విజయ ముహూర్తం

Biography Of Adi Shankaracharya In Funday On 22/12/2019 - Sakshi

నేతి సూర్యనారాయణ శర్మ

ఆదిశంకరాచార్యుల జీవితచరిత్ర

నిరృతి అనే అరూపలక్ష్మికి పుట్టినవాడు మన్మథుడు. రూపంలేని తల్లికి పుట్టినందువల్ల అనంగుడయ్యాడు. నాలుకే లేని అతడు పంచదశీ మంత్రాన్ని బయటకు చెప్పగలిగాడు. దానితో వేళ్లుమొలిచాయి. శ్రీవిద్యామణిని మెడలో ధరించిన ఫలం అతణ్ణి సర్వవ్యాపిని చేసింది. మన్మథుడు దర్శించిన శ్రీవిద్యలో  కామకళ, శివకళ, శక్తికళ, రతికళ, శ్రీకళ అనే అయిదు భేదాలున్నాయి. దీనిని కాదివిద్య అంటారు. ఇందులో యమనియమాలు లేవు.
నియమాలు లేకపోవడమే సాకుగా తీసుకుని కొందరు ఆ విద్యలో తామసిక విధానాలను ప్రవేశపెట్టారు. ఇంటికి శ్మశానానికి, గంధానికి బురదకు తేడా పాటించని కొందరు వామాచారాన్ని భ్రష్టు పట్టించసాగారు. వారి సంఖ్య  శంకరుని కాలానికే అపారంగా పెరిగిపోయింది. శంకరుడు వామాచారాన్ని ఖండించలేదు. వారు పాటించే విధానాలు మాత్రమే తగవన్నాడు. తామసిక విధానాల స్థానంలో సాత్త్విక ఉపాయాలను శాక్తేయంలో ప్రవేశపెట్టాడు. ఆ మహత్కార్యానికి బీజం వేసిన కారుణ్యమూర్తి ఉభయ భారతి.
‘ఖండద్వయయుతా చతుర్థస్వర విశిష్టా కామకళా’ అనే గౌడపాద సూత్రవాక్యం వద్ద ప్రస్తుతం ఉభయభారతి – శంకరుల సంవాదం ఆగింది. ‘‘ఖండద్వయమంటే ఏమిటి? రెండుగా విడిపోయింది ఏమిటి?’’ తరువాతి ప్రశ్న సంధించిందామె. 
‘‘శివుడు – శక్తి’’ సమాధానమిచ్చాడు శంకరుడు.
‘‘మరి చతుర్థ స్వరమంటే రతికళ కావచ్చునా?’’ ప్రశ్నించింది ఉభయ భారతి.
‘‘స్వరము – కళ ఒక్కటి కావు కదా’’ తోసిపుచ్చాడు శంకరుడు.
‘‘సరిగమపధని అనే సప్తస్వరాలలో మకారమే చతుర్థస్వర విశిష్టా కళ అవుతుందా?’’
‘‘కొంతవరకూ అంగీకరించవచ్చు కానీ’’ అని మెలిక పెట్టాడు శంకరుడు.  ‘‘రాగ శ్రుతులు ఏర్పడే సందర్భంలో తొలి అయిదు స్వరాలనూ షడ్జమమనే చెబుతారు. కాబట్టి చతుర్థస్వరం స అని వాదిస్తే ఏం చేస్తారు?’’ అని నవ్వాడు.
ఉభయభారతి కొంచెం తికమక పడినట్లు కనిపించింది కానీ, వెంటనే సర్దుకుంది. ‘‘ఇక్కడ చెబుతున్నది కామకళను గురించే కానీ, సామకళను గురించి కాదు’’ అన్నది.
శంకరుడు నవ్వి ఊరుకున్నాడు. 
‘‘అచ్చులు, హల్లులుగా సాగిపోయిన సృష్టిలో క నుంచి భ వరకు దేహం. మ ఆత్మ. తత్తిమ్మావి ఇంద్రియాలు. దేహ ఇంద్రియ వ్యాపారమే కామకళ. ఇంతకూ ఆ చతుర్థ స్వరం ఏమై ఉంటుంది?’’ విడిచిపెట్టకుండా మళ్లీ ప్రశ్నించింది ఉభయభారతి.
