రోకలి దండు

Pestilence for female protection - Sakshi

ధాన్యం దంచుకునే రోకలి.. పసుపుకొమ్ములను పొడిగొట్టే రోకలి..ఎండుమిర్చిని ఎర్రకారం చేసే రోకలి.. కన్నెర్ర చేస్తే?!‘ఓనకే ఒబవ్వ’ అవుతుంది. 18 వ శతాబ్దంలో హైదర్‌ అలీ సేనల మాడు పగలగొట్టిన ఆ రోకలిని ఇప్పుడు..ఖాకీ బ్రాండుగా మార్చుకుంది కన్నడదేశం.ఆమె పేరుతో ఓ పోలీసు దండునుతయారు చేసింది!మహిళారక్షణ కోసం రోకలిదండును పంపింది.

పద్దెమినిదో శతాబ్దం.. కర్ణాటకలోని చిత్రదుర్గ ప్రాంతం. ఆ రాజ్యాన్ని మాదకారి నాయక పాలిస్తున్న కాలం (1754 – 1779). హైదర్‌ అలీ ఆ రాతికోటను ఆక్రమించుకోవాలని పథకం వేస్తుంటాడు. పటిష్టమైన సైనిక కాపలాను ఛేదించుకొని ఆ దుర్గాన్ని వశం చేసుకోవడం వల్లకాదెలా అనుకుంటాడు. ఆ కోటలోకి వెళ్లే దారి కోసం పరిశోధన మొదలుపెడ్తాడు.  అప్పుడు కనపడుతుంది ఓ గుహ మార్గం చిత్రదుర్గానికి ఒకవైపున. ఆ గుహ ద్వారా దుర్గాన్ని చేరుకోవచ్చు. అయితే సన్నని రంధ్రం లాంటి ఆ మార్గం దగ్గర కూడా మాదకారి నాయక ఓ కాపలాదారుడిని నియమిస్తాడు. ఆ కాపలాదారు పేరు హనుమ.

అన్నం పెట్టి.. నీళ్ల కోసం వచ్చింది
కాపలా కాస్తున్న హనుమ ఒకరోజు మధ్యాహ్నం విపరీతంగా ఆకలివేయడంతో భోజనానికని గుహకు దగ్గర్లోనే ఉన్న ఇంటికి వెళ్లాడు. ‘‘ఆకలేస్తోంది  అన్నం పెట్టు.. భోజనం ముగించుకుని త్వరగా వెళ్లాలి.. కాపలా వదిలి వచ్చాను’’ అంటూ హడావిడి పెట్టాడు భార్యను. హనుమ భార్య పేరు ఓబవ్వ. భర్త వేగిరం అర్థం చేసుకొని గబగబా భోజనం వడ్డించింది. తొందరగా తింటుండడంతో హనుమకు పొలమారింది. మంచినీళ్లు ఇద్దామని చూస్తే కుండలో నీళ్లు అడుగంటాయి. వాటినే దొప్పలో పోసి భర్త పక్కన పెట్టి.. ‘‘తింటూ ఉండు నీళ్లు తెస్తా ’’నని పదడుగుల దూరంలో ఉన్న చెరువుకి వెళ్లింది. 

కుండను వదిలి రోకలి ఎత్తింది
ఎదురుగా ఉన్న కాలినడకన ఓ వ్యక్తి రావడం ఓబవ్వ కంటపడింది. అతని నడక, వ్యవహారం అంతా అనుమానాస్పదంగా అనిపించింది. కుండను వదిలేసి అక్కడే బండ మీదున్న రోకలిదుడ్డును తీసుకొని దారికాచింది. దగ్గరకు రాగానే రోకలి బండతో తలను బాదింది. రక్తమోడుతూ కుప్పకూలాడతను. దారి నుంచి పక్కకు లాగేసింది అతనిని. కొన్ని క్షణాలు గడిచామో లేదో అదే చిత్రమైన ప్రవర్తనతో ఇంకో వ్యక్తి రావడం చూసింది. ఆ వ్యక్తినీ అలాగే రోకలితో బాది చంపేసి పక్కకు లాగింది. రెండో మనిషి తర్వాత మూడో మనిషి.. ఆనక నాలుగో మనిషి.. ఇలా వరుసగా పదుల సంఖ్యలో వచ్చారు. నాలుగో మనిషికే వాళ్లంతా శత్రు సైన్యమని అర్థమైంది ఓబవ్వకు. ఒక్కొక్కర్నీ రోకలితో మోది చంపేసింది.

తేలని మిస్టరీ
నీళ్లు తెస్తానని వెళ్లిన భార్య ఇంకారాలేదేంటనే భయం, సందేహంతో చెరువు దగ్గరకు వచ్చాడు హనుమ. రక్తం ఓడుతున్న రోకలి దుడ్డుతో కనిపించిన ఆలిని చూసి హతాశుడయ్యాడు. విషయం తెలిసింది. తాను చేయలేని పని భార్య చేసింది. అయితే ఆ రోజు రాత్రే ఓబవ్వ మరణించింది. అంతమందిని చంపిన షాక్‌ తోనో.. హైదర్‌ అలీ మనుషులు చంపి ఉంటారో తేలక అది మిస్టరీగానే ఉండిపోయింది. ఆమె సాహసం చిత్రదుర్గాన్ని కొన్ని రోజుల వరకైతే రక్షించింది కాని ఆ తర్వాత ఆ కోట హైదర్‌ అలీకి బందీ కాక తప్పలేదు. ఓబవ్వ వీరనారిగా చరిత్రలో మిగిలిపోయింది.  కన్నడనేల మీద కత్తిపట్టి యుద్ధం చేసిన అబ్బక్క రాణి, కేలడి చెన్నమ్మ, కిట్టూరు చెన్నమ్మల సరసన ఒనకే ఓబవ్వ నిలిచిపోయింది. ఒనకే అంటే కన్నడలో రోకలి దుడ్డు అని. 

