పోస్ట్ డాక్టోరల్ స్టడీస్ @ అమెరికా


విదేశీ విద్య.. విద్యార్థుల్లో ఎంతో క్రేజ్.. ప్రస్తుత గ్లోబల్ మార్కెట్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యుగంలో.. చేతిలో ఫారెన్ డిగ్రీ ఉంటే చాలు.. ఎల్లలు లేని అవకాశాలను అందుకోవచ్చు.. ఆకర్షణీయమైన పేప్యాకేజీలను దక్కించుకోవచ్చు.. ఒకప్పటిలా కేవలం మాస్టర్స్ డిగ్రీకే పరిమితం కాకుండా.. సబ్జెక్ట్ పరిధిని మరింత విస్తృతం చేసుకునే విధంగా పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ వంటి ఉన్నత కోర్సులను ఎంచుకోవడంతోనే ఇది సాధ్యం.. ఈ నేపథ్యంలో ఫారెన్ ఎడ్యుకేషన్‌లో భారతీయ విద్యార్థులకు టాప్ డెస్టినేషన్‌గా నిలుస్త్తున్న అమెరికాలో.. పోస్ట్ డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన విధి విధానాలపై ఫోకస్..




 

పరిశోధనలు.. ఓ దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి పట్టుగొమ్మలు. ఈ క్రమంలో పోస్ట్ డాక్టోరల్ కోర్సులు ఎంతో కీలక భూమికను పోషిస్తాయని చెప్పొచ్చు. ఒక విద్యార్థి తాను ఎంచుకున్న సబ్జెక్ట్‌లో మరింత విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ కోర్సులు ఉపయోగపడతాయి.


 


కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా ఒక బృందంతో కలసి సదరు అంశంపై విస్తృత స్థాయిలో పరిశోధనలు చేయడం ద్వారా నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉండడంతోపాటు కెరీర్‌కు ఉపయోగపడే ఎన్నో నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఈ కోర్సులు చక్కని తోడ్పాటును అందిస్తాయి. అమెరికాలో భారతీయ విద్యార్థులకు పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ పరంగా విస్తృత స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయి. అంతేకాకుండా ఈ విషయంలో అమెరికన్ యూనివర్సిటీలు ఆర్థికంగా ఎంతో ప్రోత్సాహం కూడా అందిస్తున్నాయి.




 

 విపరీతమైన పోటీ :

 అమెరికాలో పోస్ట్‌డాక్టోరల్ కోర్సులకు విపరీతమైన పోటీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా విస్తృత స్థాయిలో సన్నాహకాలు ఉంటేనే అక్కడి యూనివర్సిటీలలో ప్రవేశం సాధ్యం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ప్రాజెక్ట్ వర్క్‌కు సంబంధించిన పేపర్ ప్రెజెంటేషన్స్ ప్రభావవంతంగా ఉండాలి. ఈ విషయంలో ముందుగా ఏ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారనే అంశంపై ఒక స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకోండి.




 

 తర్వాత చేయాలనుకుంటున్న ప్రాజెక్ట్, తదితర వివరాలతో సంబంధిత యూనివర్సిటీ డీన్‌ను మెయిల్ ద్వారా సంప్రదించాలి. అక్కడి నుంచి వచ్చే ప్రతిస్పందన ఆధారంగా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. విదేశీ విద్య దిశగా ఆలోచిస్తున్న విద్యార్థులు గమనించాల్సిన మరో అంశం.. ఇటీవలి కాలంలో ఫేక్ యూనివర్సిటీల మోసాలు బయటకు వస్తున్న తరుణంలో సంబంధిత ఏజెన్సీల అక్రెడిటేషన్‌ఉన్న వర్సిటీలనే ఎంచుకోవడం మంచిది. అమెరికా అక్రెడిటేషన్ ఏజెన్సీ-ది కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అక్రెడిటేషన్.




 

 ఎనలేని ప్రాధాన్యత:

 అమెరికా విద్యా వ్యవస్థలో పోస్ట్ డాక్టోరల్ కోర్సులకు ఎనలేని ప్రాధాన్యత ఉంటుంది. ఈ కోర్సులను అభ్యసించే విద్యార్థులు అమెరికన్ కాలేజ్ క్యాంపస్‌లలో కీలక పాత్ర పోషిస్తారు. అమెరికాలో పోస్ట్ డాక్టోరల్ కోర్సులు అంటే.. ఒక నిర్ణీత అంశంపై ఒకటి లేదా రెండేళ్లపాటు చేసే చిన్న లోతైన పరిశోధనగా భావిస్తారు. సాధారణంగా పీహెచ్‌డీ తర్వాత ఉన్నత విద్య దిశగా ఆలోచించే విద్యార్థులు ఈ తరహా కోర్సులను ఎంచుకుంటారు.




