‘దేశం’ దెబ్బకు కాంగ్రెస్ బేజారు | Congress leaders shock in SRUNGAVARAPUKOTA | Sakshi
Sakshi News home page

‘దేశం’ దెబ్బకు కాంగ్రెస్ బేజారు

Apr 4 2014 2:11 AM | Updated on Aug 14 2018 5:06 PM

‘దేశం’ దెబ్బకు కాంగ్రెస్ బేజారు - Sakshi

‘దేశం’ దెబ్బకు కాంగ్రెస్ బేజారు

రాజకీయ నేతలకు స్థానిక ఎన్నికలు చెమటలు పట్టిస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో స్థానిక ఎన్నికలు నిజంగా సమరాన్ని తలపిస్తున్నాయి.

శృంగవరపుకోట, న్యూస్‌లైన్:రాజకీయ నేతలకు స్థానిక ఎన్నికలు చెమటలు పట్టిస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో స్థానిక ఎన్నికలు నిజంగా సమరాన్ని తలపిస్తున్నాయి. నమ్మకంగా పార్టీలోనే ఉంటూ అప్పటికప్పుడు పార్టీలు మారి సమరానికి సై అంటూ సొంత పార్టీలపైనే కత్తులు దూస్తున్న అభ్యర్థుల దెబ్బకు నేతలకు నిద్దుర కరువవుతోంది. 
 
 కాంగ్రెస్‌కు ‘దేశం’ దెబ్బ..
 స్థానిక ఎన్నికల సమరంలో తెలుగుదేశం పార్టీ రాజకీ య ఎత్తుగడలతో కాంగ్రెస్‌కు ఎస్.కోట, వేపాడ మండలాల్లో గట్టి దెబ్బ తగిలింది. దీంతో కంగుతిన్న కాంగ్రెస్ నేతలు.. సొంత మనుషులు అనుకున్న వారే నమ్మకద్రోహం చేశారంటూ కలత చెందుతున్నారు. ఎస్.కోట జెడ్పీటీసీ స్థానం ఎస్టీ మహిళలకు కేటాయించడంతో కాంగ్రెస్ నేతలు మాజీ మండలాధ్యక్షుడు ఒంటి అప్పారావు భార్య చిన్నాలమ్మను అభ్యర్థిగా నిర్ణయించారు. ఇదిలా ఉండగా... జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, స్థానిక కాంగ్రెస్ నేత రఘురాజుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ గత ఎన్నికల్లో ఒంటి అప్పారావు విజయానికి కృషి చేసిన కిల్తంపాలెం పంచాయతీ కార్యదర్శి ఎస్.సన్యాసిదేముడు ఈ దఫా చివరి నిమిషంలో తన భార్య సుకురు రామలక్ష్మిని తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఈ ఊహించని పరిణామంతో కాంగ్రెస్ నేతలకు షాక్ తగిలినట్లయింది.
 
 సన్యాసిదేముడు ప్రభావం కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుందని తలలు పట్టుకుంటున్నారు. తొలుత హైమావతి తనయ శోభా స్వాతిరాణిని ఎస్.కోట బరిలో పోటీ చేయించాలని టీడీపీ నేతలు భావించారు. అయితే వేపాడ మండలం మరింత సురక్షితమని భావించారు. అయితే చివరి నిమిషంలో అనూహ్యంగా సుకురు రామలక్ష్మిని బరిలోకి దించి కాంగ్రెస్‌ను ఆత్మరక్షణలోకి నెట్టారు. సన్యాసిదేముడు ప్రభావం ముషిడిపల్లి, బొడ్డవర, కిల్తంపాలెం ప్రాదేశికాల్లో ఉంటుందని, రామలక్ష్మి రాజకీయ అరంగేట్రం కొత్త సమీకరణాలకు దారి తీస్తుందనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. 
 
 సోంపురం బేజారు..
 వేపాడ మండలం సోంపురం ప్రాదేశికంలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గత పంచాయతీ ఎన్నికల్లో స్థానిక  కాంగ్రెస్ నేత మురిపిండి గంగరాజు భార్య అచ్చియ్యమ్మ సర్పంచ్ కాగా.. ఈ దఫా పంచాయతీ ఎన్నికల్లో గంగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గంగరాజు స్థానిక కాంగ్రెస్ నేతలు రఘురాజు, దుళ్ల మహేష్‌లకు సన్నిహితుడు. సోంపురంలో కాంగ్రెస్, తెలుగుదేశం నేతలు ఒక్కటై దాసరి లక్ష్మిని ఏకగ్రీవంగా ఎంపిక చేసి, ఎంపీపీ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో సోంపురం ప్రాదేశికం నుంచి కాంగ్రెస్‌కు అభ్యర్థి లేకుండా పోయారు. తమ పార్టీ వ్యక్తులు బలపరిచిన అభ్యర్థులు ‘దేశం’ గూటికి వెళ్లడం కాంగ్రెస్ నేతలకు మింగుడు పడలేదు. దీంతో దాసరి లక్ష్మిని తమ గూటిలోనే ఉంచాలన్న కాంగ్రెస్ నేతలు సూచనలతో స్థానిక నాయకులు పాట్లు పడుతున్నారు. మొత్తం సీన్‌లో ఎస్.కోటలో సుకురు రామలక్ష్మి, వేపాడలో దాసరి లక్ష్మిలు కాంగ్రెస్‌కు పక్కలో బల్లేళ్లా మారారు.
 

Advertisement
 
Advertisement
Advertisement