుంది పూర్ణిమ. 

ఆ తర్వాత తన తండ్రికి అప్పటిదాకా అనుచరులుగా ఉన్న వాళ్లనందరినీ కలిసి.. తనకు మద్దతివ్వమని కోరుతుంది. ఆమేయరావు గైక్వాడ్‌ మీద దాడి చేయించిన ముఖ్యమంత్రి గోపాల్‌ గురవ్, పార్టీ మహారాష్ట్ర ఇంచార్జ్‌ త్రిపాఠీ సహా!  అమేయరావు గైక్వాడ్‌ తర్వాత పార్టీ నాయకుడిని ప్రకటించే రోజు రానే వస్తుంది. వేదిక మీద అందరూ ఆసీనులవుతారు. ఆషిష్‌ ఇంకా రాడు అప్పటికి. కొత్త అక్ష్యక్షుడి పేరు ప్రకటించే సమయానికి హాలులోకి ప్రవేశిస్తుంది పూర్ణిమ. షాక్‌ అవుతాడు అమేయరావు. తండ్రి కూర్చున్న వీల్‌ చెయిర్‌ని హాల్‌ నుంచి బయటకు తీసుకెళ్లి అతనికి ఫోన్లో ఓ వీడియో చూపిస్తుంది. అది చూసిన తండ్రి హతాశుడవుతాడు.

‘‘ఇంతకు తెగిస్తావా?’’ అంటూ కూతురి మీద అరుస్తాడు. ‘‘నాలోనూ క్రూరత్వం ఉంది నాన్నా. అది ప్రదర్శించకుండానే.. అవసరం లేకుండానే మీ రాజకీయ వారసత్వాన్ని అందుకోవాలనుకున్నా. అలా కుదరదు అని చెప్పారు మీరు. చేసి చూపించాన్నేను. సో.. మర్యాదగా మీటింగ్‌లో పార్టీ అధ్యక్షురాలిగా నా పేరు అనౌన్స్‌ చేయండి. మీ పేరు నిలబెడ్తా’’అంటుంది స్థిరంగా. ఆ మీటింగ్‌లో తన కూతురిని మహారాష్ట్ర జనశక్తి అధ్యక్షురాలిని చేస్తాడు ఆ తండ్రి. అందరూ మద్దతిస్తారు. 

సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌..
హాట్‌స్టార్‌లో స్ట్రీమ్‌ అవుతున్న వెబ్‌సిరీస్‌. పైన ప్రస్తావించిన సన్నివేశాలు అందులోనివే. ఎన్నో ఆశలు, కలలు, జీవిత లక్ష్యాలతో ముంబైకి వచ్చిన కొందరు వ్యక్తుల కథ ఈ ‘‘సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌’’. అమేయరావు గైక్వాడ్‌ అండ్‌ ఫ్యామిలీ కేంద్రంగా ఈ కథ సాగుతుంది. ముందు పాత్రలను పరిచయం చేసుకుందాం. జితేన్‌.. అమేయరావు గైక్వాడ్‌కు రైట్‌ హ్యాండ్‌. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వసీమ్‌ ఖాన్‌. 1990ల్లో ముంబాయ్‌లోని అండర్‌ వరల్డ్‌ డాన్స్‌ను వణికించాడు. కనపడ్డవాళ్లను కనపడ్డట్టు ఎన్‌కౌంటర్‌ చేసేశాడు. అందుకే అతనిని ఎన్‌కౌంటర్‌ వసీమ్‌ అంటారు. పురుషోత్తమ్‌.. జితేన్‌కు నమ్మకస్తుడు. అమేయరావు గైక్వాడ్‌ వ్యాపారాలను నిజాయితీగా నిర్వహిస్తున్న సగటు మధ్యతరగతి వ్యక్తి. 

ఇప్పుడు పూర్తి కథ క్లుప్తంగా..
అమేయరావు గైక్వాడ్‌.. మహారాష్ట్రలోని ఓ పల్లె నుంచి ముంబై వస్తాడు. చేంబూరులో చిన్న గదిలో జీవితం మొదలుపెడ్తాడు.. షిప్‌యార్డ్‌లో కూలీగా. తెగువతో వ్యాపారిగా.. క్రూరత్వంతో నేతగా.. మహారాష్ట్ర రాజకీయాలను శాసించే శక్తిగా ఎదుగుతాడు. అతని ప్రతి అడుగులో అండగా ఉంటూ ఆ కుటుంబంలోని వ్యక్తిగా మారుతాడు జితేన్‌. గైక్వాడ్‌ వ్యాపార రహస్యాలన్నీ జితేన్‌కు మాత్రమే తెలుస్తాయి. ఆ తర్వాత పురుషోత్తమ్‌కి. ఎక్కడి నుంచి డబ్బు వస్తోంది.. దాన్ని ఎలా వైట్‌ చేస్తున్నారు.. ఎక్కడెక్కడ దానిని భద్రపరుస్తున్నారు.. వంటివన్నీ పురుషోత్తమ్‌ ఎరుకలో.. అంచనాల్లో ఉంటాయి.

ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నా నోరెత్తి జీతం పెంచమని అడగడు. మరీ అంత మంచితనం పనికిరాదని, దాంతో తమ కష్టాలు తీరవని భార్య పోరుతూ ఉంటుంది. అయినా పట్టించుకోడు. మళ్లీ గైక్వాడ్‌ దగ్గరకు వస్తే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న గోపాల్‌ గురవ్‌కు ఆశ్రయం ఇచ్చి ఆయనను ముఖ్యమంత్రిని చేస్తాడు గైక్వాడ్‌. గోపాల్‌ గురవ్‌ ముఖ్యమంత్రికన్నా పైస్థాయికి ఎదగాలని తాపత్రయపడ్తుంటాడు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటాడు. గైక్వాడ్‌ మాత్రం మొదటి నుంచీ మహారాష్ట్రనే మహాసామ్రాజ్యంగా మలచుకుంటాడు. అయితే కాలక్రమంలో గైక్వాడ్‌ నాయకత్వ లక్షణాలతో ముచ్చపడ్డ పార్టీ అధిష్టానం ఆతణ్ణి ఢిల్లీకి రప్పించుకోవాలనుకుంటుంది.

ఆ రకమైన ఆలోచనను, ఆశను గైక్వాడ్‌కు కల్పిస్తుంది. చేంబూరు ఎంపీగా ఉన్న గైక్వాడ్‌ తర్వాత వచ్చే ఎన్నికలకు కేంద్రలో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నాలు మొదలుపెడ్తాడు. ఇది గోపాల్‌ గురవ్‌కు నచ్చదు. తన ఢిల్లీ కలను గైక్వాడ్‌ ఛిద్రం చేస్తున్నట్టు భావిస్తాడు. దాంతో ఢిల్లీ తీహార్‌ జైల్లో రెస్ట్‌ తీసుకుంటున్న అండర్‌ వరల్డ్‌ డాన్‌తో మాట్లాడి ముంబైలో గైక్వాడ్‌ మీద హత్యాప్రయత్నం చేయిస్తాడు. చావు తప్పి కోమాలోకి వెళ్తాడు గైక్వాడ్‌. 

కుటుంబ రాజకీయాలు.. 
గైక్వాడ్‌ ఆసుపత్రి పాలవడంతో అతని ఇంట్లో రాజకీయాలు పరాకాష్టకు చేరుకుంటాయి. పూర్ణిమ చార్టెడ్‌ అకౌంటెంట్‌. తండ్రి వ్యాపార లావాదేవీల లెక్కలన్నీ ఆమే చూస్తుంటుంది. జితేన్‌ను సొంత బాబాయ్‌లా భావిస్తుంది. మృదుభాషి, మంచి వక్త,  తెలివికలది, సమయస్ఫూర్తి, వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యం ఆమె లక్షణాలు. ఆమెకు పూర్తి వ్యతిరేకం తమ్ముడు ఆషిష్‌. బాల్యంలోనే తల్లిని కోల్పోయిన పూర్ణిమ బాధ్యతను తెలుసుకుంటే ఆషిష్‌ విచ్చలవిడితనానికి అలవాటు పడ్తాడు. తన కంటిని తన వేలుతోనే పొడుచుకునేంత మూర్ఖత్వం. అయినా పార్టీ బాధ్యతను ఆషిష్‌కే ఇవ్వాలనుకుంటాడు గైక్వాడ్‌. ఆ ఏర్పాట్లలోనే ఉండగానే తనపై దాడి జరగడంతో కోమాలోకి వెళ్తాడు. అప్పుడు రంగంలోకి పూర్ణిమను తేవాలనుకుంటాడు జితేన్‌. పార్టీ ర్యాలీలో పూర్ణిమతో మాట్లాడిస్తాడు. ఆమె ఉపన్యాసం.. పార్టీ కార్యకర్తలు, ప్రజలకే కాక అధిష్టానానికీ నచ్చుతుంది.

