
రైటర్ కే నచ్చని బాక్సాఫీస్ హిట్
మన తెలుగులో కమర్షియల్ సాహిత్యం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఏ వయసు వారికి తగినట్లు ఆ వయసు సాహిత్యం అసలు రావడం లేదు.
హాలీవుడ్ టీనేజ్ హారర్ / ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్
మన తెలుగులో కమర్షియల్ సాహిత్యం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఏ వయసు వారికి తగినట్లు ఆ వయసు సాహిత్యం అసలు రావడం లేదు. ఇంగ్లిష్ భాషలో ఈ సమస్యే లేదు. బాలసాహిత్యం, టీనేజ్ లిటరేటర్... ఇలా ఏ తరానికి తగ్గట్లు ఆ తరానికి పాపులర్ సాహిత్యం వస్తూనే ఉంది. ఇప్పుడు ‘హారీపోటర్’ రచయిత్రి జె.కె.రౌలింగ్ ఎంత పాపులరో, అంతకుముందు ఎనిడ్ బ్లిటన్ అడ్వంచరస్ ‘ఫైల్’, ‘సెవెన్’ సిరీస్ నవలలంటే ఇంగ్లిష్ నవలలు చదివే పిల్లలకి తెగ ఇష్టం. ఆ కోవకి చెందిన రచయిత్రి లూయీస్ డంకన్. ఆమె కలం పేరు లూయీస్ కెర్రీ.
టీనేజర్లకు నచ్చే సస్పెన్స్, మిస్టరీ నవలలు రాయడంలో దిట్ట లూయీస్. 1973లో ‘ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్’ అనే సస్పెన్స్ నవల రాసింది. ఆ నవల పిల్లల్ని, టీనేజర్లని విశేషంగా ఆకట్టుకుంది. 1997లో ఈ నవలని సినిమాగా తీస్తే బాగుంటుందని మాండలే ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణ సంస్థ భావించింది. నవల హక్కులు తీసుకుని, ‘స్క్రీమ్’ సినిమాలతో పాపులర్ అయిన రచయిత కెవిన్ విలియమ్‌సన్‌తో సినిమాకి తగ్గట్లు స్క్రీన్‌ప్లే రాయించారు. జిమ్ గిలెప్సీని దర్శకుడిగా ఎన్నుకున్నారు.
♦ 17 మిలియన్ల డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 125 మిలియన్ల డాలర్లు బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.
♦ హాలీవుడ్‌లోనే కాకుండా, మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో కూడా ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయం సాధించింది.
♦ సినిమా చూసిన తర్వాత నవలా రచయిత్రి లూయీస్ డంకన్ పెదవి విరిచింది. సస్పెన్స్, మిస్టరీ అంశాలతో సాగే తన కథని రక్తపాతం, హింస జోడించి టీనేజ్ మిస్టరీ నవలని - టీనేజ్ హారర్ చిత్రంగా మలిచారని బహిరంగంగానే వాపోయింది.
♦ ఇక సినీ విమర్శకులయితే - ఈ సినిమాని ఏకి పడేశారు.
♦ ఈ విమర్శలన్నింటిని తిప్పికొడుతూ, బాక్సాఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది ‘ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్’ సినిమా.
♦ ఈ సినిమా సక్సెస్‌తో ‘ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్’ (1997), ‘ఐ విల్ ఆల్వేస్ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్’ (2006) సీక్వెల్స్ వచ్చాయి.
♦ ప్రస్తుతం సోనీ పిక్చర్స్ ఈ సినిమాని రీమేక్ చేసే సన్నాహాల్లో ఉంది. బహుశా అది ఈ ఏడాదే విడుదల కావచ్చు.
♦ ‘ఫిబ్రవరి 14 నెక్లెస్ రోడ్’ అనే తెలుగు సినిమా ఈ కథ స్ఫూర్తితోనే రూపొందిందని చెప్పాలి.
