దేశంలోనే తొలి విదేశ్‌ భవన్‌ ప్రారంభం

దేశంలోనే తొలి విదేశ్‌ భవన్‌ ప్రారంభం


జమిలి ఎన్నికలకు నీతి ఆయోగ్‌ సిఫారసు

దేశంలో 2024 నాటికి లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసింది. దీనికోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలాన్ని పొడిగించడమో/తగ్గించడమో చేయాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇదేమంత పెద్ద విషయం కాదని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. ఆగస్టు 27న విడుదల చేసిన తన త్రైవార్షిక(2017–18 నుంచి 2019–20) ప్రణాళికలో పలు అంశాలను వెల్లడించింది.బార్‌కోడ్‌తో యుద్ధ వాహనాల ప్రారంభం

సైన్యం అవసరాలకు అనుగుణంగా బార్‌కోడ్‌తో రూపొందించిన అత్యాధునిక బీఎంపీ–2 వాహనాలను ఆర్మీకి అందించే కార్యక్రమాన్ని రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ  ఆగస్టు 27న సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో ప్రారంభించారు. బార్‌కోడ్‌ ఆధారంగా వాహన ఉత్పత్తికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదన్న సుప్రీంకోర్టు

ముస్లిం సమాజంలో ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులివ్వడం ఇకపై కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇది చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది. ట్రిపుల్‌ తలాక్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ ఆగస్టు 22న 395 పేజీల తీర్పులో పేర్కొన్నారు. పునరాలోచన చేసుకునేందుకు ఆస్కారం లేని, క్షణాల్లో ఇచ్చేసే ట్రిపుల్‌ తలాక్‌ అంగీకార యోగ్యం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ట్రిపుల్‌ తలాక్‌ ద్వారా విడాకులివ్వడం అత్యంత ఏక పక్షం, అహేతుకం, రాజ్యాంగ ఉల్లంఘన  అని పేర్కొంది.  దక్షిణాది రాష్ట్రాల మధ్య ‘విద్యుత్‌’ సహకారం

దక్షిణాది రాష్ట్రాలు విద్యుత్‌ను పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ కమిటీ(ఎస్‌ఆర్‌పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆగస్టు 22న ముగిసిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది.ఛత్తీస్‌గఢ్‌లో ఉచితంగా స్మార్ట్‌ ఫోన్లు

ఛత్తీస్‌గఢ్‌లో 55 లక్షల స్మార్ట్‌ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. ఈ పథకానికి సంచార్‌ క్రాంతి యోజన అని పేరు పెట్టారు.ఓబీసీ ఉప వర్గీకరణకు కేంద్రం నిర్ణయం

కేంద్ర జాబితాలోని ఓబీసీ(ఇతర వెనకబడిన కులాలు) ఉప వర్గీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. చైర్‌పర్సన్‌ను నియమించిన నాటి నుంచి 12 వారాల్లోపు ఈ కమిషన్‌ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కాగా జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో క్రీమీలేయర్‌ గరిష్ట వార్షికాదాయ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచారు.  ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పథకం పేరు మార్పు

కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పథకానికి ప్రధానమంత్రి కిసాన్‌ సంపద యోజనగా పేరు మార్చేందుకు కేంద్ర కేబినెట్‌ ఆగస్టు 23న అంగీకరించింది. రూ.6,000 కోట్లు కేటాయించిన ఈ పథకం ద్వారా 2020 నాటికి 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 5.30 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.దేశంలోనే తొలి విదేశ్‌ భవన్‌ ప్రారంభం

ముంబైలో ఏర్పాటుచేసిన విదేశ్‌ భవన్‌ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌  ఆగస్టు 27న ప్రారంభించారు. దేశంలో ఈ తరహా కార్యాలయం ఏర్పాటుకావడం ఇదే ప్రథమం. విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి మహారాష్ట్రలో ఉన్న అన్ని కీలక కార్యాలయాలు విదేశ్‌ భవన్‌లో ఉంటాయి.డేరా సచ్చా సౌధా చీఫ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్‌ రాం రహీం సింగ్‌కు సీబీఐ కోర్టు ఆగస్టు 28న 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2002 నాటి రెండు అత్యాచార కేసుల్లో(ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున) శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జగ్‌దీప్‌ సింగ్‌ తీర్పు వెలువరించారు. జైలు శిక్షతోపాటు ఒక్కో కేసుకు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు.వ్యక్తిగత గోప్యత.. ప్రాథమిక హక్కు

వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ఆగస్టు 24న స్పష్టం చేసింది. వ్యక్తుల గౌరవప్రదమైన జీవితానికి ఈ హక్కు తప్పనిసరని తెలిపింది. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి ఉండే హక్కుల్ని, పరిమితుల్ని గుర్తుచేసింది. డిజిటల్‌ ప్రపంచంలో సమాచారాన్ని భద్రపరచాల్సిన జాగ్రత్తలన్నీ సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జె.ఎస్‌.ఖేహర్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది.సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు జోన్ల వారీ కేడర్లు

