పెట్టలేం ఏ వంకా..

Few interesting facts about ivanka - Sakshi - Sakshi - Sakshi

జీవితంలో ఏదైనా సాధించాలంటే... గాఢంగా ప్రేమించాలి. ఆ ప్రేమ నుంచి పుట్టుకొచ్చేదే.. దీక్ష, తపన, సంకల్పం. ఇవాంకా తన బిజినెస్‌ను ప్రేమించింది... సమాజాన్ని ప్రేమించింది. నాన్నను ప్రేమించింది... అంతెందుకు? తను ప్రేమించిన కుష్నర్‌ కోసం అతడి మతాన్ని ప్రేమించింది. ఇవాంకా ట్రంప్‌... ఈజ్‌ ఎ లైఫ్‌ ఆఫ్‌ లవ్‌! జీవితాన్ని ఇంతగా ప్రేమించిన ఇవాంకా కు ఇక ఏ వంక పెట్టగలం?!

అమెరికా అధ్యక్షుడి కూతురు ఇవాంకా ట్రంప్‌ గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌లో పాల్గొనడానికి  ఈనెల 28న హైదరాబాద్‌కు వస్తున్న సందర్భంగా ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.

హిల్లరీకి విరాళం
బిల్‌ క్లింటన్, హిల్లరీల కూతురు చెల్సీ.. ఇవాంకాకు చిన్ననాటి స్నేహితురాలు. అందుకే 2008లో హిల్లరీ డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరాక్‌ ఒబామాతో పోటీపడుతున్నపుడు హిల్లరీకి ఎన్నికల విరాళమిచ్చారు ఇవాంకా. ఇప్పుడు ట్రంప్‌కి హిల్లరీ ప్రత్యర్థి.  

బహుముఖ ప్రజ్ఞాశాలి
కుటుంబ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఇవాంకా... ‘ట్రంప్‌ గ్రూపు’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ (కొనుగోళ్లు, అభివృద్ధి విభాగాలు)గా ఎదిగారు. సోదరులు డొనాల్డ్‌ జూనియర్, ఎరిక్‌ ట్రంప్‌లతో కలిసి ట్రంప్‌ హోటల్స్‌ను స్థాపించారు. వాషింగ్టన్‌లోని చారిత్రక ఓల్డ్‌ పోస్ట్‌ ఆఫీసును 1,300 కోట్ల రూపాయలతో లగ్జరీ హోటల్‌గా మలచడంలో, మయామీలోని డొరల్‌ గోల్ఫ్‌ రిసార్ట్‌ను 1,600 కోట్ల రూపాయలతో ఆధునీకరించడంలోనూ ఇవాంకా ముఖ్యభూమిక పోషించారు.

రచయిత్రి కూడా!
ఇవాంకా రచయిత్రి కూడా. ఇప్పటిదాకా రెండు పుస్తకాలు రాశారు. ‘ది ట్రంప్‌ కార్డ్‌: ప్లేయింగ్‌ టు విన్‌ వర్క్‌ అండ్‌ లైఫ్‌’... ఇది 2009లో ప్రచురితమైంది. రెండో పుస్తకం... ‘వుమెన్‌ హూ వర్క్‌: రీరైటింగ్‌ ది రూల్స్‌ ఫర్‌ సక్సెస్‌’. రెండోది ఈ ఏడాది మే నెలలో ప్రచురితమైంది. దీంట్లో మహిళలు ఉద్యోగ– ఇంటి బాధ్యతల మధ్య సమతౌల్యం సాధించడం ఎలాగో సూచనలు చేశారు.

విమర్శల్ని తిప్పికొట్టారు
ట్రంప్‌ నోటికి అదుపు ఉండదు.  మహిళలను చులకన చేస్తూ ట్రంప్‌ మాట్లాడిన టేపులూ ప్రచారపర్వంలో బయటకు వచ్చాయి. ఆ సమయంలో ఇవాంకా ఆయన్ను సమర్థించారు. తండ్రిపై విమర్శలను తిప్పికొట్టారు.

