పెళ్లి బొమ్మలు

new fashion show from marriages - Sakshi

ఫ్యాషన్‌

బొమ్మల పెళ్లిలో పిల్లల కేరింతలే బాజాభజంత్రీలు.పిల్లలు పెరిగి పెద్దయ్యాక జరిగే పెళ్లిళ్లలో ఆ బొమ్మలే ఆకర్షణగా నిలిస్తే..?ఇప్పుడు ట్రెండ్‌ అదే!రాధాకృష్ణులు, లక్ష్మీదేవి, గొల్లభామలు, కిన్నెరలు...ఎంబ్రాయిడరీ ద్వారా పెళ్లి వస్త్రాలపై కొలువు తీరుతున్నారు. ఇదిగో ఇలా అక్షింతలు అందుకుంటున్నారు.

ముచ్చటైన చిత్ర కళ చీర కొంగు మీద ఒదిగిపోతే  అచ్చమైన జరీ జిలుగులకు జాకెట్టు కాన్వాస్‌గా మారితే  సంప్రదాయ వేడుక విన్నూత కళను నింపుకుంటుంది. చిత్రకళ సొగసు, ఎంబ్రాయిడరీ జిలుగులు
జత చేరి మెరిసిపోతుంటే పట్టు రెపరెపల మధ్య వాటిని పట్టేసుకుంటే  ప్రతీ కట్టూ ప్రత్యేకతను నింపుకోకుండా ఉండగలదా...!

పల్లకిలో పెళ్లికూతురు
సన్నాయి రాగాలాపన.. బాజా భజింత్రీల చప్పుళ్ల మధ్య.. అలంకరించిన పల్లకిలో కోటి కలల కొత్త జీవితాన్ని మోసుకుంటూ పెళ్లికూతురు మండపానికి వస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఆ కళని చీర కొంగుమీదనో లేదంటో బ్లౌజ్‌ మీదనో చూపితే చూపుల దారాలు అల్లిబిల్లిగా అల్లుకుపోవాల్సిందే! 

రాధాకృష్ణుల ప్రేమ కావ్యం
యుగాలు దాటినా ఆ అందం వన్నె తగ్గదు. అందుకే ఆ ప్రేమను డిజైనర్లు ఇలా ఆకట్టుకునేలా ఆవిష్కరిస్తున్నారు. ఫ్యాబ్రిక్‌ పెయింట్‌తో రాధాకృష్ణుల బొమ్మలు గీసి, లతలు, పువ్వులను జరీతో సింగారించారు. మరికొన్ని జరీ, పూసలతోనే రాధాకృష్ణుల బొమ్మలు కుట్టుతో ఆకట్టుకుంటున్నాయి.

కోటగుమ్మాలు
రాజస్థానీ మొఘల్‌ ఘనత చీర అంచుల్లోనూ, కొంగులోనూ మెరిసిపోవడంతో పాటు జాకెట్టు పైనా ఘన తను చాటుతుంది. కోట గొమ్మాలను జరీ దారాలు, కుందన్‌ మెరుపులతో సింగారిస్తున్నారు. 

అప్సరసలు
పెళ్లి, పేరంటాలకు ఇంకాస్త నిండుతనాన్ని, పూజా కార్యక్రమాలకు మరింత గాఢతను హారాలతో పాటు ఎంబ్రాయిడరీ కూడా అప్పరసల నాట్యకళతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది.

చీరలు, బ్లౌజ్‌ల మీద ఎంబ్రాయిడరీ కళ ప్రతీసారి కొత్త హంగులతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మొన్నటి వరకు పూసలు దారాలతో పువ్వులు, లతలు అల్లేస్తే ఇప్పుడు ఏకంగా మనుషుల బొమ్మలనే తీరుగా డిజైన్‌ చేస్తున్నారు. చిత్రలిపి, ఎంబ్రాయిడరీతో కనువిందు చేస్తున్నారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top