‘‘శ్రీవిద్యలో చెప్పిన కామకళకు, మీరు చెపుతున్న దేహేంద్రియ వ్యాపారమైన కామకళకు కొంచెం కూడా పోలిక లేనే లేదు’’ అన్నాడు శంకరుడు.
‘‘ఒకపక్క కామదేవుడైన మన్మథుడు చెప్పాడంటున్నారు. విద్యకు పరాకాష్ఠగా ఒక స్త్రీరూపాన్ని నిలిపారు. అయినప్పటికీ శృంగార ‡శాస్త్రంతో సంబంధం లేదంటున్నారు. మీ వాదన వినడానికి చాలా విచిత్రంగా ఉంది’’ మూసిన పిడికిలిపై చెంపను చేర్చింది ఉభయ భారతి.
శంకరుడు వాదాన్ని మరోమలుపు తిప్పాడు. ‘‘కకార స్వరూపుడైన హిరణ్యగర్భుడు కమనీయమైన సృష్టిని కడుపారా మోసి కన్నాడు. అతడు వాణినుంచి మాటసాయాన్ని మాత్రమే తీసుకున్నాడు. రతి అవసరం లేకుండానే అతడికి నలుగురు మనువులు పుట్టారు. ఓంకారమనే శబ్దము, మార్పుభావమైన కాలము, విభాగ భావమైన దిక్కు, కణభావమైన దిక్కులే ఆ మనువులు. వారి నుంచి స్వాయంభువ మనువు పుట్టాడు. అతడికి ఒంటరితనాన్ని తట్టుకోవడం కష్టమనిపించింది. వెంటనే తన శరీరాన్ని రెండు పప్పుబద్దల్లా సమభాగాలు చేసి నేలకు పడదోసుకున్నాడు. ఆ రెండు శరీరాలూ పతి, పత్ని భావాలు పొందాయి. అతడి కామవర్తనం భార్య అయిన శతరూపకు తప్పుగా తోచింది. గోవుగా తన రూపం మార్చుకుని అతణ్ణి విడిచి పారిపోయింది. శతరూప తన రూపాలు మార్చుకున్నప్పుడల్లా ప్రజాపతి ఆమెను వెంటాడాడు. అలా పిపీలికం వరకూ జీవులన్నింటిలోనూ సృష్టికార్యం కొనసాగుతూనే . శరీరాన్ని ఆశ్రయించినట్లయితే కామానికి తుదిలేదు’’ అన్నాడు శంకరుడు.
‘‘ఎందుకు లేదు? ధర్మానికి శరీరమే ఆలంబనం కదా! లలితా సహస్రనామ స్తోత్రం కూడా అమ్మను త్రికూట స్వరూపిణిగా వర్ణించింది. అమ్మవారి ముఖమండలాన్ని వాగ్భవ కూటమి అంటారు. ఇదే జ్ఞానశరీరం. కంఠం నుంచి కటివరకు ఉపాసనా శరీరం లేదా కామరాజ కూటమి. నడుము నుంచి పాదాల వరకూ గల విభాగానికి కర్మశరీరం లేదా శక్తి కూటమి అని పేరు. కామరాజ కూటమిలోనే కామకళ కూడా ఉదయించిందని చెప్పుకోవచ్చు కదా!’’ శంకరుని ఉపనిషత్‌ వేదాంతాన్ని వ్యతిరేకించింది ఉభయ భారతి.
‘‘కామకళా స్థానం ఆ మూడు కూటములలోనూ లేదు’’ అన్నాడు శంకరుడు. ‘‘ఆజ్ఞాచక్రం నుంచి బ్రహ్మరంధ్రం వరకూ ఉన్నది తురీయ కూటమి. శివశక్త్యాత్మకమైన ఈ స్థానం ఆత్మరూపమైనది కనుకనూ ఆత్మకాములైన వారు కోరుకునేది కనుకనూ దీనిని కామకళ అంటారు. అది సాక్షిమాత్రంగానే ఉంటుంది. దీనికి ప్రతీక అమ్మ ఫాలభాగాన మెరిసే అష్టమీ చంద్రకళ’’ అని సమాధానమిచ్చాడు. 
