
అడవి, పొలం వేర్వేరు...అడవిలో విత్తిన పంటలు ఉండవు.. పొలంలో చెట్లు ఉండవు.. అయితే, ‘ఆగ్రోఫారెస్ట్రీ’లో రెండూ కలగలిసి ఉంటాయి. దీన్ని ‘అటవీ వ్యవసాయం’ అనొచ్చు. పొలాల మధ్యలోనే కాదు గట్ల మీద కూడా మచ్చుకు ఒక చెట్టు కూడా లేని వ్యవసాయ భూములు మన గ్రామాల్లో విస్తారంగా కనిపిస్తాయి. చెట్టు నీడ పడిన చోట పంట మొక్కలు సరిగ్గా పెరగవని ఉన్న చెట్లు కొట్టెయ్యటం మనకు తెలిసిందే. విస్తారమైన పొలాల మధ్య ఒక్క చెట్టూ లేని ప్రాంతాలు కూడా కనిపిస్తున్నాయి. 3–6 నెలల్లో పూర్తయ్యే పంటలను ఎప్పటికప్పుడు విత్తుకొని, పంటయ్యాక శుభ్రం చేసి దున్ని పెట్టుకునే అలవాటు వల్ల వ్యవసాయ భూములు నిస్సారంగా మారిపోతున్నాయి.
ఈ దుస్థితి మారాలి.అంటే, పంట భూముల్లోకి తిరిగి చెట్లను ప్రవేశపెట్టాలి. అందుకని, ‘ఆగ్రోఫారెస్ట్రీ’ని ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది. స్వల్పకాలిక పంటలు సాగు చేసే పొలాల్లోనూ ఆదాయాన్నిచ్చే రకరకాల చెట్లు, పశువులను కలిపి పెంచటాన్ని.. ఆగ్రోఫారెస్ట్రీని.. ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.
రైతుల ఆర్థిక ప్రయోజనం కోసం, పనిలో పనిగా పర్యావరణ సేవల కోసం ఈ అటవీ వ్యవసాయాన్ని పెంపొందించాలన్నది లక్ష్యం. విలువైన కలప చెట్లను పెంచుతున్న రైతులు ఆ చెట్లు ఎదిగిన తర్వాత నరికి అమ్ముకోవటానికి సవాలక్ష ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ బాధల నుంచి రైతులను ఒడ్డునపడెయ్యటం ద్వారా చెట్ల పెంపకాన్ని పంట పొలాల్లోనూ ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం తలపెట్టింది.
వాస్తవానికి, రైతులు తమ పొలాల్లో పెంచే (ముఖ్యంగా విలువైన కలప జాతి) చెట్ల నరికివేత సమయంలో పొందాల్సిన అనుమతుల ప్రక్రియ ఇప్పుడు చాలా సంక్లిష్టంగా ఉంది. దీన్ని సులభతరం చేస్తూ ఇటీవలే నమూనా నియమాలను విడుదల చేసింది కేంద్రం. ఈ రైతుల కోసం ఒక ప్రత్యేక పోర్టల్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకొన్న రైతులు ఆన్‌లైన్‌లోనే అనుమతులు తీసుకునే ఏర్పాటు చేస్తోంది. అయితే, ఆగ్రోఫారెస్ట్రీపై సరికొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి, అమలు చేయాల్సి ఉంది! ఆ నియమాలేమిటో చూద్దాం...
ఆగ్రోఫారెస్ట్రీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో భారత పర్యావరణ, అటవీ, క్లైమెట్ ఛేంజ్ మంత్రిత్వ శాఖ వ్యవసాయ భూమిలో పెంచిన చెట్లను నరకటం, రవాణా చేయటానికి సంబంధించిన నియమ నిబంధనలను సులభతరం చేసే నమూనా నియమ నిబంధనలను ఇటీవల ప్రకటించింది.