చదువుతూనే మోడలింగ్‌
డొనాల్డ్‌ ట్రంప్‌కు, చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన మోడల్‌ ఇవానా (మొదటి భార్య)లకు రెండో సంతానంగా ఇవాంకా ట్రంప్‌ అక్టోబర్‌ 30, 1981లో జన్మించారు. ఇవాంకాకు పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా... ఆమె తండ్రి వద్ద పెరిగింది. చదువును నిర్లక్ష్యం చేయనని తల్లిదండ్రులను ఒప్పించి మరీ 14 ఏళ్ల వయసులో మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టింది. వారాంతాల్లో, సెలవుల్లో టామీ హిల్‌ఫిగర్, ససాన్‌ జీన్స్‌ బ్రాండ్లకు మోడల్‌గా చేసింది. 1997లో సెవంటీన్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీపై కనిపించింది. అదే ఏడాది మిస్‌ టీన్‌ యూఎస్‌ఏ పోటీకి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.

ప్రేమ కోసం మతం మార్పు
ఉమ్మడి మిత్రులైన కొద్దిమంది ద్వారా ఇవాంకా 2005లో రియల్టర్‌ జేర్డ్‌ కుష్నర్‌ను మొదటిసారి కలుసుకున్నారు. మూడేళ్లు డేటింగ్‌ చేశాక సంప్రదాయ యూదులైన కుష్నర్‌ తల్లిదండ్రుల అభ్యంతరాలతో వీరు విడిపోయారు. అయితే... ఇవాంకా యూదు మతం స్వీకరించి మరీ 2009లో కుష్నర్‌ను వివాహమాడారు. డొనాల్డ్‌ ట్రంప్‌ కూతురు నిర్ణయానికి పూర్తి మద్దతు ఇచ్చారు.

తండ్రి స్పీడ్‌కు బ్రేకు
తండ్రికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది ఇవాంకా వ్యవహారశైలి. డొనాల్ట్‌ ట్రంప్‌ది దుందుడుకు స్వభావం. వ్యతిరేకులు, విమర్శకులపై ట్వీటర్‌లో తీవ్రంగా విరుచుకుపడతారు. ఇవాంకా మితభాషి. కలుపుగోలుగా ఉంటారు. తన అభిప్రాయాన్ని చాలా మృదువుగా సూటిగా, స్పష్టంగా చెబుతారు. మధ్యలో అడ్డుకోకుండా  ఎదుటివారు చెప్పేది సాంతం వింటారు. మహిళా సాధికారత, సమాన వేతనం... తదితర అంశాలను ఇవాంకా ప్రచారంలో విరివిగా ప్రస్తావించడం... మహిళా ఓటర్లలో డొనాల్డ్‌ ట్రంప్‌ పట్ల సానుకూలత ఏర్పడడానికి కారణమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు ట్రంప్‌లో దూకుడు, మాటల్లో కరుకుదనం  కనిపించడం లేదు. దీని వెనుక ఇవాంకా పాత్ర ఉంది.

మొహ మాటం లేని అమ్మాయి
ఈ ఏడాది డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఇవాంక మొదటి రెండు నెలలు అనధికారికంగా తండ్రికి సలహాదారుగా ఉన్నారు. తగిన నిర్ణయాలు తీసుకోగలదని, అభిప్రాయాలను వెల్లడించడంలో నిర్మొహమాటంగా ఉంటారని ఇవాంకకు పేరు. దాంతో డొనాల్ట్‌ ట్రంప్‌ మార్చి 29న ఆమెను తన సలహాదారుగా నియమించుకున్నారు. జీతం లేకుండా అమెరికా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేయడానికి ఇవాంక ముందుకు వచ్చారు. నిబంధనల ప్రకారం తన ఆస్తులను ప్రకటించారు.

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top