 

 ఈ కోర్సులో భాగంగా విద్యార్థి తనకు ఆసక్తి ఉన్న సబ్జెక్ట్‌లో పరిశోధన కార్యకలాపాలను నిర్వహిస్తాడు. అంతేకాకుండా వీటి ఆధారంగా కొన్ని రీసెర్చ్ పేపర్లను కూడా ప్రచురిస్తాడు. ఈ మొత్తం ప్రక్రియలో యూనివర్సిటీలోని పరిశోధనశాలలు, లైబ్రరీ, ఫ్యాకల్టీ.. వంటి వనరులను సమర్థంగా వినియోగించుకుంటాడు.

 

 

 లైఫ్ సెన్సైస్ అధికం:

 అమెరికాలో అత్యధిక శాతం మంది విద్యార్థులు లైఫ్ సెన్సైస్ సంబంధిత సబ్జెక్ట్‌లను పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ కోసం ఎంచుకుంటున్నారు. వీరి సంఖ్య దాదాపు 54 శాతం వరకు ఉంటోంది. కేవలం 28 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లను పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ కోసం ఎంచుకుంటున్నారు.




 

 వర్సిటీ ఎంపిక ఇలా:

 అమెరికాలో దాదాపు నాలుగు వేల గుర్తింపు పొందిన యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు అన్ని యూనివర్సిటీలు పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో ఏది బెస్ట్? ఏ యూనివర్సిటీని ఎంచుకోవాలి? అనే అంశంలో ఎప్పుడూ ఒక రకమైన అస్పష్టత నెలకొని ఉంటుంది. ఈ అంశంలో స్పష్టతకు వచ్చే ముందు పలు అంశాలను ఆధారంగా చేసుకోవాలి. అవి.. ఎంచుకున్న సబ్జెక్ట్, దానికి సరిపోయే యూనివర్సిటీ, అందులోని ప్రొఫెసర్లు, అందుబాటులో ఉన్న వనరులు, ఆర్థికంగా చేయూత (ఫండింగ్) తదితర అంశాలు.




 

 వీటి ఆధారంగా కొన్ని యూనివర్సిటీలను షార్ట్‌లిస్ట్ చేసుకోవాలి. తర్వాత మన ప్రాజెక్ట్‌కనుగుణంగా సరిపోయే యూనివర్సిటీల్లోని ప్రొఫెసర్లు, స్కాలర్లను వివిధ మాధ్యమాల ద్వారా సంప్రదించాలి. అంతేకాకుండా యూనివర్సిటీ చరిత్ర, ఎంచుకున్న సబ్జెక్ట్‌లో ఇంత వరకు ఎంత మంది పరిశోధనలు చేశారు, ప్రచురించిన పేపర్లు ఆధారంగా ఒక అంచనాకు రావాలి. వీటన్నిటిని విశ్లేషించుకున్న తర్వాత అన్ని రకాల ప్రమాణాలను కలిగి ఉన్న యూనివర్సిటీని ఎంచుకోవాలి.

 

 దరఖాస్తు ఇలా:

 అమెరికన్ యూనివర్సిటీల్లో పోస్ట్ డాక్టోరల్ కోర్సుల కోసం వివిధ మాధ్యమాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్నెట్, ప్రముఖ పత్రికలలో ప్రచురితమయ్యే ప్రకటనల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా యూనివర్సిటీల మధ్య ఉండే ఎక్స్ఛేంజ్ కార్యక్రమాల్లో భాగంగా కూడా అమెరికన్ యూనివర్సిటీల్లో పోస్ట్ డాక్టోరల్ కోర్సులను ఎంచుకోవచ్చు.


 


అమెరికన్ యూనివర్సిటీలతో ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ రూపంలో అవగాహన యూనివర్సిటీల వివరాలను http://exchanges.state.gov వెబ్‌సైట్ ద్వారా పొందొచ్చు. పరిశోధన చేయాలనుకుంటున్న అంశానికి సంబంధించి ఎంపిక చేసుకున్న యూనివర్సిటీలో నిర్దేశిత ప్రొఫెసర్‌కు ప్రాజెక్ట్ ప్రపోజల్‌ను పంపడం ద్వారా కూడా అక్కడి యూనివర్సిటీల్లో అడుగుపెట్ట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కోర్సుకు సంబంధించిన విధి విధానాలను సదరు ప్రొఫెసర్ నిర్ణయిస్తారు.

