ఇవి వండితే బెస్ట్‌... ఇవి వండకపోతే మరింత బెస్ట్‌! 

Due to vegetarianism Diabetes decreases - Sakshi

పచ్చి... పచనం

టొమాటో, క్యారెట్ల లాంటి వెజిటబుల్స్‌ను పచ్చిగా కూడా తినవచ్చు . కానీ పాలకూర, క్యాప్సికమ్‌ వంటి వాటిని వండితేగానీ తినలేం. పచ్చిగా కూడా తినగలిగే వాటిని పచ్చిగా తిన్నా పర్లేదు. కానీ వాటిల్లో కొన్నిటిని వండుకొని తింటే... పచ్చిగా తిన్నప్పటి కంటే ఎక్కువ పోషకాలు దొరుకుతాయంటున్నారు బ్రిటన్‌ పరిశోధకులు. అలాగే వండుకుతినేవి కొన్నింటిని పచ్చిగా తింటే మరింత ప్రయోజనం అంటున్నారు. అలాంటి కొన్నింటిని చూద్దాం. 

వీటిని వండాక తినడం బెస్ట్‌... 
క్యారెట్లూ, టొమాటోలు, క్యాబేజీ వంటివి వండిన తర్వాత తిన్నప్పుడు వాటి నుంచి దొరికే పోషకాలు రెట్టింపు అవుతాయట. ఎందుకలా జరుగుతోందో బ్రిటిష్‌ న్యూట్రిషనిస్టు పరీక్షించి చూశారు. అప్పుడు వారికి తెలిసినదేమిటంటే... టొమాటోల్లో ఉండే లైకోపిన్, క్యారట్లలో ఉండే బీటా కెరోటిన్‌ వాటిని ఉడికించినప్పుడు రెట్టింపవుతోందట. మరి పోషకాలు రెట్టింపు కావడం మంచిదే కదా. అలాగని పచ్చిగా తినగలిగే వాటిని మీరు సరదా తినదలచుకుంటే ఎలాంటి ఆంక్షలూ లేవు. నిరభ్యంతరంగా తినండి. కాకపోతే పరిశోధనల్లో తేలిన విషయం న్యూట్రిషనిస్టులు చెబుతున్నారంతే! 

వీటిని పచ్చిగా కూడా తినవచ్చు... 
సాధారణంగా మనం క్యాప్సికమ్, బ్రకోలి, పాలకూర వంటివి ఉడికించాకే తింటాం కదా. కానీ వాటిని పచ్చిగా తింటేనే మంచి ప్రయోజనం ఉంటుందని బ్రిటన్‌ ఆహార శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  పాలకూరలో ఉండే కెరోటినాయిడ్స్, క్యాప్సికమ్‌లో ఉండే విటమిన్‌ ‘సి’ వాటిని పచ్చిగా తిన్నప్పుడే  ఒంటికి పుష్కలంగా అందుతాయట. కాబట్టి ఆ పోషకాలు కావాలనుకున్నవారూ, ఆరోగ్యస్పృహతో మెలుగుతూ ఇలాంటి సూచనలను పాటించేవారు కావాలనుకుంటే పచ్చిగానూ తినవచ్చు.

డయాబెటిస్‌ ముప్పు తప్పాలంటే శాకాహారం బెస్ట్‌...
పనిలో పనిగా బ్రిటిష్‌ ఆహార పరిశోధకులు మరో విషయాన్నీ చెప్పారు. శాకాహారం వల్ల టైప్‌–2 డయాబెటిస్‌ ముప్పు గణనీయంగా తగ్గుతుందట. పైగా వాటిని  తినాల్సిన పద్ధతిలో తింటే ఆరోగ్యం మరింత చక్కగా ఉంటుందని బ్రిటిష్‌ డైటీషియన్‌ హెలెన్‌ బాండ్‌ పేర్కొన్నారు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top