‘‘చంద్రునిలో కాంతికిరణాలే కానీ, స్వరాలు వినిపిస్తాయని ఎక్కడా వినలేదు’’ కొట్టిపారేసింది ఉభయ భారతి.
‘‘తురీయ కూటమిలోని ఆత్మస్వరూపం గుణభేదాలను బట్టి ఎనిమిది పేర్లతో పిలువబడ్డది. ఆ వరుసలో నాలుగోది శబ్దాత్మ. శబ్దం స్వరయుతమే కదా!’’ అతికినట్లు సరిపోయేలా పలికాడు శంకరుడు.
‘‘అయితే ఆ శబ్దం వినేందుకు తగిన సాధనమేది?’’ 
‘‘ఆకాశతత్త్వానికి నిలయమై కంఠంలో ఉన్న విశుద్ధి చక్రాన్ని పీఠంగా భావించాలి. సహస్రారం బిందువు అవుతుంది. ఈ విధంగా అమ్మను అర్చిస్తే జ్ఞానామృతం వర్షిస్తుందని...  సుభగోదయ స్తుతి చెబుతోంది.’’ 
‘‘బాగున్నది. మీరు ఆశ్రయించే సహస్రారానికి నోరులేదు. అది విశుద్ధి నుంచే శబ్దాలను వెలువరించాలి. ఏ మానవుడైనా అంతరంగం ద్వారా వినగలిగినదంతా నోటి మాటగా ఏ భాషలో అయినా చెప్పగలిగినట్లు ఎక్కడైనా రుజువు ఉందా? బుద్ధి కల్పించే ఈ వడబోత సిసలైన ఆత్మజ్ఞానాన్ని మరుగు పరచదా? చిత్త విపర్యయాన్ని కల్పించదా?’’ ఉభయ భారతి కంఠంలో  ఒకింత విసుగుదల ధ్వనిస్తోంది. 
శంకరుడు తొలిసారిగా వెనక్కు తగ్గి మౌనం వహించాడు.
‘‘ఆత్మ పరమాత్మతో రమించడమే భోగం. అది ఊర్థ్వముఖాన చరిస్తే యోగమవుతుంది. అధోముఖంగా విస్తరించినప్పుడు మానవులకు అనుభవ సిద్ధమై కామభోగం అవుతుంది. భోగతృప్తి కలిగిన తరువాత కలిగే వైరాగ్యమే ఎవరినైనా ఉద్ధరిస్తుంది. అసలిందుకే ఆశ్రమ ధర్మాలు ఏర్పడగా మీరు బ్రహ్మచర్యం నుంచి నేరుగా సన్యాసంలోకి కప్పదాటు ఎందుకు వేసినట్లు?’’ సూటిగా ప్రశ్నించింది ఉభయ భారతి.
శంకరుడు బదులు చెప్పలేదు. 
‘‘జగన్మాతృక సృష్టిలో ఉచ్చ, నీచ భాగాలంటూ ఉన్నాయా?’’ ఉభయ భారతి గద్దించింది.
‘‘లేనే లేవు’’ శంకరుడు లోగొంతుతో పలికాడు.
‘‘మరి యోగమార్గంలో ఉన్నవారు ఊర్ధ్వరేతస్కులై తురీయకూటమిలో పొందుతున్న రసానందం ఏ ఇంద్రియ శక్తి సంకేతం?’’ చేత బెత్తం పుచ్చుకున్న తల్లి పిల్లవాణ్ణి అదిలించినట్లు శంకరుణ్ణి ఉభయ భారతి అదిలించింది.