 

 నాన్-డిగ్రీ విద్యార్థులు కూడా:

 పీహెచ్‌డీ విద్యార్థులే కాకుండా నిబంధనల మేరకు యూఎస్ యూనివర్సిటీల్లో పోస్ట్‌డాక్టోరల్ కోర్సుల కోసం నాన్-డిగ్రీ విద్యార్థులు లేదా విజిటింగ్ స్టూడెంట్స్ స్టేటస్ ఉన్న విద్యార్థులు కూడా నేరుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో విద్యార్థులు పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్స్ వర్క్ (క్రెడిట్స్ కోసం నిర్దేశించిన రీసెర్చ్ బేస్డ్ క్లాసెస్‌తో కలిపి) పూర్తి చేయడంతోపాటు పోస్ట్ డాక్టోరల్ కోర్సులు చేసే సౌలభ్యం ఉంటుంది.

 

 ట్యూషన్ ఫీజులు కూడా డిగ్రీ కోర్సు మాదిరిగానే ఉండడం గమనించాల్సిన అంశం. అంతేకాకుండా రెగ్యులర్ స్కాలర్స్ మాదిరిగానే ఆర్థికంగా చేయూత కూడా లభిస్తోంది. అడ్మిషన్ పొందిన యూనివర్సిటీ స్కాలర్‌షిప్ రూపంలో ఆర్థికంగా చేయూతనిస్తుంది. లేదా వివిధ ఏజెన్సీలు అందించే స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్ (ఫుల్‌బ్రైట్ వంటి) లేదా స్పాన్సర్‌షిప్ ద్వారా ఆర్థికంగా ప్రోత్సాహాన్ని పొందొచ్చు.

 

 పీహెచ్‌డీ:

 పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా అమెరికన్ యూనివర్సిటీలో పరిశోధన చేసే అవకాశం ఉంటుంది. వీరికి విజిటింగ్ స్కాలర్ లేదా పోస్ట్ డాక్టోరల్ ఫెలో రూపంలో ఈ సౌలభ్యం లభిస్తుంది. ఈ సమయంలో యూనివర్సిటీలో రెగ్యులర్ ఫ్యాకల్టీలు, స్కాలర్స్ మాదిరిగానే పరిశోధన కార్యకలాపాలను చేపట్టవచ్చు. సంబంధిత వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు. రీసెర్చ్ ప్రపోజల్ ఆధారంగా యూనివర్సిటీలను నేరుగా సంప్రదించడం ద్వారా లేదా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు.

 

 ఇటువంటి కోర్సులను ఎంచుకుంటున్న అధిక శాతం మంది అభ్యర్థులు సెల్ఫ్ ఫైనాన్స్‌డ్‌గా ఉంటున్నారు. వీరికి వివిధ స్కాలర్‌షిప్స్/ఫెలోషిప్స్ (ఎక్స్‌టర్నల్ ఫండింగ్) రూపంలో చేయూత లభిస్తుంది. లేదా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న సంస్థలు/కంపెనీలు వేతనం రూపంలో ఆర్థికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయి. లేదా స్కాలర్ హోమ్ ఇన్‌స్టిట్యూట్స్ సబ్‌బ్యాటికల్ (ఒక యూనివర్సిటీలో పని చేస్తున్న ప్రొఫెసర్ తాను చేసే పరిశోధన కోసం ఒక సంవత్సరం పాటు సెలవు తీసుకోవడం) రూపంలో చేయూతనందిస్తున్నాయి.

 

 జాగ్రత్తగా:

 పరిశోధన అంశాన్ని ఎంచుకునే ముందు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. అవి.. ఏ లక్ష్యం ఆశించి రీసెర్చ్ టాపిక్‌ను ఎంపిక చేసుకున్నామో? రీసెర్చ్ తర్వాత దాన్ని సాధించగలమా? ఎంచుకున్న రంగంలో భవిష్యత్‌లో సంభవించే మార్పులు? నిర్దేశిత వ్యవధి సరిపోతుందా? కెరీర్ పరంగా ఎంత వరకు ఉపయోగకరం?ఎంచుకున్న రంగం లో ప్రస్తుతం మాతృ దేశంలో ఉన్న అవకాశాలు వంటివి.

 

 ఉన్నత స్థానాల దిశగా:

 యూఎస్ యూనివర్సిటీల్లో పోస్ట్ డాక్టోరల్ కోర్సులో ప్రవేశం పొందడం.. కెరీర్ పరంగా మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పొచ్చు. ముఖ్యంగా అక్కడి అంతర్జాతీయ స్థాయి వనరులు, నాణ్యమైన ఫ్యాకల్టీలతో కలసి పరిశోధనలు చేయడం ద్వారా లభించే అవగాహన, మెరుగుపడే నైపుణ్యాలు వెలకట్టలేనివి. పరిశోధన పరంగా ఒక విద్యార్థి ఎదగడానికి కావలసిన అన్ని రకాల అవకాశాలను అక్కడి యూనివర్సిటీలు కల్పిస్తాయి.


