ఫ్యూచర్‌ కేక్స్‌

Future cakes business  from two womens - Sakshi

కంటికి ఇంపుగా కనిపించాలి. నాలుకకు హితవుగా ఉండాలి. దేహానికి ఆరోగ్యాన్నివ్వాలి. ఇదీ ఆహారానికి శిల్ప, మాధవి చెప్పే భాష్యం. ఆహార ప్రియుల జఠరాగ్నిని శాంతింప చేయడం ద్వారా కెరీర్‌లోని తమ లక్ష్యాగ్నిని జ్వలింపజేసుకుంటున్న ఈ యువతులు.. విజయవంతమైన ఆంట్రప్రెన్యూర్‌లుగా నిలవాలనే ఒక ఫైర్‌తో పనిచేస్తున్నారు. అందుకేనేమో.. తమ రెస్టారెంట్‌కి ‘ఫ్యూ’ అని పేరు పెట్టుకున్నారు. ‘ఫ్యూ’ అంటే ఫ్రెంచిలో ‘మంట’ అని అర్థం.

ఆహారం అంటే ఏదో మనకి వచ్చినట్లు వండుకుని, ఆకలైనప్పుడు తిన్నట్లు కాదు. ఇదొక ఆర్ట్, అందులో రాకెట్‌ సైన్స్‌ అంత శాస్త్రీయత దాగి ఉంటుందని చెబుతున్నారు శిల్పా దాట్ల, మాధవి. ప్రకృతి ఇచ్చిన ముడిసరుకును ఆరోగ్యకరంగా ప్రాసెస్‌ చేయడం, ఆ దినుసులతోనే ప్రకృతిని ప్రతిబింబించేటట్లు రుచులను రూపొందించడం తమ ప్రత్యేకత అంటూ వైట్‌ చాకొలెట్‌తో తయారు చేసిన ఆకును చూపిస్తారు. గులాబీ రంగు లిచీ కేక్‌ మీద అమర్చిన వైట్‌ చాకొలెట్‌ ఆకు అప్పుడే చెట్టు నుంచి రాలిపడిన పారిజాతం పువ్వును తలపిస్తోంది.

తినకుండా దానిని చక్కగా గాజు జాడీలో అలంకరించుకోవాలన్నంత నాజూకుగా ఉందా చాకో లీఫ్‌. ‘‘రెండు నిమిషాల్లో తినేసే పేస్ట్రీ మీద అలంకరణ కోసం ఇంత మనసు పెట్టడమా!’’ అంటే అదే ఫ్రెంచ్‌ వాళ్ల ప్రత్యేకత అంటారు. అక్కడ రుచిగా, శుచిగా, ఆరోగ్యకరంగా తయారు చేయడంతోపాటు గార్నిషింగ్‌ కూడా అంతే శ్రద్ధగా చేస్తారట. ఆ ఫ్రెంచ్‌ సంప్రదాయాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు శిల్ప, మాధవి.

ఇద్దరూ తెలుగమ్మాయిలే
శిల్ప, మాధవి ఇద్దరూ తెలుగమ్మాయిలే. ప్రపంచంలో చాలా దేశాలను చూశారు. రకరకాల రుచులను, అభిరుచులను గమనించారు. మన దగ్గరి ఆహారప్రియులు ముంబై, ఢిల్లీ వెళ్లినప్పుడు కొత్త రుచుల కోసం ప్రయత్నిస్తున్న వైనాన్ని తెలుసుకున్నారు. వాటిని ఇక్కడికి తీసుకురావడం గురించి ఆలోచించారు.

‘ఫ్యూ’ అనే ఫ్రెంచ్‌ పట్టిసెరీ (మామూలు భాషలో బేకరీ షాపు)ని ప్రారంభించారు. ‘‘మనవాళ్లు యూరప్‌ టూర్‌ వెళ్లడం బాగా ఎక్కువైంది. అక్కడి రుచులకు ఫిదా అయిపోవడం కూడా. పారిస్‌ నుంచి ఈఫిల్‌ టవర్‌ను ఇక్కడికి తేలేం, కానీ అక్కడి డెజర్ట్‌ల రుచిని ఇక్కడ చూపించవచ్చు. ఈ రుచులతో టూర్‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవచ్చు. అలా ఒకసారి వచ్చిన వాళ్లు మా ’ఫ్యూ’ను ఇక మర్చిపోరు. మళ్లీ మళ్లీ ఇక్కడికే వస్తారు’ అన్నారు మాధవి.

