రేణువులలో నారాయణుడు

First Hindu temple in Abu Dhabi - Sakshi

అక్షరధామ్‌ రూపురేఖలు, హవా మహల్‌ వర్ణమిశ్రాల మేళవింపుతో అబూధాబిలో మన దేశం నిర్మిస్తున్న స్వామి నారాయణ్‌ ఆలయం పూర్తయేందుకు కొంత సమయం పట్టవచ్చు. అయితే సమయంతో నిమిత్తం లేకుండా ఇప్పటికే ఆ నిర్మాణ ప్రయత్నాల్లోంచి మత సామరస్యం గుడి గంటల ధ్వనిలా ప్రపంచమంతటా వినిపిస్తోంది!

ఇస్లాం దేశమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) రాజధాని అబు ధాబి నగరంలో 26 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఓ హిందూ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం కోసం 2015లోనే యువరాజు షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ 16 ఎకరాల స్థలాన్ని ఉచితంగా కేటాయించగా, ఇటీవల యూఏఈ ప్రభుత్వం నిర్వహించిన సర్వమత సమ్మేళనం సందర్భంగా ఆలయంలో పార్కింగ్, ఇతర సౌకర్యాల కోసం మరో పది ఎకరాలు స్థలాన్ని విరాళంగా ప్రకటించారు. అబు ధాబి–దుబాయ్‌ ప్రధాన రోడ్డు పక్కన నిర్మించనున్న స్వామి నారాయణ్‌ ఆలయ నిర్మాణానికి ఇటీవలే మహంత్‌ స్వామి మహరాజ్‌ భూమి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు కూడా.

బ్రహ్మవిహారి స్వామి ఆలయ నిర్మాణ బాధ్యతలు చూస్తారు. అతిపెద్ద షేక్‌ జాయెద్‌ బిన్‌ సుల్తాన్‌ మసీదుకు సమీపంలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ 2019 సంవత్సరాన్ని టాలరెన్స్‌ (సహనం) సంవత్సరంగా ప్రకటించడమే కాకుండా టాలరెన్స్‌ పేరిట ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ మత సామరస్యం కోసం ఓ నిధిని కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ‘సహన శాఖ’ను ఏర్పాటు చేసిన ఏకైక దేశంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ చరిత్రలోకి ఎక్కింది. ఈ శాఖ సమన్వయంతో ఇస్లాం మత పెద్దల మండలి ఫిబ్రవరి నెల మూడు, నాలుగు తేదీల్లో క్రై స్తవ, ఇస్లాం సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించింది.

దీనికి క్రై స్తవుల తరఫున పోప్‌ ఫ్రాన్సిస్‌ హాజరుకాగా, ఇస్లాం మతస్థుల తరఫున అల్‌ అజర్‌ ఇమామ్‌ అహ్మద్‌ అల్‌ తయ్యబ్‌ ముఖ్య అతిథిగా హాజరై ఓ సంయుక్త ప్రకటన చేశారు. ‘తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన క్యాథలిక్కులు, క్యాథలిక్‌ చర్చి, తూర్పు–పశ్చిమ ప్రాంతాలకు చెందిన ముస్లింలు, అల్‌ అజర్‌ అల్‌ షరీఫ్‌లు సంయుక్తంగా చేస్తున్న ప్రకటన ఏమిటంటే పరస్పర సహకారం, పరస్పర అవగాహనే ప్రవర్తన నియామావళిగా చర్చలే సరైన మార్గంగా కలసి ముందుకు సాగుతాం’ అని. ఆ డిక్లరేషన్‌ను పోప్, ఇమామ్‌లు సంయుక్తంగా విడుదల చేశారు.

పాశ్చాత్య దేశాల్లో క్రై స్తవులు, అరబ్‌ ప్రపంచంలోని ఇస్లాం మతస్థుల మధ్యన సత్సంబంధాలు నెలకొల్పాలనే లక్ష్యంతోనే ఈ సమ్మేళనాన్ని నిర్వహించినప్పటికీ ప్రపంచంలోని పలు మతాలకు చెందిన ప్రతినిధులను కూడా ఆహ్వానించారు. భారత ప్రతినిధిగా హాజరైన బ్రహ్మ విహారి స్వామి సమ్మేళనంలో మాట్లాడారు. ‘నేడు ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని సంస్కృతులు, అన్ని మతస్థుల ముందున్న ముఖ్యమైన అంశం ఒక్కటే. ఐక్యంగా కలిసి ముందుకు వెళితే కలిసి పురోభివృద్ధి సాధిస్తాం. విడిపోయి ముందుకు పోవాలనుకుంటే కుంటుపడిపోతాం’ అని!

మారుతున్న దేశం
గతంలో యూఏఈ కరడుగట్టిన ఇస్లాం దేశం. భారతదేశంలో బాంబు పేలుళ్లకు పాల్పడిన దావూద్‌ ఇబ్రహీం తొలుత యూఏఈలోనే ఆశ్రయం పొందారు. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్‌ ప్రభుత్వాన్ని 1996లో గుర్తించిన మూడవ దేశం యూఏఈ. పాకిస్థాన్, సౌదీ అరేబియా తర్వాత ఈ దేశం అక్కిడి ప్రభుత్వాన్ని గుర్తిస్తూ ‘ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ అప్ఘానిస్తాన్‌’ అని నామకరణం కూడా చేసింది. అలాంటి దేశంలో యువరాజు పట్టాభిషక్తుడైన నాటి నుంచి వివిధ మతాల మధ్య సామరస్యం కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.తమ దేశంలో నివసిస్తున్న వివిధ మతాల వారికి ఉదారంగా స్థలాలు కేటాయించారు. అందులో భాగంగానే ఈ హిందూ దేవాలయం కోసం 26 ఎకరాలు ఇచ్చారు. యూఏఈలో 26 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. వీరికోసం దుబాయిలో ఇప్పటికే ఓ శివాలయం, కృష్ణుడి ఆలయం ఉన్నాయి. 
వి.నరేందర్‌ రెడ్డి
 సాక్షి వెబ్‌ డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top