
ఎదురు దెబ్బలు తిన్నా సొంత సంస్థ మొదలెట్టా
స్టాక్ మార్కెట్లు... షేర్లు... పెట్టుబడులు!! వీటన్నిటికీ ఆడవాళ్లు ఆమడ దూరం ఉంటారు.
స్టాక్ మార్కెట్లు... షేర్లు... పెట్టుబడులు!! వీటన్నిటికీ ఆడవాళ్లు ఆమడ దూరం ఉంటారు. అందుకే ఆర్థిక సలహాదారులుగా మహిళలు చాలా తక్కువ కనిపిస్తారు. కానీ మాధవి రెడ్డి అందరిలా ఆలోచించలేదు. ఫైనాన్షియల్ ప్లానర్‌గా మారటమే కాక... మరింత మందిని తనలా తీర్చిదిద్దటం మొదలుపెట్టారు.
ఆమె ఈ లక్ష్యాన్నెలా చేరుకున్నారు? ఆమె ఏం చెబుతున్నారు...?
నాకు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా పనిచేసుకోవాలనే కోరిక ఉండేది. మూడేళ్ల కిందట మాధవి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎంఐఎఫ్‌ఎస్) సంస్థను ఏర్పాటు చేయడంతో ఈ కోరిక తీరింది. కానీ దీన్ని ఏర్పాటు చేయటం అంత సులువుగా సాధ్యం కాలేదు. పెట్టుబడి కోసం చదువు పూర్తవగానే పేరున్న స్టాక్‌బ్రోకింగ్ కంపెనీలో చేరా. వాళ్లు కమీషన్ల కోసం అనవసరంగా ట్రేడింగ్ చేయిస్తుండటం నచ్చలేదు. మానేశా. మరో సంస్థలో పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్ సేవలందించా.
ఈలోగా పెళ్లి... పిల్లలు. మూడేళ్లపాటు ఉద్యోగానికి దూరం. అలాగని ఇంట్లో ఖాళీగా కూర్చోలేదు. మేనేజ్‌మెంటు కాలేజీలు, బీమా సంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో పార్ట్‌టైమ్ ట్రైనింగ్ క్లాసెస్ నడిపా. ఈ సమయంలో నా మిత్రుడు బాబా కిషోర్ ప్రోత్సహించారు. ఆయనిచ్చిన ధైర్యంతో సొంతగా ఎంఐఎఫ్‌ఎస్ ప్రారంభించా. దీనికోసం నేను దాచిన పెట్టుబడితో పాటు మా వారి దగ్గర కొంత మొత్తం తీసుకున్నా.
సంస్థ పెట్టాక గట్టి దెబ్బలే తగిలాయి. ఒక దశలో పురుషాధిక్యతపై విపరీతమైన ద్వేషం కూడా వచ్చింది. సబ్‌బ్రోకింగ్ తీసుకొని దాన్ని నిర్వహించడానికి ఒక డీలర్‌ని పెడితే... అతను సొంత నిర్ణయాలు తీసుకుని క్లయింట్‌కు నష్టాలు తెచ్చి పారిపోయాడు. క్లయింట్ నా స్నేహితురాలే. తను నష్టపోయిన మొత్తాన్ని వడ్డీతో సహా కట్టమంది. నాపై ఒత్తిడి. మా వారు సాయపడటంతో దాన్నుంచి గట్టెక్కా. ఇంకోసారి వ్యాపార విస్తరణకంటూ కొందరు మాతో ఒప్పందం చేసుకుని, మూడు నెలలు తిరక్కుండానే పోటీ సంస్థను పెట్టారు. అప్పుడు బాధపడ్డా. కానీ, వంద మందికి శిక్షణనిచ్చి ఉపాధి మార్గం చూపించడంతో పాటు మరో ఆరుగురికి ఉపాధి కల్పించగలుగుతుండటం ఆ బాధను పోగొట్టింది. ఇదే సంతృప్తి నన్ను నడిపిస్తోంది. శిక్షణా సంస్థగా ఉన్న ఎంఐఎఫ్‌ఎస్‌ను పూర్తిస్థాయి ఆర్థిక సేవలందించే సంస్థగా తీర్చిదిద్దే పనిలో ఉన్నా. బ్రోకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఏడాదిలోగా దీన్ని సాధిస్తాం.
ఇక వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలైతే... ఒకటి సాధించగానే మరొకటి నిర్దేశించుకుంటున్నా. మొదట డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ చాలనుకున్నా. అది తీరాక ట్రిపుల్ బెడ్‌రూమ్‌లోకి మారాం. ఇప్పుడు నా దృష్టి విల్లాపై ఉంది. చిన్న కారు నుంచి ఎస్‌యూవీకి అప్‌గ్రేడ్ అవుదామనుకుంటున్నాం.
20 శాతాన్ని సొంతంగా సమకూర్చుకొని మిగిలింది రుణం తీసుకోవాలనుకుంటున్నాం. దీనికోసం మ్యూచువల్ ఫండ్స్, బంగారం, పీఎఫ్, ఎన్‌ఎస్‌సీలతో పోర్ట్‌ఫోలియోను బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. రూ.80 లక్షల రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకోవాలన్నది నా లక్ష్యం. ఇందుకోసం పీఎఫ్, యులిప్ యాన్యుటీ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నా. ఇంటికి సంబంధించిన నిర్ణయాలన్నీ మా వారితో కలిసే తీసుకుంటా.