సొంతంగా చేయడమే ఆనందం
మాధవి పదేళ్లకు పైగా అమెరికాలో ఉద్యోగం చేసి గత ఏడాది ఇండియాకి వచ్చారు. శిల్పకి పందొమ్మిదేళ్లకే పెళ్లయింది. తండ్రి ఎన్‌.సి.ఎల్‌. గ్రూప్‌ ఎం.డి. ఆ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలోనే ఉద్యోగం చేశారామె. సిమెంట్, స్టీల్‌ వంటి బిల్డింగ్‌ మెటీరియల్‌ నిర్వహణతో పాటు తమ కుటుంబానికి ఉన్న కెమికల్‌ కంపెనీ బాధ్యతలు కూడా విజయవంతంగా నిర్వర్తించినప్పటికీ అవేవీ తనకు సంతృప్తినివ్వలేదంటారు. ‘‘నాకు ఇంటీరియర్‌ డెకరేషన్‌ చాలా ఇష్టం. ఆ తర్వాత అంతే ఇష్టమైన అంశం ఆహారం. మా ఇంటికి లంచ్‌కి వచ్చిన అతిథులు కూడా ఇంటిని అలంకరించిన తీరును, నేను వడ్డించిన రకరకాల వంటకాలను ప్రత్యేకంగా మెచ్చుకునేవాళ్లు.

కన్‌స్రక్షన్‌ కంపెనీ బాధ్యతల్లో వచ్చిన ప్రశంసల కంటే ఇంటికి వచ్చిన అతిథుల ప్రశంసలు నాకు చాలా సంతోషాన్నిచ్చేవి. కొన్నాళ్లకు నాకంటూ సొంతంగా ఏదైనా చేయాలనిపించింది. ఫ్యామిలీ బిజినెస్‌లో ఎంత కష్టపడినా, ఎంత విజయవంతంగా నడిపించినా సరే... ‘బోర్న్‌ విత్‌ గోల్డెన్‌ స్పూన్‌’, ‘తాతలు, తండ్రి పరిచిన కార్పెట్‌ మీద నడవడమే కదా’ అంటారు. అంతే తప్ప నా దీక్ష, శ్రమ కనిపించవు. అలా కాకుండా నాకు నేనుగా ఏదైనా స్థాపించి, దానిని విజయవంతంగా నడిపించాలి అనుకున్నాను. అది కుటుంబ వ్యాపారానికి సంబంధం లేకుండా పూర్తిగా భిన్నంగా, నా అభిరుచులకు అనుగుణంగా ఉండాలనుకున్నాను. దాంతో నా హజ్బెండ్‌ బిజినెస్‌లో కూడా పాల్పంచుకోకుండా సొంతంగా ‘ఫ్యూ పట్టిసెరీ’ని స్థాపించాను.

మాధవి, నేను కజిన్స్‌మి. ఇద్దరం ఐడియాస్‌ షేర్‌ చేసుకున్న తర్వాత దాదాపుగా ఎనిమిది నెలల పాటు ఈ ప్రాజెక్ట్‌ మీద వర్కవుట్‌ చేశాం. షెఫ్‌ టీమ్‌ని ముంబై పంపించి సంజనా పటేల్‌ (పేస్ట్రీ క్వీన్‌ ఆఫ్‌ ఇండియా) దగ్గర శిక్షణ ఇప్పించాం. కలినరీలో ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఏది లేదో దానిని మేము పరిచయం చేస్తున్నాం. కలినరీ స్టూడియో, లైవ్‌ డెజర్ట్‌ మాకు మాత్రమే ప్రత్యేకం. లైవ్‌ డెజర్ట్‌ అంటే కస్టమర్‌ కోరిన పదార్థాలతో షెఫ్‌లు అప్పటికప్పుడు తయారు చేసిస్తారు.

బ్రెడ్‌ కోసం సొంత బేకరీ పెట్టడంలో ఉద్దేశం కూడా క్వాలిటీలో తేడా రాకుండా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్‌ని మెయింటెయిన్‌ చేయడం కోసమే. ఫ్రెంచ్‌ రుచులను నేర్చుకోవాలనే వాళ్ల కోసం రెండు– మూడు రోజుల కోర్సులు, రోజుకు రెండు–మూడు గంటల పాటు వారం రోజుల కోర్సులను ప్రవేశపెట్టాం. ఎన్‌.సి.ఎల్‌. కోసం పని చేసిన టైమ్‌కంటే రెండింతలు ఫ్యూ కోసం పని చేస్తున్నాను. సక్సెస్‌ అవుతామనే నమ్మకం ఉంది’’ అంటారు శిల్ప.
 

