హెల్మెట్‌తో వెంట్రుకలు రాలుతాయా? 

Family health counciling - Sakshi

డర్మటాలజీ కౌన్సెలింగ్‌

వాహనం నడిపే సమయంలో నేను ఎప్పుడూ హెల్మెట్‌ వాడుతుంటాను. అయితే  ఇటీవలే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. కాస్త బట్టతలలా ఉంది. ఇలా నా వెంట్రుకలు రాలడానికి హెల్మెటే కారణమా? దీనికి చికిత్స సూచించగలరు. – ఎన్‌. ఆదిత్య, నెల్లూరు 
మీరు చెబుతున్నట్లుగా హెల్మెట్‌ వాడటానికీ జట్టు రాలిపోవడానికి ఎలాంటి సంబంధం లేదు. పైగా హెల్మెట్‌ వల్ల తలకు, జుట్టుకు రక్షణ కలుగుతుంది. మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు బయోటిన్‌ ఫెనస్టెరైడ్, మినాక్సిడిల్, ప్లేట్‌లెట్‌ రిచ్‌ ప్లాస్మా థెరపీ  వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ పూర్తి మెడికల్‌ హిస్టరీని అధ్యయనం చేసి, మీ బట్టతలకు ఇరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్‌ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీరు మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన డర్మటాలజిస్టును కలవండి. 

అరచేతుల్లో చెమటలు... పరిష్కారం చెప్పండి
నా వయసు 25. నా సమస్య ఏమిటంటే... నా అరచేతులు, అరికాళ్లలో చెమటలు ఎక్కువగా పడుతున్నాయి. ఎగ్జామ్స్‌ రాస్తున్నప్పుడు, ఏదైనా రాసుకునే సమయంలో, ఎవరైనా చూస్తుంటే ఈ సమస్య మరీ ఎక్కువైపోయి నా చేతులు, కాళ్లు తడిసిపోతున్నాయి. ఫ్రెండ్స్‌తో కూడా సరిగా కలవలేకపోతున్నాను. చాలా ఇబ్బందిపడుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పండి. 
– శ్రీనివాస చక్రవర్తి, చిత్తూరు 

మీరు ఎదుర్కొంటున్న సమస్యను వైద్యపరిభాషలో పామోప్లాంటార్‌ హైపర్‌ హిడరోసిస్‌ అంటారు. ఇది ఒక నరాలకు సంబంధించిన సమస్య. యాంగై్జటీ వల్ల మీకు ఈ సమస్య వస్తోంది. యాంగై్జటీ పెరిగినప్పుడు చెమట పట్టే ప్రక్రియ పెరుగుతుంది. దీనికి చికిత్స ఇలా... 
1. బోట్యులినమ్‌ టాక్సైడ్‌ అనే ఇంజెక్షన్‌ ద్వారా దీన్ని కొద్దిమేరకు శాశ్వతంగా (సెమీ పర్మనెంట్‌)గా నయం చేయవచ్చు. ఈ ప్రక్రియను ఇటీవల విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఒకసారి ఈ ప్రక్రియ అనుసరించాక 4–6 నెలల్లో చెమటలు పట్టడం అదుపులోకి వస్తుంది. 
2. దీనికి ఐయన్‌టోఫొరెసిస్‌ వంటి మరికొన్ని చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవంత మంచి ఫలితాలు ఇవ్వవు. 
మీరు ఒకసారి అనుభవజ్ఞులైన డర్మటాలజిస్ట్‌ను కలవండి. 

ఈ ఎరుపు, నలుపు రంగు మచ్చలు తగ్గేదెలా? 
నా వయసు 48 ఏళ్లు. నా తొడలపై ఎరుపు, నలుపు రంగు మచ్చలు ఉన్నాయి. చెమటలు పట్టినప్పుడు వాటిలో చాలా దురద ఉంటుంది. అవి క్రమంగా సైజు పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. నేనెన్నో మందులు వాడాను. కానీ ప్రయోజనం లేదు. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. మురళి, కొత్తగూడెం 
మీరు చెబుతున్న అంశాలను బట్టి మీకు ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ సమస్య మాటిమాటికీ తిరగబెడుతున్నట్లు అనిపిస్తోంది. మీరు ఇట్రకొనజోల్‌–100 ఎంజీ మాత్రలను పదిరోజుల పాటు నోటి ద్వారా తీసుకోవాలి. అలాగే మచ్చలున్న చోట మొమాటోజోన్, టర్బినఫిన్‌ ఉన్న క్రీమును 2–3 వారాల పాటు రాయాలి. దీంతోపాటు ప్రతిరోజూ మీరు మల్టీవిటమిన్‌ టాబ్లెట్లు కూడా తీసుకుంటూ ఉండాలి.

