దేవదేవుడయినా గురువుకి శిష్యుడే!

 gurus were also blessed with the service - Sakshi

కృష్ణ భగవానుడిది పరిపూర్ణావతారం. ఆయనే జగద్గురువు. కానీ ఈ లోకంలోకి వచ్చిన తరువాత గురువయిన సాందీపని మహర్షికి ఎంత సేవ చేసాడో! ఆ సేవకుమెచ్చి గురువులు కూడా అలాగే అనుగ్రహించేసారు. ఒకరోజు సమిధలు తేవడానికి అరణ్యానికి వెళ్ళారు శ్రీ కృష్ణుడు, కుచేలుడు. కొద్దిసేపటికి మబ్బులు పట్టి హోరున వాన, చీకటి.. అరణ్యంలో దారితప్పి తెల్లవారేసరికి తిరిగొచ్చారు. ఈలోగా వారు రాలేదన్న బెంగతో సాందీపని మహర్షి వాళ్ళ పేర్లుపెట్టి పెద్దగా అరుస్తూ వెతికాడు ఆ రాత్రంతా. వారు ఎదురు పడగానే గట్టిగా కావలించుకుని ‘‘ఓ కృష్ణా! ఓ కుచేలా! ఇకపై మీకు విశేషమైన ఐశ్వర్యం, జ్ఞానంతోపాటూ బంధుమిత్ర బలగాలు అన్నీ విశేషంగా సమకూరుతాయి’’ అని ఆశీర్వదించేసాడు ఆ ఆనందంలో. గురువు ప్రేమైక హృదయుడు. దాచుకోవడం గురువుకి తెలియదు. తాను కష్టపడి నేర్చుకున్నది మొత్తం ఇచ్చేస్తాడు. అంతేకాదు, గురువు వినయ సంపన్నుడు. ఉపనిషత్తులో ఒక కథ ఉంది. సుకేశుడని ఒక మహర్షి. ఆయన దగ్గరకు ఒక రాకుమారుడు వెళ్ళాడు. ‘‘చంద్రకళలు, షోడశకళలు ఏవి? వాటి విశేషం గురించి తెలుసుకోవాలని ఉంది, చెప్పండి’’ అని అడిగాడు.  ‘‘అయ్యో నాకు తెలియదే, మరొకర్ని అడగండి’’ అన్నాడు. చెప్పలేక పోయినవాడు సుకేశుడనే గురువయితే, అడిగిన రాకుమారుడు సిగ్గుపడి తలొంచుకుని వెళ్ళిపోయాడు. ఇదేమిటి? అంటే...ఆయన ఎన్నో శాస్త్రాలు చదువుకున్నాడు, కష్టపడి ఎంతో మంది శిష్యులకు చెబుతున్నాడు. ఆయనకి తెలియని ఏదో ఒక చిన్న విషయం ఉంటే నేనది అడిగి ఆ మహానుభావుడినోటితో తెలియదనిపించానే, ఇటువంటి ప్రశ్న అడిగి ఆయన్ని ఇబ్బందిపెట్టానే...అని క్షోభిస్తూ వెళ్ళాడు యోగ్యుడైన ఆ శిష్యుడు.

శిష్యుడు గురువుగారి కీర్తిప్రతిష్ఠలు నిలబెట్టడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూంటాడు. పెద్దవాళ్ళయిన తరువాత కుచేలుడు, శ్రీకృష్ణుడు ఒకసారి కలుసుకున్నప్పుడు పాతజ్ఞాపకాలు నెమరువేసుకునే క్రమంలో కృష్ణుడు మొదటగా ప్రస్తావించిన అంశం – ‘‘ఓయ్, కుచేలా! నీకు గుర్తున్నారు కదా మనకు పాఠం చెప్పిన ఆ గురువుగారంటూ... మన సాందీపని గురువుగారు ఎంత గొప్పవాడయ్యా, అజ్ఞానమన్న చీకటికి దీపమయ్యా ఆయన. ఎంత మహానుభావుడో.. అవ్యయమైన బ్రహ్మాన్ని లోపల తాను అనుభవించి ఎప్పుడూ సత్కర్మలు చేస్తూ పండిత శ్రేష్ఠులచేత ప్రశంసలనందుకొన్నవాడయ్యా... అటువంటి గురువు లభించడం.. అక్కడ మనం చదువుకోవడం ఎంత అదృష్టమయ్యా..’’ అంటాడు.  రుక్మిణీ కళ్యాణంలో... అగ్నిద్యోతనుడు రుక్మిణికి గురువు, కాబట్టి కృష్ణుడికీ గురువే. ఆయనను రమ్మని పిలుస్తూ ’ఆలస్యం చేస్తావేం..ఆవిడ రాసిన పత్రిక చదివావుగా, లే, లేచిరా, పెళ్ళవుతుందా, అని సందేహిస్తున్నావా. తప్పకుండా అవుతుంది. ఉపాధ్యాయులం, గురువులమయిన మేం ఆశీర్వదిస్తున్నాం. కళ్యాణమస్తు.’’ గురుభక్తి ఎలా ఉండాలో చిన్న పద్యాల్లో పోతన గారు అద్భుతంగా ఆవిష్కరించేసారు.  శిష్యుడి ప్రథమ కర్తవ్యం–గురువుగారి గౌరవాన్ని నిలబెట్టడం. గురువు పేరెత్తితే చాలు పరబ్రహ్మం, పరిపూర్ణావతారం కూడా తలవంచేసింది. అంతే. అదీ ఆచార్యదేవోభవ అంటే. 

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top