ప్రైవేట్ భూమిలో చెట్ల పెంపకాన్ని సులభతరం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, నేలను పునరుద్ధరించడం, డిజిటల్ ట్రేసబిలిటీ ద్వారా అధికారిక అనుమతుల తిప్పలు తగ్గించడం.. తద్వారా విదేశీ కలప దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయ భూమిలో పెరిగిన చెట్లను నరికివేతకు స్పష్టమైన నియమాలు ఇప్పటి వరకు లేకపోవటంతో నమూనా నియమనిబంధనలను కేంద్రం రూపొందించింది.
అయితే, సాధారణ పంట పొలాలను అటవీ వ్యవసాయ క్షేత్రాలుగా మార్చేందుకు దోహదపడే ఈ ‘నమూనా నియమాల’ ప్రయోజనాలు ఎంత వరకు రైతులకు అందుతాయనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం, అమలు తీరుపై ఆధారపడి ఉంటుంది. కేంద్రం చెప్పినంత మాత్రాన రాష్ట్రాలు వాటిని విధిగా అనుసరించాల్సిన బాధ్యత లేదు.
రూ. లక్ష కోట్ల కలప దిగుమతి
మన దేశం ప్రతి సంవత్సరం దాదాపు రూ. లక్ష కోట్ల విలువైన కలపను దిగుమతి చేసుకుంటున్నది. చెక్క ఫర్నీచర్, తలుపులు, కిటికీలు చాలా వరకు మలేషియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా లేదా ఇండోనేషియా నుండి దిగుమతి చేసుకున్న కలపతో తయారవుతున్నాయి. అదే సమయంలో, మన దేశంలో, అటవీ వ్యవసాయం చేయడానికి అనువైన కోట్ల హెక్టార్ల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది.
కానీ, కారణం ఏదైతేనేమి, మన దేశంలోని రైతులు ఈ భారీ మార్కెట్‌ను ఉపయోగించుకోలేక΄ోయారు. భారతీయ రైతులు ఇంత ఆశాజనకమైన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? అని ప్రశ్నించుకునే సందర్భం వచ్చింది. కోట్లాది మంది రైతులు ప్రతిరోజూ తమ ΄÷లాలను జాగ్రత్తగా చూసుకుంటుంటారు. ఆ సాగు భూమిని ‘చెట్లతో కూడిన వ్యవసాయం’ కోసం ఉపయోగించడం ద్వారా కలప దిగుమతికి స్వస్తి చెప్పవచ్చు.
అటవీ వ్యవసాయం కేవలం కలప గురించి మాత్రమే కాదు. ఇది నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, పంట దిగుబడిని పెంచడానికి, ఆహార భద్రతను పరిపూర్ణం చేయటంలో, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. నదులను పునరుద్ధరించడంలో చెట్ల ఆధారిత వ్యవసాయం ఎలా సహాయపడుతుందో చూపే ఉద్యమ ఉదాహరణలు ఉన్నాయి. అయినా, ఇన్నాళ్లూ అటవీ వ్యవసాయం విస్తరించక΄ోవటానికి కారణాలు ఉన్నాయి.
చట్టపరమైన చిక్కు
ఒక మారుమూల గ్రామంలో మీరు ఒక రైతు అని ఊహించుకోండి. కలపకు పెరుగుతున్న డిమాండ్ చూసి, మీ భూమిలో అధిక విలువైన కలప చెట్లను నాటారు. మొక్కలు కొని, గుంతలు తవ్వి నాటారు. నీటి΄ారుదల ఏర్పాటు చేశారు. చెట్లను ఏళ్ల తరబడి జాగ్రత్తగా చూసుకున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిగాను, ఒక రకమైన బీమాగా కూడా భావించి ఆశలు పెంచుకున్నారు. కానీ చివరకు చెట్లు నరికే సమయం వచ్చినప్పుడు, సమస్య వచ్చిపడుతుంది. మీ సొంత వ్యవసాయ భూమిలో చెట్లు పెరిగినప్పటికీ, వాటిని మీ వ్యవసాయ ఉత్పత్తులుగా చట్టం పరిగణించదు! చట్టబద్ధంగా, అవి ‘అటవీ ఉత్పత్తుల’ కిందకు వస్తాయి.
