జైత్రయాత్ర నీ కుటుంబం నుంచే ప్రారంభించు

Dreams of Abdul Kalam - Sakshi

కలాంగారు రాష్ట్రపతి పదవిలో ఉండగా, ఆయన అన్నగార్లు, వాళ్ళపిల్లలు, బంధువులు చాలా మంది రాష్ట్రపతిభవన్‌  చూడడానికి వస్తామని ఉత్తరం రాసారు. బంధువులు కదా, రావద్దని ఎందుకంటారు ! అందర్నీ రమ్మన్నారు.  వారు వచ్చారు. భోజన ఫలహారాలు తీసుకుంటూ .  రెండూమూడురోజులు అక్కడే గడిపి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. వారటు వెళ్ళంగానే కలాంగారు తన కార్యాలయ సిబ్బందిని పిలిచి...‘‘మా బంధువులు అక్కడ విడిదిచేసిన ఫలితంగా భోజనాలకు, బసకు, కరెంటుకు ఇతరత్రా వసతులకు ఖర్చెంతయిందో లెక్కగట్టి చెప్పండి’’అని  అడిగారు. వాళ్ళు సంకోచిస్తుంటే...‘‘ఈ దేశమంతా నా కుటుంబమే. వాళ్ళు కష్టపడి కట్టిన పన్నులను నా బంధువులకోసం ఖర్చు పెట్టలేను’’ అని చెప్పి వారు ఆ బిల్లు ఎంతో చెప్పంగానే  కట్టేసారు.

అదీ వ్యక్తిత్వమంటే. ఆయన అలా బతికిచూపించి ఈ దేశ యువతరం ముఖ్యంగా విద్యార్థులు అంతా అలా బతకాలని కలలు కన్నారు. లతా మంగేష్కర్‌ గొప్ప గాయకురాలు. 30వేల పాటలకు పైగా పాడారు. ఆవిడ పాడని పాటలేదు, ఆలపించని కీర్తనలు, భజనలు లేవు. కానీ ఆమె ఐశ్వర్యవంతురాలిగా పుట్టలేదు. తండ్రి దీనానాథ్‌ మంగేష్కర్‌. ఆమెకు నలుగురు చెల్లెళ్ళు. కుమార్తెలను కూడా తన నాటక కంపెనీలో సభ్యులుగా చేర్పించి  నాటకాలు వేయగా వచ్చిన డబ్బుతో కుటుంబ పోషణ జరిపేవారు. తరువాత కాలంలో ఆమె పాటలుపాడి పేరు, హోదా, డబ్బు బాగా సంపాదించినా తన కుటుంబాన్ని వదలలేదు.అందరినీ వృద్ధిలోకి తెచ్చారు.  ఎంతో ధనాన్ని దానధర్మాలకు వెచ్చించారు. ఆదర్శవంతంగా బతికారు.

ఎం.ఎస్‌. సుబ్బలక్ష్మి ఒక వెలుగు వెలిగిన గొప్ప సంగీత విదుషీమణి. ఆవిడ జీవితం అంతే. అది వడ్డించిన విస్తరేమీ కాదు. మీరాబాయి సినిమాలో ఆమె నటించినప్పుడు కనకవర్షం కురిసింది. అదీగాక దేశవిదేశాల్లో సంగీత కచ్చేరీలద్వారా కూడా సంపాదించారు. ఎన్నో సంస్థలకు లక్షల రూపాయలు ఆర్జించిపెట్టారు. ఎన్నో గుళ్ళూ గోపురాల నిర్మాణాలకు, నిర్వహణకు సాయం అందించారు. ఆస్తులుకూడా అమ్మేసుకున్నారు. ఒక దశలో సొంత ఇల్లు కూడా లేకుండా చేసుకున్నారు. ఆమెకూడా కుటుంబంలో ఒక మంచి సభ్యురాలిగానే జీవితం మొదలుపెట్టి, నలుగురికి ఆదర్శంగా గడిపారు. ఆమె సుబ్బులక్ష్మి...ఆమె మాదన్నారు తమిళులు, ఆమె సుబ్బలక్ష్మి..ఆమె మాది అని దక్షిణాది వాళ్ళంటే, ఉత్తరాదివాళ్ళు ఆమెను శుభలక్ష్మి అని పిలుచుకుని సొంతం చేసుకున్నారు.  

ఆమె శరీరత్యాగం చేసారని తెలిసిన తరువాత మొదటగా పరుగెత్తుకు వెళ్ళిన వ్యక్తి కలాంగారు. ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళి, ఆమె అంత్యక్రియల్లో ముందు నిలబడి కంటనీరు కారుతుండగా ఒక మాటన్నారు...‘‘నాకు ముగ్గురు తల్లులు. ఒకరు జన్మ ఇచ్చిన తల్లి. మరొకరు ఈ దేశమాత. నాకు మూడవ తల్లి సుబ్బలక్ష్మిగారు. నేను ఎవరి కంఠస్వరం వింటే నా కష్టాలన్నింటినీ మర్చిపోతానో, ఆ తల్లిని ఈ వేళ పోగొట్టుకున్నాను.’’ అని ఆవేదన వ్యక్తం చేసారు. మీరు పిల్లలు. ఇటువంటివారిని ఆదర్శంగా పెట్టుకోండి. మీరు ఎంత పెద్దకలలు కన్నా వాటి ఆచరణలో ముందు వీరిలాగా ఒక మంచి కుటుంబ సభ్యునిగా మీ పాత్ర సమర్ధంగా నిర్వహించండి. మిమ్మల్ని చూసి మీ కుటుంబం, మీ ఊరు, మీ రాష్ట్రం, మీ దేశం గర్వపడే విధంగా జీవించండి.

- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top