కథ విషయానికొస్తే -
నలుగురు హైస్కూల్ పిల్లలు. జూలీ-ఆమె బాయ్‌ఫ్రెండ్ రే, జూలీ స్నేహితురాలు హెలెన్- ఆమె బాయ్‌ఫ్రెండ్ బారీ - ఓ పార్టీ నుంచి తిరిగొస్తూ, పొరబాటున ఓ వ్యక్తిని గుద్దుతారు. పోలీస్ కేసు అవుతుందనే భయంతో ఆ వ్యక్తి శరీరాన్ని నీళ్లల్లో పడేస్తారు. ఏడాది తర్వాత - కాలేజీ నుంచి వేసవి సెలవులకి ఇంటికొచ్చిన జూలీకి ఓ ఉత్తరమొస్తుంది. దానిలో ‘ఐ నో వాట్ యూ డిడ్ లాస్ట్ సమ్మర్’ (పోయిన వేసవిలో నువ్వేం చేశావో నాకు తెలుసు) అని రాసి ఉంటుంది. జూలీలో టెన్షన్ ప్రారంభమవుతుంది.
తన మిత్రులు బారీ, హెలెన్‌లకు ఈ బెదిరింపు ఉత్తరం గురించి చెబుతుంది జూలీ. వాళ్ల ముగ్గురి అనుమానం యాక్సిడెంట్ రోజు కలిసిన మాక్స్ మీదకి మళ్లుతుంది. చేపలు పట్టే వృత్తిలో ఉన్న మాక్స్‌ని కలవడానికి వెళ్తారు. ఆ తర్వాత మాక్స్ ప్రమాదవశాత్తూ చనిపోతాడు. బారీకి ‘ఐ నో’ అనే లెటర్ వస్తుంది. బారీ హాస్పిటల్ పాలవుతాడు.
ఇంతకీ ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి ఎవరూ అనే దిశగా అన్వేషణ ప్రారంభిస్తారు. అతని పేరు డేవిడ్ ఇగాన్. బహుశా అతని ఆప్తులెవరైనా తమని బెదిరిస్తున్నారేమోనని భావిస్తారు. డేవిడ్ ఇంటికెళ్లి, అతని చెల్లిని కలుస్తారు.
డేవిడ్ చనిపోయిన రోజు ‘బిల్లీ బ్లూ’ అనే వ్యక్తి తను డేవిడ్ మిత్రుడినని, నివాళి అర్పించడానికి వచ్చానని చెప్పినట్లు ఆమె చెబుతుంది. ఈ బిల్లీ బ్లూ ఎవరు? డేవిడ్ నిజంగానే చనిపోయాడా? ఇలాంటి సందేహాలు ఈ నలుగురు టీనేజర్స్‌ని వేధిస్తుంటాయి. వరుసగా బెదిరింపులు, హత్య ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఒక దశలో ఒకరి మీద మరొకరికి అనుమానం వస్తూ ఉంటుంది. బారీని దారుణంగా చంపేస్తారు. డేవిడ్ ఇగాన్, సూసీ అనే అమ్మాయిని ప్రేమించాడని, ఆమె యాక్సిడెంట్‌లో చనిపోయిందని, సూసీ తండ్రి బెన్... తమ మీద పగబట్టాడని జూలీ, హెలెన్‌లకు తెలుస్తుంది.
చివరకి హెలెన్, ఆమె సోదరి ఎల్మా కూడా బెన్ చేతిలో చనిపోతారు.
జూలీ అనుకోకుండా ఓ బోట్‌లో చిక్కుకుంటుంది. ఆ బోట్ పేరు ‘బిల్లీ బ్లూ’ ఆ బోట్‌లో ఓ గది నిండా జూలీ తాలూకు వివరాలుంటాయి. బెన్ జూలీని, ఆమె బోయ్‌ఫ్రెండ్‌ని రేని చంపే ప్రయత్నం చేస్తాడు. కొద్దిలో చావు తప్పించుకుంటారు. మళ్లీ ఆ మరుసటి ఏడాది జూలీ సెలవులకి ఇంటికొచ్చినప్పుడు తలుపు అద్దం మీద ‘ఐ స్టిల్ నో’ అని రాసి ఉంటుంది. - తోట ప్రసాద్