నూలుపోగుల వెన్నెల

Raksha Bandhan specials  - Sakshi

రాఖీపూర్ణిమ అంటే తెలియని వారుండరు. పేరు తెలిసినా ఆ పండుగ నాడేం చేయాలో రాఖీ కట్టడంలో ఏ అభిప్రాయం దాగుందో తెలిసినవారు దాదాపు ఉండరు. ఎందుకంటే శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనాడు సోదరి చేత రక్ష కట్టించుకుంటే దేవతలందరి రక్షణ కలుగుతుందని ప్రాచీన కాలం నుంచి ఉన్న విశ్వాసం. భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం.

అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. వివాహ సమయంలో అప్పగింతల కార్యక్రమం కూడా శుక్రవారం గడిచే దాకా ఆగి ఆ తర్వాతనే పూర్తి చేస్తారు. సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ సంప్రదాయాన్ని ఏర్పరిచారు. మహారాష్ట్ర, కర్ణాటకలలో దీనిని నారికేళ పూర్ణిమగా జరుపుకుంటారు.

ఈవేళ ఇలా చేయాలి: శ్రావణ పూర్ణిమనాడు సూర్యోదయకాలంలోనే స్నానం చేసి, మనం ఎవరిని రక్షించదలిచామో– అంటే నేటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలిచామో ఆ వ్యక్తి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక (రాఖీ)ని దైవం ముందుంచి పూజ చేయాలి. వరుడు కట్టబోయే మంగళ సూత్రానికి ఎలా మాంగల్యబల పూజ చేస్తారో, ఆ పూజాశక్తి దానిలో ప్రవేశించి ఆ సూత్రాన్ని కట్టించుకున్న ఆమెకీ, కట్టిన వ్యక్తికీ ఆపదల్లేకుండా చేస్తుందో అంతటి శక్తి గల ఈ రక్షికకీ పూజ చెయ్యాలి. అంటే పూజాశక్తిని రాఖీలోనికి ప్రవేశింప చెయ్యాలన్నమాట. అలా పూజాశక్తితో కూడుకున్న ఈ రక్షికని సోదరుడు లేదా సోదర సమానంగా భావించిన వ్యక్తి ముంజేతికి కడుతూ– స్థితిMనేను ఫలాని వారికి రక్షణ కోసం కడుతున్నాను అని మనసు నుండా బావన చేసుకుని ఆ రక్షిక మీద అక్షతలని వేయాలి. ఆ తర్వాత తీపి తినిపించాలి.  

యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామపి బధ్నామి రక్షే! మా  చల మాచల! రాక్షసులకి రాజూ, మహాబలవంతుడూ అయిన బలి చక్రవర్తి ఏ రక్షాబంధన శక్తి కారణంగా శ్రీహరికి వశమైపోయాడో, దేవతలంతా తమ తమ తపశ్శక్తిని శ్రీహరికి బాసటగా ఉంచుతూ రక్షికని కట్టారో, ఆ రక్షికాశక్తి నాలో ప్రవేశించిన నేను కూడ ఈ సోదరుడు లేదా మిత్రునికి ఈ రక్షికని ముడి వేస్తున్నాను. ఓ రక్షికా! రక్షణశక్తి నీనుండి తొలగకుండును గాక! అని పై శ్లోకానికి అర్థం. దీనిని బట్టి ఇది నేటి ఆచారం కాదనీ, ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయమేననీ తెలుస్తోంది. రక్షాబంధనం కట్టించుకున్న సోదరుడు తాత్కాలికంగా బహుమతులు ఇచ్చి ఊరుకోకుండా ఆ సంవత్సరకాలంపాటూ ఆమెకి అండగా నిలవాలి.

ఒకప్పుడు తెల్ల ఆవాలతోనూ, అక్షతలతోనూ పూజింపబడిన రక్షికని కుల పురోహితుడు (ఇంటి పురోహితుడు) ఆ దేశపు రాజు లేదా గ్రామ పెద్ద ముంజేతికి ముడి వేసేవాడు. ఇప్పుడు ఈ రక్షిక రకరకాల ఆకారాలలోకి మారింది. ఏమైనా, ఈ రక్షిక అనేది సంవత్సరకాలం ఉంచుకోవలసిన బంధం. తన సోదరుని జీవితం తీపివలె ఎల్లప్పుడూ కమ్మగా ఉండాలని, తలపెట్టే ప్రతికార్యం విజయవంతం కావాలని, అతనికి సకల సంపదలు చేకూరాలని కోరుతూ తోబుట్టువులు సోదరుని చేతికి రక్షాబంధనం కట్టే ఈ పండుగ నుంచి గ్రహించవలసినది ఒకటే– అదేమంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలిచినప్పుడే ఈ పండుగకు సార్థకత.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top