చే గువేరా.. రావాలా? | Sakshi
Sakshi News home page

చే గువేరా.. రావాలా?

Published Sat, Apr 5 2014 1:26 AM

చే గువేరా.. రావాలా? - Sakshi

నయా సీన్: ‘‘అదేంటిసార్... ఇలా చేశారు. పొద్దస్తమానం అటు చేగువేరానూ, ఇటు కొమరం భీమ్‌నూ తలచుకుని, తలచుకుని, కొమరం భీం పేరును కొందరే పేటెంటు చేసుకుని వాళ్ల టెంట్లో ఉంచుకున్నారని కుమిలి కుమిలి, మళ్లీ ఇలా వాళ్ల సిద్ధాంతాలకు పూర్తిగా  వ్యతిరేకులైన బాబూ, మోడీలను సమర్థించారేంటిసార్?’’ ‘‘ఒరే బాలూ... నేను మొదట్నుంచీ ఇంతేరా! బాబూ, మోడీల రూటే. కాకపోతే వాళ్లు గడ్డం చేసుకోరూ, నేను చేసుకుంటానంతే తేడా!’’  ‘‘అదేంట్సార్... ఎక్కడైనా పవనం అంటే అది మొదట నైరుతీ నుంచి వీచాలి. ఆ తర్వాత ఈశాన్యం నుంచి వీచాలి. భారత్‌కు వర్షాలనిచ్చే మంచి పవనాలు అవే సార్. అలాంటిది మీరు వాయవ్యం నుంచి గుజరాత్ మీదుగా వీచాలంటున్నారు. మీకో  విషయం తెలుసా? భారత్‌లో అలా వీచే పవనాలూ ఉన్నాయి. ఆ వాయవ్యపవనాలను ‘లూ’ అంటారు సార్. అవి వాయవ్య భారతదేశంలో వీస్తూ జనాలకంతా పరమ ఉబ్బరింత కలిగించే భరించలేనంత వేడి వేడి పవనాలు సార్. పోయి పోయి మీరూ జనాల్ని మతం పేరిట వందలాది మందిని ఊచకోత కోసిన భారత వాయవ్య గుజరాతీ పవనాన్నే ఆశ్రయించారు. ఆ పవన ధర్మం, మీ పేరిట ప్రవచించిన పవన  ధర్మం ఒకేలా ఉన్నాయేంటి సార్?’’


 ‘‘ఒరే బాలూ... నేనేమైనా పవనం ఎలా వీచాలంటూ ఓ పుస్తకం రాశానట్రా? గాలివాటుగా పోవడమే ‘పవన’ ధర్మం. కాబట్టి అలా చెప్పా. పవన ధర్మాలంటూ చెప్పి చిర్రాక్కు కిర్రాక్కు పుట్టించకు. ఎందుకంటే నాకు ధర్మాలు నచ్చవ్. నాకు నచ్చేదల్లా ‘ఇజం’ అంతే! ’’
 ‘‘సరే... ధర్మం మాట వదిలేద్దాం. మరి ‘ఇజమ్’ అని పుస్తకం రాశారు కద సార్. అలా రాశాక ఇజమ్ పై అవగాహన ఉండాలి కదా. చేగువేరాకూ, బాబుకూ, మోడీకీ సాపత్యమేంట్సార్?’’  ‘‘చేగువేరాలాగే వాళ్లిద్దరికీ గడ్డం ఉంది చూడు. ఒకేలాంటి ఫ్యాషన్ అనుసరించడం కూడా ఒక ఇజమే కదరా బాలూ!’’  ‘‘ఇజానికి మీరిచ్చిన నిర్వచనం గమ్మత్తుగా ఉంది సార్. కానీ మీ సినిమా విలన్ సిద్ధప్పది చిత్తూరు కదా! అలాగే మీ రాజకీయాల్లోనూ చిత్తూరు బాస్‌ను చిత్తు చేస్తారనుకుంటే నెత్తినెక్కించుకున్నారు కదా సార్. అదేంటో మీరన్నీ ఎప్పుడూ పరస్పర విరుద్ధమైనవి చేస్తూ ఉంటా రు. అదేమిటంటే మీ తిక్కకో లెక్కుందంటారు’’


 ‘‘రివర్సులో ఏం చేశాన్రా బాలూ?’’
 ‘‘నిజాయితీపరులనే కావాలంటారు. కానీ ఏలేరు స్కాములూ, ఎయిర్‌పోర్టు, ఎమ్మార్‌లకు భూములూ ఉంటూ అవినీతికి పాల్పడ్డవారికి వత్తాసులిస్తారు. చేగువేరా, కొమురంభీమ్‌లంటారు. కానీ విప్లవమూర్తులుగా రగిలిపోయే వాళ్ల సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరించే ఫాసిస్టులకు వెన్నుదన్నవుతారు. పార్టీ పెడతానంటారు. పోటీ పెట్టనంటారు. ఇవన్నీ చూస్తుంటే ఒకటనిపిస్తోంది సార్’’
 ‘‘ఏవనిపిస్తోందిరా బాలూ?’’
 ‘‘మీకు తిక్క ఉంది. కానీ మీ తిక్కకు లెక్కలేద్సార్! మీకోసం సాక్షాత్తూ ఇక చేగువేరాయే దిగిరావాల్సార్’’
 ‘‘ఎందుకురా బాలూ... తన ఇజాన్ని నాకు అర్థమయ్యేలా బోధించడానికా?’’
 ‘‘కాద్సార్. చేగువేరా డాక్టర్ కదా! మీ తిక్కకు వైద్యం చేయాలంటే డాక్టర్ అవసరం కదా. సాక్షాత్తూ  చేగువేరాయే స్వయంగా వచ్చి వైద్యం చేస్తే పవన కళ్యాణం ఎలా ఉన్నా లోకకళ్యాణం మాత్రం ఖాయం సార్’’
 ‘‘లాస్ట్ పంచ్ మనదైతే ఆ మజాయే వేరు. కానీ ఇక్కడది నీదయ్యిందేమిట్రా బాలూ!’’

Advertisement
 
Advertisement
 
Advertisement