
ఒక పట్టాన కదల్లేదు!
‘మీరు ప్రయాణించాల్సిన రైలు అనివార్య కారణాల వల్ల రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది..’ అంటూ తర్వాతి స్టేషన్ వాళ్లకు అనౌన్స్‌మెంట్ ఇచ్చి...
‘మీరు ప్రయాణించాల్సిన రైలు అనివార్య కారణాల వల్ల రెండు గంటలు ఆలస్యంగా నడుస్తోంది..’ అంటూ తర్వాతి స్టేషన్ వాళ్లకు అనౌన్స్‌మెంట్ ఇచ్చి... తీరికగా పట్టాల మీద నుంచి ఆవును పక్కకు తప్పించే పనిలో పడ్డారు ఆ స్టేషన్ అధికారులు. ఇంగ్లండ్‌లోని సోమర్సెట్‌లోని ఒక రైల్వేస్టేషన్‌లో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఆ పట్టాలపై రైలు గంటకు 80 మైళ్ల వేగంతో వెళ్లడానికి అవకాశం ఉంది. అయితే స్టేషన్‌లో రైలు ఆగి ఉండగానే ఒక ఆవు పట్టాలపై తచ్చాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో రైలు ముందుకు సాగలేని పరిస్థితి.
ఆ ఆవు పట్టాలు దాటి పక్కకు వెళితేనే రైలుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని స్థానిక అధికారులు నిర్ణయించారు. అయితే అప్పటికే ఆవు బెదిరిపోయి ఉంది. పట్టాల నుంచి పక్కకు వెళ్లడానికి దానికి అవకాశం కూడా లేదు. దాన్ని పక్కకు తప్పించడానికి అధికారులు రంగంలోకి దిగడంతో మొత్తం వ్యవహారం గందరగోళమైంది. ఎట్టకేలకు ఓ రెండుగంటలు గడిచాక ఆవు రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పట్టాలు దిగి పొలాల బాట పట్టింది. రైలు ముందుకు కదిలింది. ఈ రెండు గంటల సమయం వృథా అయినప్పటికీ... ప్రయాణికులు ఆవును ఉద్వేగంతో గమనించారు.
మరికొందరు అక్కడి నుంచే ట్విటర్ అప్‌డేట్స్ ఇవ్వసాగారు. తాము ప్రయాణిస్తున్న రైలుకు ఒక ఆవు అడ్డంకిగా మారిందని రన్నింగ్ కామెంటరీ చెప్పసాగారు. అయితే ఒక్కసారి రైలు కదిలి... వేగం పుంజుకున్న తర్వాత ఆవును గమనించి ఉంటే చేయగలిగిందేమీ ఉండేది కాదనీ... ఆవును ముందుగానే గమనించడంతో రెండు గంటల సేపు సమయం వృథా అయినా... దాని ప్రాణాలను కాపాడగలిగామని రైల్వే అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.