నేచురల్‌ మెడికల్‌ కిట్‌

Pomegranate fruit is a Natural Medical Kit - Sakshi

దానిమ్మ

దానిమ్మ పండు చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో... తినడానికీ రుచి అంతే బాగుంటుంది. అంతేకాదు... తింటే అందే ప్రయోజనాలు అత్యంత ఆరోగ్యకరంగా ఉంటాయి. దానిమ్మను ఒక స్వాభావికమైన మెడికల్‌ కిట్‌గా చెప్పవచ్చు. ఎందుకంటే అందులోని గింజలెన్ని ఉంటాయో ఆరోగ్యలాభాలూ అంతకంటే ఎక్కువేనని చెప్పవచ్చు. దానిమ్మ పండును తినడం వల్ల సమకూరే లాభాల్లో ఇవి కొన్ని మాత్రమే.

దానిమ్మలో పీచు పాళ్లు చాలా ఎక్కువ. దాంతో అది జీర్ణవ్యవస్థకు మంచి ఆరోగ్యాన్నిస్తుంది. పేగు కదలికలు హాయిగా సాఫీగా తేలిగ్గా జరుగుతాయి. ఈ గుణాలన్నీ మలబద్దకాన్ని నివారించేందుకు బాగా దోహదపడతాయి.
దానిమ్మలోని విటమిన్‌–సి కారణంగా రోగనిరోధక శక్తి పెరిగి ఎన్నో రకాల జబ్బులు నివారితమవుతాయి.
దానిమ్మ టైప్‌–2 డయాబెటిస్, అలై్జమర్స్‌ వంటి జబ్బులను నివారిస్తుంది.
దానిమ్మలో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌ ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. ప్రోస్టేట్‌ క్యాన్సర్, బ్రెస్ట్‌ కాన్సర్, కోలన్‌ క్యాన్సర్, లుకేమియా వంటివి అందులో కొన్ని మాత్రమే.
దానిమ్మలో పొటాయిషియమ్‌ ఎక్కువ. ఫలితంగా అది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
దానిమ్మ కొలెస్టరాల్‌ను అదుపులో ఉంచుతుంది. దాంతో రక్తప్రసరణ సాఫీగా జరిగి గుండెజబ్బులు నివారితమవుతాయి. గుండె సంబంధ సమస్యలతో బాధపడుతున్న వాళ్లు రోజూ ఒక గ్లాసు దానిమ్మరసం తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
బరువు తగ్గాలనుకున్న వారికి దానిమ్మ ఎంతగానో ఉపకరిస్తుంది.  దోహదం చేస్తుంది.
దానిమ్మలోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా అది వాపు, మంట, ఇన్ఫెక్షన్లను వేగంగా తగ్గిస్తుంది.
ఒంట్లోని ద్రవాల సౌమతౌల్యతను దానిమ్మ కాపాడుతుంది.
చర్మం పైపొరను కాపాడుతుంది, చర్మకణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో దానిమ్మను క్రమం తప్పక తీసుకునే వారి చర్మంలో మంచి నిగారింపు వస్తుంది. అంతేకాదు... మంగు వంటి కొన్ని చర్మ సమస్యలను నివారిస్తుంది.
దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్స్‌తో వయసు పెరగడం వల్ల వచ్చే అనేక అనర్థాలు నివారితమవుతాయి లేదా ఆలస్యంగా వస్తాయి. ఉదాహరణకు  వయసు పైబడటం వల్ల  వచ్చే ముడతలు, మచ్చలు, గీతలను నివారిస్తుంది. ఎండలోకి వెళ్లినప్పుడు చర్మం వడలిపోకుండా కాపాడుతుంది. దాంతో చర్మం తాజాగా కనిపిస్తుంటుంది.
దానిమ్మ ఆర్థరైటిస్‌కు స్వాభావికమైన ఔషధంగా చెప్పవచ్చు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top