పెరిగిన చెట్లను నరకాలంటే సంక్లిష్టమైన అనుమతులు అవసరం అవుతాయి. అటవీ, రెవెన్యూ, వ్యవసాయ శాఖల నుంచి ఆమోదాలు తీసుకోవాలి. అనుమతుల కోసం తరచుగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పటికే రోజువారీ బాధ్యతలతో తీరిక లేకుండా ఉండే రైతులకు ఈ పనులు సులభం కాదు.
2014 తర్వాత ఆశాజనకమైన కదలిక
ఈ పరస్థితుల్లో మార్పు తేవటానికి ఆశాజనకమైన విధాన మార్పులు జరుగుతున్నాయి. రైతులు చెట్లను వ్యవసాయ పంటలతో అనుసంధానించడాన్ని ప్రోత్సహించడానికి జాతీయ అటవీ వ్యవసాయ విధానాన్ని 2014లో అమల్లోకి తెచ్చారు. 2018లో ఒక నిపుణుల కమిటీ చెట్ల ఆధారిత వ్యవసాయ క్షేత్రాలను ప్రధాన స్రవంతి వ్యవసాయంలోకి తీసుకురావడం ద్వారా ‘అడవుల వెలుపల చెట్టు’న్న ప్రాంతాన్ని విస్తరించాలని సిఫారసు చేసింది. ఈ విధానాలు మంచి ఉద్దేశ్యంతో కూడినవే అయినప్పటికీ, అవి నిజంగా కీలక సమస్యను పరిష్కరించలేదు. అదేమిటంటే.. ప్రైవేట్ వ్యవసాయ భూముల్లో పెంచే చెట్లకు సంబంధించిన చట్టపరమైన స్థితి మారలేదు.
ఈ సమస్య 1927 నాటి ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ నాటిది. ఇది వలసరాజ్యాల కాలం నాటి చట్టం. ప్రైవేట్ భూమిలో పండించిన కలపతో సహా అన్ని రకాల కలపలను ‘అటవీ ఉత్పత్తులు’గానే నిర్వచించింది. దీని అర్థం రైతులు తాము పెంచిన చెట్లను నరకడానికి లేదా రవాణా చేయడానికి అటవీ శాఖ అనుమతులు తీసుకోవటం అవసరం. ఈ పాత నిబంధన దాదాపు ఒక శతాబ్దం పాటు 2023 వరకు అమలులో ఉంది.
అటవీ సంరక్షణ చట్టానికి 2023లో ఒక మైలురాయి వంటి సవరణ జరిగింది. అధికారికంగా అడవిగా నోటిఫై అయిన భూమికి లేదా 1980 అక్టోబర్ 25 నాటికి ప్రభుత్వ రికార్డులలో అడవిగా నమోదైన భూమికి మాత్రమే వర్తిస్తుందని, రైతుల పొలాలకు వర్తించదని ఈ సవరణ స్పష్టం చేసింది. సరళంగా చెప్పాలంటే, రైతులు ఇప్పుడు తమ వ్యవసాయ భూమిలో చెట్లను పెంచుకోవచ్చు. వాటిని నరికితే జరిమానా పడుతుందనే ఆందోళన లేకుండా ఆగ్రోఫారెస్ట్రీ సాగు చేసుకోవచ్చు.
సొంత భూమిలో పెంచిన చెట్లను నరకడానికి, రవాణా చేయటానికి మాత్రం అనుమతులు తప్పనిసరి అనే మరో ప్రధాన అడ్డంకి మిగిలే ఉంది. ప్రతి రాష్ట్రం కొన్ని జాతుల చెట్ల జాబితాను రూపొందించింది. వీటిని నరకాలన్నా లేదా కలప రవాణా చేయాలన్నా ప్రత్యేక అనుమతి అవసరం. తరచూ మారే ఈ నియమనిబంధనలు రైతులను గందరగోళపరుస్తూ ఉంటాయి.