 


ప్రస్తుత గ్లోబల్ మార్కెట్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ యుగంలో నిత్యం నేర్చుకునే తత్వం ఉన్న వారికే రిక్రూటర్లు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ తరహా నైపుణ్యాలు పెంపొందించడంలో అమెరికన్ యూనివర్సిటీలు ముందుంటాయి. అంతేకాకుండా అమెరికన్ వర్సిటీ డిగ్రీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంటుంది. అమెరికాలో పోస్ట్ డాక్టోరల్ చేసిన అంశాన్ని ప్రస్తావించడం.. రెజ్యుమెను మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా ప్రారంభంలోనే సంవత్సరానికి 42,000 యూఎస్ డాలర్లను వేతనంగా అందుకోవచ్చు.

 

 అవకాశాలు పుష్కలం:

 పోస్ట్‌డాక్టోరల్ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలకు కొదవలేదు. అకడమిక్ పరంగా వీరి సేవలను వినియోగించుకోవటానికి చాలా ఇన్‌స్టిట్యూట్‌లు రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలుకుతున్నాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక ఇన్‌స్టిట్యూట్‌లలో ఫ్యాకల్టీగా స్థిర పడొచ్చు. లేదా నిర్ణీత కాలానికి కన్సల్టెంట్‌గా కూడా సేవలు అందించవచ్చు. అంతేకాకుండా కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు.. తమ క్యాంపస్‌లలోనే పరిశోధనలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇందుకోసం పరిశోధనశాలలను సైతం నిర్మించుకోవడానికి కావలసిన సహాయాన్ని అందజేస్తున్నాయి.

 

 ఆర్థికంగా చేయూత:

 విదేశీ విద్య క్రమంలో ఫెలోషిప్/స్కాలర్‌షిప్ ఆర్థికంగా ఎంతో చేయూతనందిస్తాయి. వీటి కింద జే-1 వీసా, నెల వారీ స్టైపెండ్, హోమ్ సిటీ నుంచి హోస్ట్ యూనివర్సిటీ వరకు ఎకానమీ క్లాస్ ఎయిర్ టికెట్, ట్యూషన్ ఫీజు, నివాస-వసతి ఖర్చులను చెల్లించడం జరుగుతుంది. యాక్సిడెంట్ పాలసీలు కూడా ఇందులో ఉంటాయి. అంతేకాకుండా కొలంబియా, కార్నెల్ వంటి వర్సిటీలు కూడా పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ రూపంలో చేయూతనందిస్తున్నాయి.

 

 ఉపయోగకరమైన స్కాలర్‌షిప్స్:

 కొలంబియా యూనివర్సిటీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్

 రోటరీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్

 ఫుల్‌బ్రైట్ నెహ్రూస్ మాస్టర్స్ ఫెలోషిప్

 ఇన్‌ల్యాక్స్ స్కాలర్‌షిప్

 కార్నెల్ యూనివర్సిటీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్

 

 టాప్ యూనివర్సిటీస్

 హార్వర్డ్ యూనివర్సిటీ

 జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ

 స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ

 మసాచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ

 యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌ఫ్రాన్సిస్కో

 యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-లాస్‌ఏంజిలెస్

 యేల్ యూనివర్సిటీ

 యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-శాన్‌డియాగో

 డ్యూక్ యూనివర్సిటీ

 యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-బార్కిలీ

 యూనివ ర్సిటీ ఆఫ్ వాషింగ్టన్

 యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా

 కొలంబియా యూనివర్సిటీ

 యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్

 

 దరఖాస్తుకు ముందు

 అమెరికన్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే ముందు విద్యార్థులు స్వీయ విశ్లేషణ చేసుకుంటే విదేశీ విద్యాభ్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ క్రమంలో కొన్ని అంశాల్లో స్పష్టత పొందాల్సి ఉంటుంది. అవి..

 అకడమిక్స్‌కు ఎక్కువ సమయం కేటాయించగలరా?

 చేరాలనుకుంటున్న కోర్సుకి భవిష్యత్తులో స్వదేశంలో అవకాశాలుంటాయా?

 కోర్సు కోసం ఖర్చు చేసిన మొత్తానికి సరిపడా భవిష్యత్తులో సంపాదించే అవకాశం ఉంటుందా?

 ఆ కోర్సుకు స్వదేశంలోని సంస్థల గుర్తింపు ఉందా?

 సంబంధిత కోర్సు చదవడానికి వెళ్లడం వల్ల స్వదేశంలో ఏైవైనా అవకాశాలు దూరమవుతున్నాయా?

 

 యూజ్ ఫుల్ సోర్సెస్

 www.usief.org.in

 http://exchanges.state.gov

 www.nationalpostdoc.org

 www.scholars4dev.com

 

 అమెరికాలో ఉన్న విద్యకు సంబంధించిన వివరాలను 18001031231 టోల్ ఫ్రీ హాట్‌లైన్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చు (సోమవారం-శుక్రవారం, 2-5 గంటల మధ్య).

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top