తన అల్లరి తల్లికి తెలిసినప్పటి పిల్లవాడిలా ఒక్కొక్క మాటనూ తడుముకుంటున్నట్లుగా నటిస్తూ శంకరుడు ఆ ప్రశ్నకు సమాధానమిచ్చాడు. ‘‘జగత్పస్రూతిక హకారం, మాహేశ్వర శక్తిరూపం ఈకారం, అగ్నికళా రూపమైన వకారం. హ్వీధాతు స్వరూపం. అది జిహ్వేంద్రియ శక్తి. అగ్నికళా సమన్వితం’’ అన్నాడు
‘‘అగ్నిలోని సప్తమ జిహ్వ తురీయకూటమిలో ఏ వర్ణంలో ఉంటుంది?!’’
‘‘చిత్రవర్ణం’’ శంకరుని నోటివెంట వర్ణస్వరూపం వెలువడగానే  ఉభయభారతి వదనం విద్యుత్‌ కాంతులతో ప్రకాశించడం ప్రారంభించింది. 
‘‘ఆ చిత్రవర్ణ బీజమేది? దానికి మూలరూపమేది?!’’ ప్రశ్న వెంట ప్రశ్న సంధిస్తూనే ఉంది ఉభయ భారతి.
శంకరుడు జాగు చేస్తున్నాడు. నేత్రద్వయం రక్తకాంతులు చిమ్ముతుండగా ఉభయభారతి గళం నుంచి ‘‘ఏం భయమా?’’ అన్నమాట ఒక్కసారిగా ఉరుములా ధ్వనించింది.  
‘‘అమ్మ సన్నిధిలోనా?’’ అని నిటారుగా కూర్చున్నాడు శంకరుడు.
‘‘చెప్పవేం మరి?’’ ఉభయభారతి కళ్లు మెరుపుకళలు విరజిమ్ముతున్నాయి.
‘‘తురీయకూటమిలో అమ్మరూపం... స్త్రీం బీజానికి మూలరూపమైన సకారం’’ అని సమాధానం చెప్పాడు శంకరుడు.
మహావేగంతో వచ్చి ఢీకొన్న రెండు మబ్బులను చెల్లాచెదురు చేస్తూ పుట్టిన మెరుపు కాంతి ఆ మబ్బుల మాటునున్న మరో ఆకాశాన్ని కన్నుల ముందు నిలిపింది. ఉభయ భారతి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. నభోమండల పరివ్యాప్తమై నీలిమతో నిండిపోయిన ఆమె దేహం తేరిపార చూడడానికి కూడా శక్యం కాకుండా ఉంది. అకార, ఉకార, మకార, నాద, బిందువులతో పాటు శక్తి, శాంతాలనే ఏడుకళలతోనూ మెడలో కపాలమాలతోనూ నెత్తురోడుతున్న కత్తిని ఒక చేత, తెగిన తలను మరోచేత పట్టుకుని, పద్మాలను ధరించిన మరో రెండు చేతులతోనూ అవతరించిన ఆ నీలసరస్వతీ మహారూపం భీతిగొలిపేలా ఉంది. 
లోకాలు, కులపర్వతాలు, ద్వీపాలు, సింధువులతో పాటు మునులు... వారు దర్శించిన ధాతువులు, స్వరాలు అన్నింటినీ కన్నతల్లిగా ఆమె ఇప్పుడామె దర్శనమిస్తోంది. ఆ మహావిద్యా స్వరూపం ముందు శంకరుడు రెండు చేతులూ జోడించాడు. ‘‘అమ్మా! ఇకమీదట నీ ప్రస్థానాన్ని నిలువరించే శక్తి నాలో లేదు. కానీ నా పరమార్థం నెరవేరేదాకా విడిచిపెట్టను. మాతృకా వర్ణాలలో జగన్మాత కాలిపిక్కలకు సంకేతమైన ట, త బీజశక్తులను నీకు పీఠంగా సమకూర్చి మళ్లీ ఇక్కడకు ఆవాహన చేస్తున్నాను’’ అన్నాడు శంకరుడు.
చూస్తున్నంతలోనే ఉభయ భారతి చిరునవ్వులు చిందిస్తూ మునుపటి స్థితికి వచ్చింది. 