ఎన్‌టిపిఎస్‌కు స్పందన కరవు
రైతులకు ఈ అనుమతులు ఇవ్వటం కోసమని 2020లో ‘నేషనల్ ట్రాన్సిట్‌పాస్ సిస్టమ్’(ఎన్‌టిపిఎస్) కేంద్రం ఆన్‌లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటివరకు, ఇది పెద్దగా ఆదరణ పొందలేదు. దాదాపు 950 మంది రైతులు మాత్రమే ఈ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేసుకున్నారు.
కాబట్టి, ఆగ్రోఫారెస్ట్రీ నిబంధనలను మరింత సరళీకరించాల్సిన అవసరాన్ని గుర్తించిన కేంద్ర పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ 2025 జూన్‌లో ‘వ్యవసాయ భూమిపై చెట్ల నరికివేతకు నమూనా నియమాల’ను ప్రకటించింది. అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఏకీకృత, రైతు స్నేహ పూర్వక వ్యవస్థ ఏర్పాటుకు ఇవి వీలు కల్పిస్తున్నాయి.
కొత్త నియమాలు చెబుతున్నదేమిటి?
నేషనల్ టింబర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఎన్‌టీఎంఎస్) రైతులు తమ పొలాల్లో పెంచుతున్న చెట్లను నమోదు చేసుకోవడానికి, పర్మిట్లను ట్రాక్ చేయడానికి సహాయపడుతుంది. ఇది జాప్యాన్ని తగ్గిస్తుంది. రైతులు తమ తోటల భూములను ఎన్‌టీఎంఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. భూమి యాజమాన్యం, ఊరు, నాటిన జాతులు, నాటిన తేదీలు వంటి వివరాలను అందించాలి. చెట్లను జియోట్యాగ్ చేసిన ఫోటోలను కూడా అప్‌లోడ్ చేయాలి. కాలానుగుణంగా కొత్త సమాచారాన్ని జోడించాలి.
9 చెట్లకు ఆటోమేటిక్ అనుమతి
పది చెట్ల కంటే తక్కువ పెంచుతున్న రైతులు చెట్ల ఫోటోలను అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ పోర్టల్ ద్వారా ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌ఓసీ)ను, చెట్లు నరకడానికి, రవాణా చేయటానికి ఆటోమేటిక్‌గా అనుమతులు పొందవచ్చు. 10 కంటే ఎక్కువ చెట్లు ఉన్న రైతులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గుర్తింపు పొందిన ఏజెన్సీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించిన తర్వాత అనుమతి మంజూరవుతుంది.
2016 నాటి కలప ఆధారిత పరిశ్రమల (స్థాపన – నియంత్రణ) మార్గదర్శకాల ప్రకారం ఏర్పడిన రాష్ట్ర స్థాయి కమిటీలు ఈ నియమాలను అమలు చేస్తాయి. విధానాల సరళీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు సలహా ఇస్తాయి. చెట్ల నరికివేత కోసం దరఖాస్తులను ధ్రువీకరించడానికి అటవీ నిర్వహణ లేదా వ్యవసాయ అటవీశాస్త్రంలో నైపుణ్యం కలిగిన ఏజెన్సీలను కూడా ఈ కమిటీలు ఎంప్యానెల్ చేస్తాయి. డివిజనల్ ఫారెస్ట్ అధికారులు కాలానుగుణంగా ధ్రువీకరణ సంస్థల పనితీరును పర్యవేక్షిస్తారు.
