బీపీకీ, షుగర్‌కీ

food special Cucumber Health benefits - Sakshi

గుడ్‌ ఫుడ్‌ 

కీరదోసకాయను మనమందరమూ సలాడ్‌లాగా వాడతాం. పైగా ఇప్పుడు వేసవి కావడంతో దీని ఉపయోగం మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా దీన్ని  సలాడ్‌లా వాడుకుంటారుగానీ నిజానికి కీరదోసతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని.  కీరదోసలో 90 శాతం నీరే ఉంటుంది. దాంతోపాటు ఖనిజలవణాలు కూడా చాలా ఎక్కువ. అందుకే ఒంట్లో నీటిపాళ్లు తగ్గి డీ–హైడ్రేషన్‌కు గురైనప్పుడు వాటిని తక్షణం భర్తీ చేయడానికి కీరదోస ముక్కలు తినడం ఉత్తమమైన మార్గం.కీరదోసలో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ. హైబీపీ ఉన్నవారు క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటే అది రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.  కీరదోసలో పీచు పాళ్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల అది దేహంలోకి చక్కెరను  ఆలస్యంగా, నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తుంది. కాబట్టి డయాబెటిస్‌ రోగులకు మేలుచేస్తుంది. కీరదోసలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంతో పాటు జీర్ణశక్తికి దోహదపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. 
     
కీరదోసలో మేనిని నిగనిగలాడేలా చేసేందుకు ఉపయోగపడే మెగ్నీషియమ్‌ వంటి పోషకాలు చాలా ఎక్కువ. అందుకే దీన్ని సౌందర్యసాధనంగా కూడా వాడతారు. కీరదోసలోని యాంటీఆక్సిడెంట్స్‌ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి. కీరదోస  ముఖ్యంగా మహిళల్లో రొమ్ముక్యాన్సర్లు, పురుషుల్లో ప్రోస్టేట్‌ క్యాన్సర్లను నివారిస్తుంది.కీరదోసను మంచి డీ–టాక్సిఫైయింగ్‌ ఏజెంట్‌గా పేర్కొనవచ్చు. అది ఒంట్లోని అనేక విషపదార్థాలను బయటకు పంపుతుంది. కాలేయాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మూత్రపిండాలపై పడే అదనపు భారాన్ని తొలగిస్తుంది.  రక్తంలోని కొలెస్ట్రాల్‌ పాళ్లను అదుపులో ఉంచి, గుండెజబ్బులను నివారిస్తుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top