‘‘శంకరా! ఇప్పుడు చెప్పు. రుద్రకళగా నీవు అభివర్ణించిన తిథిని తారామహాదేవి ఎలా విభజించింది?’’
‘‘శుక్ల, కృష్ణ పక్షాలనే రెండు ఖండాలుగా.’’
‘‘ఆ రెండింటిలో ఏ పగళ్లు గొప్పవి? ఏ రాత్రులు శ్రేష్ఠమైనవి?!’’
‘‘రెండూ శ్రేష్ఠమైనవే. ఆ విద్యలోని రాత్రులు మధువును సంపాదిస్తాయి. పగళ్లు దానిని వర్షిస్తాయి.’’
‘‘అయితే ఆ మధువును తాగుతూ మత్తెక్కిపోతూ ఉండడమేనా యోగ పరమార్థం?’’ అని ప్రశ్నించిందామె. కదులుతూ ఉన్న ఆమె చెవి లోలాకులే కాదని సమాధాన మిస్తున్నాయి. అదే శంకరుని నోట కూడా పలికింది.
‘‘కాదు. మధువిద్యకు స్త్రీరూపం అదితి. ఆమె దేవతాశక్తులన్నింటినీ కన్నతల్లి. మధుకశ అంటే ఆమె ఝళిపించిన కొరడాయే కుండలిని. ఆ కొరడా ఝళిపింపులోని భ్రామరీనాదాన్ని వినడమే యోగవిద్యకు పరాకాష్ఠ.’’
‘‘మధువిద్య భ్రామరమైనప్పుడు కశ్యప ప్రజాపతి ఏం చేస్తుంటాడు?’’
‘‘ఏమీ చేయడు. పూర్ణవికసిత వదనుడై ఆమెనే తిలకిస్తుంటాడు. ఆమె పలుకులనే వింటుంటాడు.’’
‘‘ఆనందకంద మనిమేష మనంగతంత్రం... అని ఎనిమిదో ఏటనే నీవు పలికిన దివ్యశృంగార లీలలాగానా?’’ అనునయంగా అడిగింది ఉభయ భారతి.
శంకరుడు కన్నులు రెండూ పక్కకు తిప్పుకున్నాడు. 
‘‘చూశావా? ఎనిమిదేళ్ల బాలునిగా ఉన్నప్పుడు... కనుకొలకుల దాకా విస్తరించి విప్పార్చిన దేహంతో అమ్మ మగణ్ణి చూసిందని వర్ణించావు. ఆమె చర్య ముకుందునికి ముదాన్ని కలిగించి ఆమీలితాక్షుణ్ణి చేసిందన్నావు. పదహారేళ్ల లేత యవ్వనంలో  పక్కకు తిరిగి పోతున్నావు. అగ్నిలోనూ, సూర్యునిలోనూ తదేక దృష్టిని నిలిపి నీవు చేసిన త్రాటకాభ్యాసం వల్ల ఆనాడు నింగిలో కనిపించిన మెరుపు నిన్ను కవిని చేసింది. ఈనాడు కనిపిస్తున్న కాంతి చిత్తవికల్పాన్ని కలిగిస్తున్నట్టుంది. రేపు నీ తపశ్శక్తికి మెచ్చి ఇంతకంటే లోకోత్తర సౌందర్యం దర్శనమిస్తే ఏం చేస్తావు? మనసు చూపెట్టలేని, పలుకు వర్ణించగాలేని దివ్యశృంగార లీలలు ద్యోతకమైతే ఏమైపోతావు?’’ ఉభయ భారతి తన మాటల్లో పరిహాస ఛాయలేవీ రానీయలేదు. 
‘‘శంకరా! ఇది తెలుసుకో. శుక్ల, కృష్ణపక్ష తిథులలో పెరిగి తరిగే చంద్రకళలు యువతీ యువకుల మనస్సులపై ఎలాంటి ప్రభావాలు చూపిస్తాయి? కామకళ శ్రీకళాసిద్ధిగా ఎప్పుడు పరిణామం చెందుతుంది? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి’’
శంకరుడామె మాటకు అవుననలేదు. కాదనలేదు. కానీ ఇది సన్యాసికి తగిన పనేనా? అన్న గుసగుసలు మాత్రం సభలో అక్కడక్కడా వినిపించాయి.