మంచి స్కిన్‌ వైటెనింగ్‌ క్రీమ్స్‌ సూచించండి 
నేను ఈ మధ్య ముఖం తెల్లబడటానికి ఒక బ్రాండ్‌కు చెందిన స్కిన్‌ వైటెనింగ్‌ క్రీమ్‌ ఉపయోగిస్తున్నాను. ముఖంలో మార్పు వచ్చింది కానీ... ముఖంపై మొటిమలతో నల్లమచ్చలు వస్తున్నాయి. ఇలా ఈ క్రీమ్‌ వాడటం మంచిదేనా? తెల్లబడటానికి సైడ్‌ ఎఫెక్ట్స్‌లేని మంచి క్రీమ్స్‌ ఏవైనా ఉంటే చెప్పగలరు. – తేజ, విజయవాడ 
మీ ముఖం రంగు తెల్లబడటానికి మీరు వాడిన కాంబినేషన్‌లో బహుశా మాడిఫైడ్‌ క్లిగ్‌మెన్స్‌ రెజిమెన్‌ ఉండి ఉండవచ్చు. అందులో కార్టికోస్టెరాయిడ్‌ ఉంటుంది. ఇది ఉండటం వల్ల ఆ క్రీమ్‌ను కొన్ని వారాలపాటు వాడినప్పుడు అది మొటిమలు వచ్చేందుకు దోహదం చేసి ఉంటుంది. దీన్ని ‘స్టెరాయిడ్‌ ఇండ్యూస్‌డ్‌ ఆక్నే’ అంటారు. ఇది ముఖంపై అంతటా వ్యాపించి బ్లీచ్‌ చేసిన గుర్తులను ముఖంపై వచ్చేలా చేస్తుంది. కాబట్టి మీరు ఈ క్రీమ్‌ను వాడటం మానేయండి. దీనికి బదులు మీరు ఆర్బ్యుటిన్, లికోరెస్‌ లేదా కోజిక్‌ యాసిడ్‌ ఉన్న క్రీములను వాడండి. అవి నల్లమచ్చలను తొలగిస్తాయి. ఇక మీ మొటిమలు తగ్గడానికి రాత్రివేళల్లో క్లిండమైసిన్, అడాపలీన్‌ కాంబినేషన్‌ ఉన్న క్రీమ్‌ను రాసుకోండి. దాంతో మీ సమస్య తగ్గుతుంది.

చుండ్రు సమస్య బాధిస్తోంది... ఏం చేయాలి? 
నా వయసు 27 ఏళ్లు. చాలారోజులుగా చుండ్రు సమస్యతో బాధపడుతున్నాను. ప్రతి వారం రెండుసార్లు తలస్నానం చేస్తాను. ఈ సమస్య తగ్గడానికి వారానికి మూడు సార్లు గానీ, రోజు విడిచి రోజుగానీ తలస్నానం చేస్తే జుట్టుకు ఏదైనా హాని జరుగుతుందా? దయచేసి వివరించండి. – సాయిప్రసన్న, నిజామాబాద్‌ 
మీరు వివరించిన అంశాలను బట్టి మీరు మాడు మీద సబోరిక్‌ డర్మటైటిస్‌ అనే సమస్యతో బాధపడుతున్నట్లుగా అనిపిస్తుంది. మీ మాడు మీద ఉండే సీబమ్‌ అనే నూనెలాంటి స్రావాన్ని వెలువరించే గ్రంథులు అతిగా పనిచేయడం వల్ల మీరు పేర్కొంటున్న సమస్య వస్తుంది. మీరు జడ్‌పీటీఓ, కెటాకోనజాల్‌ ఉండే షాంపూను వాడండి. మీరు ఈ షాంపూను రోజు విడిచి రోజు వాడవచ్చు. ఇక నోటి ద్వారా తీసుకోవాల్సిన ఐటాకొనజోల్‌ టాబ్లెట్లను ఉదయం రెండు, రాత్రి రెండు చొప్పున రెండు రోజుల పాటు వాడాలి. ఈ మోతాదును స్టాట్‌ డోసిండ్‌ అంటారు. అంటే ఇది మీ సమస్యకు తక్షణం పనిచేసే మోతాదు అన్నమాట. అప్పటికీ సమస్య తగ్గకపోతే నోటి ద్వారా తీసుకునే ఐసోట్రెటినాయిన్‌ అనే మందును వాడవచ్చు.
డాక్టర్‌ స్మిత ఆళ్లగడ్డ
చీఫ్‌ ట్రైకాలజిస్ట్‌ – డర్మటాలజిస్ట్, 
త్వచ స్కిన్‌ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top