ఈ నియమాలు రైతులు అధికారిక చిక్కుల్లో చిక్కుకోకుండా కలప చెట్లను పెంచడం, నరకడం, విక్రయించే ప్రక్రియను సులభతరం చేయడానికి దోహదపడతాయి. అదే సమయంలో ప్రతి రాష్ట్రం స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికి వీలు ఉండటం విశేషం. రాష్ట్రాలు వీటిని ఆమోదిస్తేనే ఆగ్రోఫారెస్ట్రీ రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది.
ఆకు విలువ రూ.5!
చెట్టు అందించే పర్యావరణ సేవలు అన్నీ ఇన్నీ కాదు. తనపైన పడిన వర్షాన్ని వేర్ల ద్వారా భూమిలోకి ఇంకింపజేస్తుంది. ఏడాది పొడవునా పచ్చగా ఉంటుంది. పక్షులకు ఆవాసాన్ని కల్పిస్తుంది. పక్షులు పంటలపై పురుగుల్ని ఏరుకొని తిని రైతుకు మేలు చేస్తాయి. పక్షుల విసర్జితాలు పంట భూమిలో సూక్ష్మజీవరాశిని పెంచి సారవంతం చేస్తాయి. చెట్టు ఆకులు రాల్చుతుంటుంది.
ఆ ఆకులు భూమిలో కలిసి భూసారం పెరుగుతుంది. భూమి లోపలి పొరల్లో నుంచి చెట్టు గ్రహించిన పోషకాలను ఆ ఆకుల ద్వారా నేలను సారవంతం చెయ్యటానికి చెట్టు ఆకులు రాల్చుతూ ఉంటుంది. అందుకే, ‘రాలే ప్రతి ఆకూ రూ.5తో సమానం’ అని ప్రసిద్ధ సేంద్రియ వ్యవసాయ రైతు శాస్త్రవేత్త దివంగత డాక్టర్ ఎల్. నారాయణరెడ్డి అన్నారు.
అటవీ వ్యవసాయంలో అనేక రకాలు...
సాధారణ ఆగ్రోఫారెస్ట్రీ
చెట్ల మధ్య పంటల సాగు. పండ్ల చెట్లు లేదా కలప చెట్లు లేదా పశువుల మేతకు పనికొచ్చే ఆకులనందించే జాతుల చెట్ల వరుసల మధ్య సీజనల్ పంటలు పండిస్తారు.
సిల్వోపాస్టర్
చెట్ల మధ్య పచ్చిక బయళ్ళుంటాయి. అందులో పశువులు మేస్తూ పెరుగుతాయి. జంతువులకు చెట్లు నీడనిస్తాయి. కలుపు నియంత్రించడంలో జంతువులు సహాయపడతాయి.
ఆగ్రోసిల్వో పాస్టోరల్
చెట్లు, పంటలు, జంతువులు కలిసి పెరిగే క్షేత్రం. ఒక చక్కని ఉదాహరణ: ఇంటి తోట. ఇక్కడ వివిధ రకాల కూరగాయ మొక్కలు, పండ్ల చెట్లు, జంతువులు.. అన్నీ కలిసి పెరిగే వ్యవస్థ.
అటవీ వ్యవసాయం మనకు కొత్తది కాదు, పురాతనమైనదే.కానీ, ఆధునిక అటవీ వ్యవసాయ పద్ధతులు సమకాలీన వ్యవసాయ, పర్యావరణ సవాళ్లకు ప్రకృతి ఆధారిత పరిష్కారంగా సరికొత్త ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
విండ్‌బ్రేక్‌లు
తీవ్ర గాలి, ధూళి నుంచి పంటలు, పశువులు, భవనాలను రక్షించడానికి చెట్లు, పొదలను వరుసలుగా నాటుతారు.
పతంగి రాంబాబు
సాక్షి, సాగుబడి డెస్క్
(చదవండి: ఐదు దొంతర్ల సాగులో శిక్షణ : ఏటా రూ.3 లక్షల నికరాదాయం)