‘‘ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని వాదప్రతిజ్ఞ చేశావు. నీవంటివాడి నోటివెంట పరిహాసానికైనా అటువంటి అశుభ వాక్యం రావచ్చునా?! ఆ మాట పలికినందుకైనా ఈ ప్రశ్నకు సమాధానం నీకు తెలుసుకోక తప్పదు’’ తీర్మానించింది ఉభయ భారతి.
‘‘నువ్వు తప్పదంటే ప్రయత్నిస్తాను’’ అన్నాడు శంకరుడు. 
‘‘మంచిది. భోగవైరాగ్యం నీకు జన్మసిద్ధమని నిరూపించుకుంటావో... ఆశ్రమ ధర్మానికి విరుద్ధమైనా భోగతృప్తిని పొంది విరాగివి అవుతావో... ఏ పని చేసినా జాగ్రత్తగా చేయి. వచ్చే భాద్రపద శుద్ధ చవితి నాటికి మళ్లీ కాశ్మీరంలోని సర్వజ్ఞపీఠంలో కలుసుకుందాం. అక్కడ ఎదురయ్యే ప్రశ్నలకు కూడా సమంజసమైన సమాధానాలతో మెప్పించ గలిగితే భరతఖండమంతా నీకు దాసోహమంటుంది’’ అన్నది ఉభయ భారతి చర్చకు ముగింపు పలుకుతూ.
అప్పటికి సాయం సంధ్య అవుతోంది. మలిసంజె మాడిపోతున్న మన్మథుడి శరీరంలా ఉంది. ఆకాశంలో తూరుపింట ఆదిదంపతుల మిథున లగ్నం ఉదయిస్తుంటే, పడమటి కొసమీద మన్మథస్థానమైన ధనుర్లగ్నం అస్తమిస్తోంది. ఆనాడు ఆషాఢ గుప్తనవరాత్రాలలోని విజయ దశమి. 
ఉభయ భారతి లోనికి వెళ్లిపోయింది. వెళ్లిపోతున్న శంకరుణ్ణే వెనక్కివెనక్కి తిరిగి చూస్తూ మండన మిశ్రుడు భార్యను అనుసరించాడు. వాకిట శంకరుణ్ణి కాళిదాసు నిలువరించాడు.
‘‘శంకరాచార్యా! ఇంతకూ చతుర్థ స్వరం ఏదంటారు?’’ అని ప్రశ్నించాడు.
‘‘అనాహతంలో పుట్టే మధ్యమం. విష్ణుస్థానం’’ అని జవాబిచ్చాడు శంకరుడు.
‘‘అయితే రుద్రస్థానమైన విశుద్ధి, విష్ణుస్థానమైన అనాహతానికి మధ్య మగమ ఉంటే మణిపూరంలో దేవి పదిచేతులతో ఎందుకు ఉదయిస్తుంది? రొమ్ముపాలు కుడిచిన తొలినాడే కామమోహాలకు బద్ధుడైపోయిన నిషాదుడు ఒకడు దేవి కన్నులు కప్పి ఎటునుంచి బాణం వేస్తే మగపక్షి నేల కూలింది. కలి త్రేతాయుగాల మధ్య దూరమెంత? నేలకు అవతరించిన పూర్ణమానవుడు ఏకపత్నీ వ్రతాన్ని ఆదర్శంగా ఎందుకు చెప్పాడు? అన్నట్లు ఇందాకటి కథలో శతరూప ఏమైపోయింది? కొంపదీసి స్వాయంభువ మనువు సన్యాసం తీసుకున్నాడా? ప్రజాపతి కామజయాన్ని పొందాడా?’’ కాళిదాసు హుందా అయిన పెద్దరికంతో శంకరునికి ప్రశ్నలరూపంలో మార్మికంగా సందేశమిస్తున్నాడు.
సమాధానం ఆశించని అతడి మాటలకు శంకరుడు తలపంకించాడు. – సశేషం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top