తండ్రి వారసురాలిగా ఆమెకే గుర్తింపు వస్తుంది. మింగుడుపడని ఆషిష్‌.. అక్కను తప్పించాలనుకుంటాడు. బావను, పదేళ్ల మేనల్లుడిని చంపేస్తానని బెదిరిస్తాడు. ఢిల్లీ వెళ్లడానికి అదే సరైన సమయమని భావించిన గోపాల్‌గురవ్‌కూ పూర్ణిమ అడ్డుగానే కనిపిస్తుంది. దాంతో ఆషిష్‌ను అడ్డం పెట్టుకొని పూర్ణిమను తప్పించాలనుకుంటాడు. తండ్రిపై హత్యాయత్నం చేసింది గోపాలే అని తెలిసినా అతనితో చేతులు కలుపుతాడు ఆషిష్‌. పూర్ణిమకు పెద్దదిక్కుగా ఉంటున్న జితేన్‌ను చంపేస్తాడు.వసీం ఖాన్‌... అండర్‌ వరల్డ్‌ క్రైమ్‌ లేకుండా చేసిన దాదాపు ఇరవై ఏళ్లకు అదే ఓల్డ్‌ ఫక్కీలో గైక్వాడ్‌ మీద కాల్పులు జరిగేసరికి హతాశుడవుతాడు. అయితే అండర్‌ వరల్డ్‌ క్లీన్‌ అయ్యాక.. ప్రభుత్వమూ వసీం ఖాన్‌ను పక్కన పెట్టేస్తుంది. అతనికి రావాల్సిన ప్రమోషన్స్‌ అందవు. పెద్దగా పనిలేని స్టేషన్స్‌కి ట్రాన్స్‌ఫర్‌ చేస్తూంటుంది.

పైగా ఓ క్రైమ్‌ ఎంక్వయిరీలో ఆతణ్ణి నిందితుడిగా పేర్కొంటుంది. అలా అతని కెరీర్‌ క్లోజ్‌ చేసింది ముఖ్యమంత్రి గోపాల్‌ గురవే. తాజాగా గైక్వాడ్‌ ఉదంతంతో.. నేరస్తుల వేటలో పడ్తాడు వసీం.. ఆ బాధ్యతను డిపార్ట్‌మెంట్‌ తనకు అప్పగించకపోయినా. అసలు నేరస్తుడు ముఖ్యమంత్రే అని, అతని పథకాన్ని అమలు చేసింది ఓ పాత డాన్‌ అనీ తెలుసుకుంటాడు. ఈ విషయం మీడియా ముందు లీక్‌ చేస్తానని ముఖ్యమంత్రిని బెదిరిస్తాడు వసీం. లొంగడు ముఖ్యమంత్రి. సాక్ష్యాధారాలతో పూర్ణిమను కలుస్తాడు వసీం.. సరైన సమయంలో!పురుషోత్తమ్‌.. జితేన్‌ను ఆషిష్‌ చంపుతుంటే చూస్తాడు పురుషోత్తమ్‌. తన తండ్రి వ్యాపార లావాదేవీల లెక్కలున్న డైరీ కోసం వెదుకుతాడు ఆషిష్‌. పురుషోత్తమ్‌నూ హింసపెడ్తాడు. పంటి బిగువన భరించి మరీ ఆ డైరీని పూర్ణిమకు తెచ్చిస్తాడు.  ఈలోపు గైక్వాడ్‌ కోమా నుంచి కోలుకుంటాడు.

కొడుకు అకృత్యాలు, కూతురి సమర్థతా తెలుస్తాయి. అయినా కొడుకునే వారసుడిగా నమ్ముతాడు. అతనికి పట్టం కట్టాలనుకుంటాడు. తన తండ్రి జితేన్‌ లాంటి వాళ్లను ఎలా తయారు చేసుకున్నాడో.. అదే ఫక్కీలో పూర్ణిమ కూడా వసీం, పురుషోత్తమ్‌లను తయారు చేసుకుంటుంది. లోకల్‌ లీడర్స్‌ను కలిసి మద్దతు తీసుకుంటుంది. తన క్రూరత్వాన్ని తండ్రికి చూపించడం కోసం వసీం, పురుషోత్తం, గోపాల్‌ గురవ్‌ సహాయంతో ఆషిష్‌ను చంపిస్తుంది. ఆ వీడియోనే తండ్రికి చూపించి పార్టీ పగ్గాలు చేపడుతుంది. సామర్థ్యం లేదు అంటే ఓకే.. కాని ఆడపిల్ల కాబట్టే అర్హత లేదు అంటే మాత్రం ఒప్పుకునేది లేదు! అని ఆడపిల్లల పక్షాన నిలబడ్డ ఈ సిరీస్‌కు నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వం వహించారు. పూర్ణిమగా ప్రియా బాపట్, అమేయరావు గైక్వాడ్‌గా అతుల్‌ కులకర్ణి నటించారు. 
 – సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top