నూరు యజ్ఞాలు చేసినా దక్కని పుణ్యఫలం అది.. | Devotional information by Chaganti Koteswara Rao | Sakshi
Sakshi News home page

నూరు యజ్ఞాలు చేసినా దక్కని పుణ్యఫలం అది..

Apr 1 2018 1:12 AM | Updated on Apr 1 2018 1:12 AM

Devotional information by Chaganti Koteswara Rao - Sakshi

సీతమ్మతల్లి క్షేమవార్త తెలుసుకోవడానికి స్వామి హనుమ నూరు యోజనాల సముద్రం మీదుగా లంకాపట్టణానికి వెడుతున్నాడు. చూసాడు సముద్రుడు. ఇక్ష్వాకువంశంలో పుట్టిన సగర చక్రవర్తివల్ల సముద్రం వచ్చింది. అదే వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి భార్య అయిన సీతమ్మతల్లి అపహరణకు గురయితే ఆమె జాడ కనిపెట్టడానికి ఆకాశంలో హనుమ వెళ్ళిపోతున్నాడు.

‘‘ఓ మైనాక పర్వతమా! నీవు పైకీ కిందకు పెరగగలవు. పైకి లేచి హనుమకు ఆతిథ్యం ఇవ్వు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయాలి. అటువంటి మహాత్ముడు మళ్ళీ దొరకడు.’’ అని సముద్రుడు అన్నాడు.మైనాకుడికి రెక్కలున్నాయి. పైకిలేస్తే ఇంద్రుడు తెగ్గొట్టేస్తాడు. అయినా రెక్కలు పోతే పోయాయి, అటువంటి మహాత్ముడికి ఆతిథ్యం ఇవ్వాలనుకున్నాడు. బంగారు శిఖరాలతో పైకి లేచాడు. వెళ్ళిపోతున్న హనుమ చూసాడు. సముద్రమధ్యంలోంచి బంగారు శిఖరాలు పైకిరావడమేమిటనుకున్న హనుమ వక్షస్థలంతో కొడితే చూర్ణమయిపోయిందా పర్వతం.

మైనాకుడు వెంటనే మనుష్యరూపాన్ని పొంది..‘‘ఎంతచేతకానివాడయినా అతిథిగా ఇంటికొస్తే భగవంతుడి స్వరూపమని ఆరాధిస్తామే.. నీవంటి మహానుభావుడు ఏ విధమైన స్వార్థబుద్ధి లేకుండా కేవలం రామకార్యం మీద సముద్రం దాటుతున్నప్పుడు ఉపకారం చేయకపోతే ఇంకెందుకు? ఒకప్పుడు ఆపదలో ఉండగా మీ తండ్రిగారయిన వాయుదేవుడు నాకు ఉపకారం చేసాడు. కాబట్టి నీకు ప్రత్యుపకారం చేయాలి. నీవు నాకు అతిథివి. ఒక్కసారి దిగు. కాస్త తేనె తాగు, నాలుగు పళ్ళు తిను. కొద్దిగా విశ్రాంతి తీసుకో. అప్పుడు వెళ్ళు’’ అని వేడుకున్నాడు.

రామచంద్రమూర్తి కోదండం నుండి విడుదలయిన బాణం ఎలా వెడుతుందో అలా వెడుతున్న హనుమ ‘నేను దిగను’ అంటే నొచ్చుకుంటాడని పరమ ప్రేమతో ఒక్కసారి ఇలా ముట్టుకుని ‘నీవు నాకు ఆతిథ్యమిచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే. నేను ప్రతిజ్ఞాబద్ధుడను. సమయం అతిక్రమిస్తోంది. వెళ్ళిపోవాలి.’’ అని చెప్పి నిష్క్రమించాడు. రెక్కలతో లేచిన మైనాకుడిని ఇంద్రుడు చూసాడు. ఇన్నాళ్లకు దొరికాడు. రెక్కలు కత్తిరించేయవచ్చు. కానీ ఆయన అన్నాడు కదా..‘‘రామకార్యం మీద వెడుతున్న హనుమకు ఉపకారం చేయడానికి రెక్కలు పోయినా ఫరవాలేదనుకుని పైకి వచ్చి ఆతిథ్యం ఇస్తానన్నావు. నీకు నేను వరమిస్తున్నా. నీ రెక్కల జోలికి ఇక రాను. సంతోషంగా ఉండు.’’ అన్నాడు.

కార్యం మీద వెడుతున్న అతిథికి పూజ చెయ్యక్కర్లేదు. ఆతిథ్యం ఇవ్వక్కర్లేదు. ఇస్తానని త్రికరణశుద్ధిగా ఓ మాటంటే చాలు. నిజానికి మీరు మీ ఇంట్లో పూజామందిరంలో పూజించే పరమేశ్వరుడు ‘నాకు పరమభక్తుడు రా వాడు. వాడిని ఇంట్లోకి తీసుకురండిరా’ అని ఎదురు చూస్తుంటాడట. అందుకే మహాత్ములయినవారు ఇంటికొచ్చినప్పుడు మొట్టమొదట పూజామందిరం దగ్గరకు తీసుకువెడతారు. లేకపోతే ఆయన నొచ్చుకుంటాడట. వాస్తవానికి ఆయన సర్వాంతర్యామి. ఆయన చూడలేడని కాదు.

కానీ మనకు మర్యాద నేర్పడానికి –లోపలికి తీసుకు వస్తున్నారా లేదా అని అలా తలెత్తి చూస్తుంటాడట,  అతిథి నేరుగా వచ్చి పూజామందిరం దగ్గర నిలబడి నమస్కారం చేస్తే ‘అబ్బ, నన్ను నమ్ముకున్నవాడిని నీ ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, మంచినీళ్ళిచ్చి, ఫలహారంపెట్టి ఆదరబుద్ధితో చూసుకున్నావు. నేను ప్రసన్నుడినయ్యా.’’ అని పరవశించిపోతాట్ట. ఈశ్వరుడు ప్రసన్నుడయితే తీరని కోరిక ఉండదు. నూరు యజ్ఞాలు చేస్తే తప్ప లభించని కామ్యము–భాగవతులయినవారు గడపదాటుకుని ఇంట్లోకి వస్తే లభిస్తుంది.’’


- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement