రాగల 48 గంటల్లో రాయల్‌ వెడ్డింగ్‌!

Royal wedding: Princess Elizabeth and Prince Philip - Sakshi

రారండోయ్‌.. వేడుక చూద్దాం

‘ఇందు మూలముగా తెలియజేయడం ఏమనగా.. బ్రిటన్‌ మహారాణి  రెండవ ఎలిజబెత్‌ తన చిన్న మనవడు ప్రిన్స్‌ హ్యారీ వివాహానికి సమ్మతించారహో..’ బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ నుంచి మొన్న శనివారమే ప్రకటన వెలువడింది. దీనర్థం మే 19 శనివారం జరగబోతున్న ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌ల వివాహం లాంఛనంగా ఖాయమైపోయిందని! ఇక దీన్నెవరూ లాస్ట్‌ మినిట్‌లో వచ్చి ‘ఆపండి’ అని ఆపలేరని! ‘ఎలిజబెత్‌ ది సెకండ్‌ బై ద గ్రేస్‌ ఆఫ్‌ గాడ్‌’ అనే శీర్షికతో ప్రారంభమైన ఈ సమ్మతి ప్రకటన ‘బై ద క్వీన్‌ హర్‌సెల్ఫ్‌ సైన్డ్‌ విత్‌ హర్‌ ఓ  హ్యాండ్‌’ అనే పెద్ద అక్షరాల ముగింపు వాక్యంతో పూర్తయింది. అన్నిటికన్నా పైన ప్రకటన పత్రంపై కుడివైపున రాణి గారి స్వహస్తాల సంతకం ఉంది. బ్రిటిష్‌ మహా సామ్రాజ్యాన్ని సంకేత పరిచే సింహం, వేల్స్‌ రెడ్‌ డ్రాగెన్‌తో పాటు ఇంగ్లండ్‌ రోజా పూలు, స్కాట్లాండ్‌ థిసిల్‌ పూలు, ఐర్లాండ్‌ షామ్‌రాక్‌ (పూలాకు) బొమ్మలు ఈ పత్రంపై నలుమూలలా ముద్రించి ఉన్నాయి. 

తొలి ఆరుగురికి మస్ట్‌
బ్రిటన్‌ చట్టం ప్రకారం సింహాసనానికి తొలి ఆరుగురు వారసుల వివాహాలకు రాణిగారి  ఆమోదం తప్పనిసరి. ఆమోదం లేకుండా పెళ్లి చేసుకునేవారు చేసుకోవచ్చు కానీ, వారు సింహాసనాన్ని అధిష్టించే  వారసత్వ హక్కును కోల్పోతారు.ఇంకో 48 గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న ప్రిన్స్‌ హ్యారీ ఈ వారసత్వ సంక్రమణ క్రమంలో మొదట ఐదవ స్థానంలో ఉండేవారు. అయితే అన్నగారైన ప్రిన్స్‌ విలియమ్స్‌కు గత నెలలో కొడుకు పుట్టడంతో హ్యారీ ఆరవ స్థానంలోకి జరిగిపోయారు. క్వీన్‌ ఎలిజబెత్‌ తర్వాత ఆమె మొదటి సంతానం ప్రిన్స్‌ చార్ల్స్‌ (1), ప్రిన్స్‌ చార్ల్స్‌ తర్వాత అతని మొదటి సంతానం ప్రిన్స్‌ విలియం (2), ప్రిన్స్‌ విలియం తర్వాత అతని మొదటి సంతానం ప్రిన్స్‌ జార్జి (3) రెండో సంతానం ప్రిన్సెస్‌ చార్లెట్‌ (4), మూడో సంతానం ప్రిన్స్‌ లూయీ (5).. వీళ్ల తర్వాత ప్రిన్స్‌ విలియమ్స్‌ తమ్ముడు ప్రిన్స్‌ హ్యారీ (6) సింహాసనాన్ని అధిష్టించడానికి అర్హులవుతారు.  ఇప్పుడున్న మహారాణి రెండవ ఎలిజబెత్‌కు ఆమె తండ్రి ఆరవ జార్జి అనంతరం రాజ్యం సంక్రమించింది. ఆరవ జార్జికి ఇద్దరూ కూతుళ్లే. ఎలిజబెత్‌–2 పెద్ద కూతురు. రెండో కూతురు మార్గరెట్‌. ఆమె తన 71 ఏళ్ల వయసులో 2002లో చనిపోయారు. ఒకవేళ ఆమె బతికి ఉంటే, నిబంధనల మేరకు అన్ని అర్హతలూ ఉంటే అక్క తర్వాత వారసత్వంగా చెల్లే రాణిగారు అయ్యేవారు. అయితే ఈ వారసత్వ స్థానాలు ఎప్పుడూ ఒకేలా ఉండిపోవు. రాజప్రాసాదంలో పుట్టేవాళ్లను బట్టి, పోయేవాళ్లను బట్టి మారుతుంటాయి. 

ఈ సంగతి ఇలా ఉంచితే
ఈ పెళ్లికి ప్రిన్స్‌ హ్యారీ మామగారు (ప్రిన్స్‌ పెళ్లి చేసుకోబోతున్న మేఘన్‌ మార్కెల్‌ తండ్రి థామస్‌ మార్కెల్‌) రావడం లేదు. ఇందుకు రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఈ 73 ఏళ్ల వృద్ధుడి ఆరోగ్యం పైకి కనిపించే కారణం ఒకటైతే.. కనిపించకుండా వినిపిస్తున్న కారణం మరొకటి. థామస్‌ ఒకప్పుడు టెలివిజన్‌ లైటింగ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో సుప్రసిద్ధులను వెంటాడి వారి అంతరంగిక వ్యవహారాలను ఫొటోలు తీసే ‘పాపరాజీ’లకు హెల్ప్‌ చేసి నాలుగు రాళ్లు సంపాదించేవాడన్న చెడ్డపేరు ఆయనకు ఉంది. ఆ చెడ్డపేరుతో.. పెళ్లి ప్రాంగణంలో ఆహ్వానితుల ముందు కూతురి చెయ్యి పట్టి నడిపించే సంప్రదాయానికి ఏ ముఖం పెట్టుకుని రావాలని ఆయన వెనుకంజ వేస్తున్నారట! పెళ్లి జరిగే విండ్సర్‌ క్యాజిల్‌లోని సెయింట్‌ జార్జి చాపెల్‌ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందితే తప్ప ఆయన తన కూతురు పెళ్లికి హాజరుకాకపోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు పెళ్లి తంతు మొదలౌతుంది. క్వీన్‌ ఎలిజబెత్‌ ఐదు నిముషాల ముందే వచ్చి కూర్చుంటారట. 

సింహాసనానికి వారసులు
ఇప్పుడున్నది క్వీన్‌ జెలిజబెత్‌ 2 క్వీన్‌కు ముందున్నది ఆమె తండ్రి ఆరవ జార్జి

క్వీన్‌ తర్వాత తొలి ఆరుగురు (వరుస క్రమంలో)
(1) ప్రిన్స్‌ చార్ల్స్‌
(2) ప్రిన్స్‌ విలియం
(3) ప్రిన్స్‌ జార్జి
(4) ప్రిన్సెస్‌ చార్లెట్‌
(5) ప్రిన్స్‌ లూయీ
(6) ప్రిన్స్‌ హ్యారీ 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top