ముంచుకొస్తున్న గ్లైఫొసేట్‌ ముప్పు!

Glyphosate not a health threat says scientists - Sakshi

నేలతల్లికి ఎప్పుడూ లేని కష్టం వచ్చిపడింది. ఎక్కడో అమెరికాలోనే, బ్రెజిల్‌లోనో, అర్జెంటీనాలోనో కాదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన కలుపు నిర్మూలన మందు వల్ల భూమి ఆరోగ్యానికి, పర్యావరణానికి, మనుషులు, పశువుల ఆరోగ్యానికి పెనుముప్పు వచ్చి పడింది..

ఆ పెనుముప్పు పేరే.. కలుపు మందు.. గ్లైఫొసేట్‌!
దీన్ని పిచికారీ చేస్తే ఎంత పచ్చగా ఉన్న మొక్కయినా నిలువునా మాడి మసై పోతుంది. చట్ట ప్రకారం అయితే.. తేయాకు తోటల్లో తప్ప మరే పంట లేదా తోటలోనూ  గ్లైఫొసేట్‌ కలుపు మందును వాడకూడదు. అటువంటిది, ఈ ఏడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సుమారు 15 లక్షల ఎకరాల్లో ఈ కలుపు మందును వాడుతున్నారు. ప్రభుత్వ అనుమతి లేని బీజీ–3 అనే జన్యుమార్పిడి పత్తిని తెలిసో తెలియకో నాటిన రైతులంతా గ్లైఫొసేట్‌ను తమ పొలాల్లో పిచికారీ చేస్తున్నారు. ఈ రకం పత్తి మొక్కపై గ్లైఫొసేట్‌ చల్లినా అది చనిపోకుండా ఉండేలా, కేవలం కలుపు మొక్కలన్నీ మాడిపోయేలా (ఈ అమెరికన్‌ హైబ్రిడ్‌ పత్తి రకానికి) జన్యుమార్పిడి చేశారని సమాచారం.  

తల్లి పాలల్లోనూ అవశేషాలు..
గ్లైఫొసేట్‌ అత్యంత ప్రమాదకరమైన కటిక విష రసాయనం. ఇది కేన్సర్‌ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల నాడే ప్రకటించింది. దీన్ని పంట పొలాల్లో పిచికారీ చేయటమే కారణం. అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాల్లో విచ్చలవిడిగా దీన్ని తట్టుకునే పత్తి తదితర జన్యుమార్పిడి పంటలు సాగవుతున్నాయి. ఫలితంగా అక్కడి భూములు, భూగర్భ జలాలు కలుషితమైపోయాయి. చివరికి తల్లి పాలల్లోనూ, మనుషుల మూత్రంలోనూ గ్లైఫొసేట్‌ అవశేషాలు ఉన్నాయని తేలింది.

కలుపు మందు చల్లితే భూమికి ఏమవుతుంది?
పంట భూమి (అది మాగాణి అయినా, మెట్ట/చల్క భూమి అయినా సరే) ఆరోగ్యంగా ఉండాలంటే.. ఆ మట్టిలో వానపాములు, సూక్ష్మజీవరాశి పుష్కలంగా ఉండాలి. అప్పుడే నేల సజీవంగా, స్వయం సమృద్ధంగా ఉంటుంది. చెంచాడు మట్టిలో ఈ భూతలంపై మనుషులెందరు ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయని ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా ఉన్న ఆహార, వ్యవసాయ సంస్థ లెక్క తేల్చింది. ఇలాంటి పొలంలో కలుపు మందును చల్లితే ఆ భూమిపైన కలుపు మొక్కలతోపాటు భూమి లోపలి సూక్ష్మజీవరాశి, వానపాములు కూడా పూర్తిగా నశిస్తాయి. నిర్జీవంగా మారిన నేల గట్టిపడి చట్టుబండవుతుంది. నీటి ఎద్దడిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. కలుపు మందుల వాడకం ఎక్కువ కావడం వల్ల రైతులు, రైతు కూలీలు, సాధారణ ప్రజానీకం ఆరోగ్యం మరింత ప్రమాదంలో చిక్కుకుంటాయి.