నాటి ఓబవ్వ.. నేటికీ స్ఫూర్తి
ఇది జానపద కథ కాదు.. నిజం! చరిత్రగా మారిన  సత్యం. ఆమె పుట్టిన నేల పరాధీనం కాకుండా తనకు చేతనైనా పోరాటం చేసింది ఓబవ్వ. ఒంటి చేత్తో చిత్రదుర్గాన్ని రక్షించింది. ఆమె స్ఫూర్తిని కర్ణాటక పోలీసులు ఇప్పటికీ పంచుకుంటున్నారు. ఆడపిల్లల పట్ల పెరుగుతున్న నేరాలు, హింసను అరికట్టడానికి ఆమె ధైర్యాన్ని తలచుకుంటున్నారు. ‘ఓబవ్వ పడే’ పేరుతో ఓ ప్రత్యేకమైన విమెన్‌ పోలీస్‌ స్క్వాడ్‌ను తయారు చేశారు. ఈ మహిళా పోలీసులంతా అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్లు. మొత్తం 45 మంది. అందరూ 40 ఏళ్ల లోపు వాళ్లే. ఆత్మరక్షణ విద్యల్లో ఆరితేరినవాళ్లే. బహిరంగ స్థలాలైన బస్‌స్టాండులు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, పార్కులు, సినిమా హాళ్ల దగ్గర వీరు నిత్యం పహారాకాస్తున్నారు. ఆడపిల్లలను ఇబ్బంది పెట్టే అల్లరి మూకల నుంచి అమ్మాయిల మీద దాడులుచేసే సైకోల దాకా అందరి తాటా తీస్తున్నారు. అంతేకాదు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి అమ్మాయిలకు ఆత్మరక్షణ మెళకువలను నేర్పిస్తున్నారు. ప్రొటక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ (పోక్సో)యాక్ట్, నేరాలను అరికట్టేందుకున్న ఇతర చట్టాలు, సైబర్‌ క్రైమ్స్, మొబైల్‌ ద్వారా జరిగే వేధింపులు వంటి వాటి మీద అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో అయితే గ్రామ పంచాయత్‌లు, ఆశా వర్కర్లు, స్త్రీ శక్తి గ్రూప్స్‌అన్నిటితో కలిసి మహిళలను చైతన్యం చేసే పనిలో బిజీగా ఉన్నారు. పైలట్‌ ప్రాజెక్ట్‌గా బెంగుళూరులో ఈ యేడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ స్పెషల్‌ స్క్వాడ్‌ తక్కువ సమయంలోనే మంచి ఫలితాన్నిచ్చింది. దాంతో త్వరలోనే దీన్ని కర్నాటక అంతటా విస్తరింపచేసే ఆలోచనలో ఉందట ఆ రాష్ట్ర పోలీస్‌ శాఖ. నేరగాళ్లలో ఒకరకమైన భయాన్ని సృష్టించడానికి ఈ ప్రత్యేక బృందంలోని పోలీసులకు మిలటరీని పోలిన యూనిఫామ్‌ను కేటాయించినట్టు తెలిపారు చిత్రదుర్గ ఎస్‌పీ (సూపరింటిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌) శ్రీనాథ్‌ జోషి. 

మనకూ ఓ(బవ్వ) టీమ్‌ ఉండాలా?!
మన తెలుగు నేల మీదా ఉన్నారు సాహస వనితలు.. వీరనారీమణులు బ్రిటిషర్స్‌తో పోట్లాడిన దుర్గాబాయి దేశ్‌ముఖ్, సరోజినీ నాయుడు, తెలంగాణ గడ్డమీదైతే నిజామ్‌కు వ్యతిరేకంగా పిడికిలి బిగించిన చాకలి ఐలమ్మా ఉన్నారు.  ఆ స్ఫూర్తిని ఇప్పుడు మన దేశంలోని మగవాళ్ల నుంచి రక్షణ కోసం ఉపయోగించుకోవడమే విషాదం. స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఒక్కయేళ్లయింది. ఆడవాళ్లు ఇంకా గడప దాటేందుకు భయపడే పరిస్థితి.  స్వాతంత్య్రం దేశంలోని పురుషులకే కాదు.. మహిళలకు కూడా. దేశమంటే అందరూ! ఆ స్వేచ్ఛను.. కాపాడుకోవడానికి స్త్రీలు గౌరవం పరిరక్షించుకోవడానికి అహర్నిశల పహారా అవసరమా? మన షీటీమ్స్‌ కూడా.. ఓనకే ఓబవ్వ వంటి స్పెషల్‌ స్క్వాడ్స్‌లా ఉండాలా? మగవాళ్లూ ఆలోచించండి! స్వతంత్ర భారత్‌ అర్థం ఇదేనా? ఆలోచించండి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top