అత్తింటికి తోడు వచ్చే అమ్మ
తరళా దలాల్‌ మనదేశంలో తొలితరం కమర్షియల్‌ చెఫ్‌. 1966 నుంచి ముంబైలో వంట క్లాసులు మొదలు పెట్టారు. ఆ తర్వాత వంటల పుస్తకాలు రాయడం ప్రారంభించి రెండు వందల పుస్తకాలు రాశారు. టీవీ షోలలో వండుతూ ప్రేక్షకులకు వంటలు నేర్పించారు. ‘అమ్మాయికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించేటప్పుడు తరళా దలాల్‌ వంటల పుస్తకం కూడా వెంట పంపించండి’ అని చెప్పుకునేటంతగా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆమె పుస్తకాలు. ఐదేళ్ల కిందట ఆమె మరణించినప్పటికీ కుకరీ షోలతో ఇప్పటికీ భారతీయ మహిళల మనసుల్లో జీవించే ఉన్నారు. - తరళా దలాల్‌

ఇది మెదడు చేసే పని
వీణా అరోరా ద ఇంపీరియల్‌లో ఎగ్జిక్యూటివ్‌ షెఫ్‌. హోటల్‌ ఇండస్ట్రీలో లెజెండ్‌ షెఫ్‌ ఆమె. టూరిజం మంత్రిత్వ శాఖ నుంచి బెస్ట్‌ లేడీ షెఫ్‌ అవార్డు అందుకున్నారు. ఆమె కలినరీ ట్రైనింగ్‌ ఎక్కడా తీసుకోలేదు. వండడం చేతులతో చేసే పని కాదు, మెదడు ఉపయోగించి చేయాల్సిన పని అంటారామె. కొందరు నేర్చుకుని మెళకువలు సాధిస్తే, కొందరిలో సహజంగా ఈ మెళకువ ఉంటుంది. ఆమె ఆ రెండో కోవకి చెందుతారు. - వీణా అరోరా

అభి‘రుచి’
సంజనా పటేల్‌కి రకరకాల డెజర్ట్‌లు చేయడం ఇష్టం. పారిస్‌లో కన్ఫెక్షనరీ టెక్నాలజీలో డిప్లొమా, లండన్‌లో ఫుడ్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి, ముంబైలో సొంతంగా ‘లాఫోలి’ పేరుతో పాట్టిసెరీ ప్రారంభించారు. ఇండియాలో ఈ తరహా డెజర్ట్‌ ఎటెలియర్‌లలో ఇదే తొలిది. ఫుడ్‌ ఇండస్ట్రీలో ఆమె చేస్తున్న ప్రయత్నాలకు పేస్ట్రీ క్వీన్‌ ఆఫ్‌ ఇండియా, ద సైంటిస్ట్, గేమ్‌ చేంజర్, ద ఒరిజినల్‌’ అనే బిరుదులు వచ్చాయి. - సంజనా పటేల్‌

ఫస్టే కాదు బెస్ట్‌ కూడా
ఫ్రాన్స్‌లో ఉండే క్వాలిటీ కోసం ముడిసరుకులన్నీ విదేశాల నుంచే తెప్పిస్తున్నాం. రసాయన ఉత్పత్తులు లేకుండా పూర్తిగా సహజమైన దినుసులనే వాడుతున్నాం. కలర్స్‌ కూడా మొత్తం వెజిటబుల్‌ కలర్సే. పేస్ట్రీ అనగానే మైదా పిండి గుర్తుకువస్తుంది. కానీ మైదాను తగ్గించి బాదం పొడి వంటి రకరకాల పొడులను చేరుస్తున్నాం. ప్రత్యేకించి పెరిగే పిల్లలకు, మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలకు ఆరోగ్యకరమైన పదార్థాలు చేరుస్తున్నాం. హైదరాబాద్‌లో ఇదే తొలి ఫ్రెంచ్‌ పాట్టిసెరీ. మా ప్రయత్నం ఫస్ట్‌ మాత్రమే కాదు బెస్ట్‌ కూడా అయ్యేటట్లు శ్రమిస్తున్నాం. – మాధవి, శిల్పాదాట్ల, ఉమెన్‌ ఆంట్రప్రెన్యూర్‌లు

– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top