జగమొండి కలుపు మొక్కలు!
కలుపు మొక్కల నిర్మూలనకు గ్లైఫొసేట్‌ మందును కొన్నేళ్లు చల్లుతూ ఉంటే∙‘జగమొండి కలుపు మొక్కలు’ పుట్టుకొస్తాయి. అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా.. తదితర దేశాల్లో ఇదే జరిగింది. తోటకూర వంటి సాధారణ జాతుల మొక్కలు కూడా గ్లైఫొసేట్‌ దెబ్బకు మొండి కలుపు చెట్లుగా అవతారం ఎత్తాయి. అమెరికాలోని సుమారు 6 కోట్ల ఎకరాల్లో వీటి బెడద తీవ్రంగా ఉందని యూనియన్‌ ఆఫ్‌ కన్‌సర్న్‌డ్‌ సైంటిస్ట్స్‌(యు.సి.ఎస్‌.) నివేదిక తెలిపింది. ఎంత తీవ్రమైన కలుపు మందులు చల్లినా ఈ కలుపు మొక్కలు చావకపోగా, ఆరేడు అడుగుల ఎత్తు పెరుగుతుండటంతో అక్కడి రైతులు సతమతమవుతున్నారు.
కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త కలుపు మందులు కనిపెడుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు విషమిస్తున్నాయే తప్ప మెరుగవ్వటం లేదని యు.సి.ఎస్‌. శాస్త్రవేత్తలు తెలిపారు. కలుపు నిర్మూలనకు పైపాటు దుక్కికి అయ్యే ఖర్చులు గ్లైఫొసేట్‌ వల్ల తొలి దశలో తగ్గినప్పటికీ.. క్రమంగా జగమొండి కలుపుల బెడద ఎక్కువ అవుతున్నదని వారు తెలిపారు. గ్లైఫొసేట్‌ కలుపు మందును తట్టుకునేలా జన్యుమార్పిడి చేసిన పంటలను, ఏళ్ల తరబడి ఏక పంటలుగా విస్తారంగా సాగు చేస్తుండటమే ఈ ఉపద్రవానికి మూలకారణమని శాస్త్రవేత్తలు తేల్చటం విశేషం.
అమెరికా తదితర దేశాల పొలాల్లో గ్లైఫొసేట్‌ కలిగించిన పెనునష్టం మన పాలకులకు, రైతులకు కనువిప్పు కావాలి.

భూములు నాశనమవుతాయి..
కలుపు మందును తట్టుకునే బీజీ–3 రకం పత్తి పంటకు మన దేశంలో ప్రభుత్వ అనుమతి లేదు.  గ్లైఫొసేట్‌ అత్యంత ప్రమాదకరమైన కలుపు మందు. పంట భూములు నాశనమవుతాయి. భూముల్లో సూక్ష్మజీవరాశి, వానపాములు,  జీవవైవిధ్యం నశిస్తుంది. మన దేశంలో తేయాకు తోటల్లో తప్ప మరే పంటలోనైనా దీన్ని వాడటం నిషిద్ధం. పత్తి సాగు విస్తీర్ణంలో ఈ ఏడాది 20% వరకు బీజీ–3 రకం పత్తిని అక్రమంగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వం కన్నుగప్పి విత్తనాలమ్మిన వారు, సాగు చేస్తున్నవారు, విత్తనాలు సేకరించి నిల్వచేసే వారు.. అందరూ నేరస్థులే. గ్లైఫొసేట్‌ను తట్టుకునే జన్యుమార్పిడి పంటలను అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా తదితర దేశాల్లో సాగు చేస్తున్నారు. అక్కడ మొండి కలుపు మొక్కలు కొరకరాని కొయ్యలుగా తయారయ్యాయి. మన దగ్గర రైతులకు సంతోషం ఒకటి, రెండేళ్ల కన్నా ఎక్కువ కాలం నిలవదు. దీర్ఘకాలంలో పర్యావరణం దెబ్బతింటుంది. ఇది కేన్సర్‌ కారకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రకటించింది. సీఐసీఆర్‌ పత్తి హైబ్రిడ్‌లే ప్రత్యామ్నాయం.
– డా. కేశవులు, డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర విత్తన, సేంద్రియ ధృవీకరణ సంస్థ, హైదరాబాద్‌

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top