
‘అరుణ’మ్మదే.. పైచేయి
నామినేషన్ల దాఖలుకు మరో 48 గంటల సమయం మాత్రమే ఉండటంతో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అసెం బ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్, నామినేషన్ల దాఖలుకు మరో 48 గంటల సమయం మాత్రమే ఉండటంతో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అసెం బ్లీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. తమ మద్దతుదారులకు టికె ట్లు ఇప్పించుకునేందుకు కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ పార్టీ అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం పరిధిలో తాను సూచించిన వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలంటూ ఎంపీ అభ్యర్థి జైపాల్‌రెడ్డి తీవ్ర ప్రయత్నం చేశారు.
మరోవైపు తన మద్దతుదారులకు చోటు కల్పించాల్సిందేనంటూ డీకే అరుణ లాబీయింగ్ జరిపారు. ఆమె మద్దతుదారుల పేర్లు జాబితాలో చోటు చేసుకోవడంతో జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆమె పైచేయి సాధించినట్లు కనిపిస్తోంది. మరోవైపు తాను సూచించిన అభ్యర్థులకు టికెట్లు దక్కక పోవడంతో జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు రోజులుగా జైపాల్‌రెడ్డి పార్టీ నేతలకు కూడా అందుబాటులో లేరనే ప్రచారం స్థానికంగా జరుగుతోంది. ఆయన రాకతో మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ కోల్పోయిన మాజీ ఎంపీ విఠల్‌రావు ఎట్టకేలకు తాను కోరుకున్న కొడంగల్ అసెంబ్లీ స్థానం నుంచి అవకాశం దక్కించుకున్నారు. టికెట్ల కేటాయింపులో న్యాయం జరగలేదంటూ కొందరు నేతలు సొంత అవకాశాలు వెతుక్కుంటున్నారు. మరికొందరు పార్టీని వీడేందుకు సన్నద్ధమవుతుండగా, ఇంకొందరు పార్టీలోనే ఉంటూ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకోవాలనే యోచనలో ఉన్నారు.
మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానం నుంచి డీసీసీ అధ్యక్షుడు కొత్వాల్, మాజీ డీసీసీ అధ్యక్షుడు ముత్యాల ప్రకాశ్, ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి టికెట్ ఆశించారు. టీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడిన సయ్యద్ ఇబ్రహీం కూడా కాంగ్రెస్‌లో చేరడంతో టికెట్ కోసం పోటీ పెరిగింది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ కాంగ్రెస్ నేతలు ఏకంగా తీర్మానం చేసి పార్టీ అధిష్టానానికి అందజేశారు. ఒబేదుల్లా కొత్వాల్‌కు టికెట్ దక్కడంతో ఇబ్రహీం స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశముందని అంచనా.
కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి టికెట్‌ను ఆశించగా మాజీ ఎంపీ విఠల్‌రావుకు దక్కింది. నారాయణపేట నుంచి విఠల్‌రావుకు టికెట్ ఇవ్వాలని జైపాల్‌రెడ్డి ప్రతిపాదించినా ప్రయత్నం ఫలించలేదు. పార్టీ తీరుతో ఆగ్రహంతో వున్న గుర్నాథ్‌రెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం రాత్రి కేసీఆర్‌తో భేటీకి సిద్దమైనట్లు విశ్వసనీయ సమాచారం.
నారాయణపేట నుంచి ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి, టీజేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి టికెట్ ఆశించారు.
రాజేందర్‌రెడ్డి తన ఉద్యోగానికి ఇటీవలే రాజీనామా చేసినా కాంగ్రెస్ పట్టించుకోక పోవడంతో మహబూబ్‌నగర్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ రెవెన్యూ భవన్‌లో టీజేఏసీ జిల్లా సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎంపీ జైపాల్‌రెడ్డి, దివంగత చిట్టం నర్సిరెడ్డితో సాన్నిహిత్యం వున్న బంగారు నగల వ్యాపారి వామనగిరి కృష్ణను మధ్యేమార్గంగా ఎంపిక చేశారు.
దేవరకద్ర నుంచి అమ్మాపూర్ సంస్థానం వారసుడు శ్రీరాం భూపాల్‌ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇప్పించేందుకు జైపాల్‌రెడ్డి చేసిన ప్రయత్నాలకు గండి పడింది. డీకే అరుణ తన మద్దతుదారుడు డోకూరు పవన్‌కుమార్ రెడ్డికి టికెట్ దక్కేలా తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు.కొల్లాపూర్ నుంచి 2012 ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన విష్ణువర్దన్ రెడ్డి మరోమారు నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సుమారు పదిహేను రోజుల క్రితం పార్టీలో చేరిన హర్షవర్దన్‌రెడ్డి పేరు జాబితాలో ఉండటంతో విష్ణు ఖంగు తిన్నారు.
మక్తల్‌లో డీకే అరుణ సోదరుడు, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్థానంలో మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చినా ప్రయత్నం ఫలించలేదు.షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డికి మరోమారు అవకాశం కల్పించారు. బీసీ కార్డు పనికొస్తుందని వీర్లపల్లి శంకర్ భావించినా ప్రయోజనం దక్కలేదు.జడ్చర్లలో జైపాల్‌రెడ్డి ఆశీస్సులతో మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి ప్రయత్నించినా మల్లు రవికి మరోమారు అవకాశం దక్కింది. కల్వకుర్తిలో తన సోదరుడు రాంరెడ్డి పేరును జైపాల్‌రెడ్డి ప్రతిపాదించినా, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా వంశీచంద్ రెడ్డికి టికెట్ కేటాయించారు.
నాగర్‌కర్నూలు నుంచి పీసీసీ అధికార ప్రతినిధి దిలీపాచారి గంపెడాశలు పెట్టుకున్నా దామోదర్‌రెడ్డికి మరోమారు టికెట్ దక్కింది. గద్వాల నుంచి మాజీ మంత్రి డీకే అరుణ, వనపర్తి నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డి, అచ్చంపేట ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఎలాంటి పోటీ లేకుండానే టికెట్ దక్కించుకున్నారు. ఆలంపూర్ రిజర్వుడు స్థానం నుంచి సంపత్‌కుమార్, రజనీరెడ్డి ప్రయత్నించారు. మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రాంరెడ్డి సంపత్‌కుమార్ వైపు మొగ్గు చూపారు.