సివిల్‌ సర్వీస్‌ అధికారులకు కేడర్ల కేటాయింపునకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ఖరారు చేసింది. సివిల్‌ సర్వీస్‌ అధికారుల్లో జాతీయ సమగ్రత భావనను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నూతన విధానం ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 26 కేడర్లను ఐదు జోన్లుగా విభజించారు. దీంతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారులు ఇకపై రాష్ట్రాలకు బదులు జోన్ల కేడర్లను ఎంపిక చేసుకోవాలి.క్రీడలు

సింధుకి రజతం


ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్‌ పీవీ సింధు రజత పతకం కైవసం చేసుకుంది. గ్లాస్గో(స్కాట్లాండ్‌)లో ఆగస్టు 27న జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో జపాన్‌ క్రీడాకారిణి నోజొమి ఓకుహార చేతిలో సింధు ఓటమి చవిచూసింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో సింధు పతకం సాధించడం ఇదో మూడోసారి. 2013, 14ల్లో కాంస్య పతకాలు పొందింది. మహిళల డబుల్స్‌ టైటిల్‌ను చెన్‌ క్వింగ్‌ చెన్, జియో విఫాన్‌ (చైనా) గెలుచుకోగా పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను విక్టర్‌ ఆక్సెల్స్‌న్‌ (స్వీడన్‌) గెలుచుకున్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను మొహమ్మద్‌ ఆసన్, లిలియానా నట్సిర్‌ (ఇండోనేషియా) కైవసం చేసుకున్నారు.మేవెదర్‌ వరల్డ్‌ రికార్డులు

అమెరికా స్టార్‌ ప్లేయర్‌ ఫ్లాయిడ్‌ మేవెదర్‌.. ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ కెరీర్‌లో అజేయంగా నిలిచిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. లాస్‌వేగాస్‌(అమెరికా)లో ఆగస్టు 27న జరిగిన జూనియర్‌ సూపర్‌ ఫైట్‌ బౌట్‌లో గెలుపొందడం ద్వారా ప్రొఫెషనల్‌ కెరీర్‌లో వరుసగా 50వ విజయాన్ని నమోదు చేశాడు. మేవెదర్‌ పోటీపడిన 50 బౌట్లలోనూ ఆయనే విజేత. 49 వరుస విజయాలతో అమెరికా హెవీ వెయిట్‌ ప్రొఫెనల్‌ బాక్సర్‌ రాకీ మర్సియానో పేరిట ఉన్న రికార్డును మేవెదర్‌ అధిగమించాడు. కాగా తాను మళ్లీ రింగ్‌లోకి దిగే అవకాశాలు లేవని మేవెదర్‌ ప్రకటించాడు.హామిల్టన్‌కు బెల్జియం గ్రాండ్‌ ప్రీ టైటిల్‌

బెల్జియం ఫార్ములావన్‌ గ్రాండ్‌ ప్రీ టైటిల్‌ను లూయిస్‌ హామిల్టన్‌ సాధించాడు. ఆగస్టు 27న బెల్జియంలో జరిగిన రేసులో మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. 32 ఏళ్ల హామిల్టన్‌(బ్రిటన్‌)కు ఇది ఓవరాల్‌గా 58వ విజయం.వార్తల్లో వ్యక్తులు

సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా దీపక్‌ మిశ్రా


సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆగస్టు 28న బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ పదవీ కాలం ముగియడంతో నూతన చీఫ్‌ జస్టిస్‌గా దీపక్‌ మిశ్రా చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణం చేయించారు. మిశ్రా ఈ పదవిలో 13 నెలలు కొనసాగుతారు.కరెంట్‌ అఫైర్స్‌

మూడు క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా


ఉత్తర కొరియా మూడు బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా సైనిక అధికారులు ఆగస్టు 26న పేర్కొన్నారు. పసిఫిక్‌ సముద్ర తూర్పు జలాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు. మొదటి రెండు విఫలమవడంతో మూడోది ప్రయోగించినట్లు చెప్పారు. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ప్రయోగించే ఈ మూడు క్షిపణులు తేలికపాటివే అన్నారు.నేపాల్‌తో ఎనిమిది ఒప్పందాలు

నేపాల్‌ ప్రధానమంత్రి షేర్‌ బహదూర్‌ దేవుబా భారత పర్యటనలో ఆగస్టు 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తమ గడ్డపై భారత వ్యతిరేక కార్యకాలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మాదకద్రవ్యాల రవాణాకు కళ్లెం వేయడం, భూకంప అనంతర పునర్నిర్మాణ చర్యలతోపాటు వివిధ అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఒడంబడికలు ఉన్నాయి.అవార్డులు

2017 క్రీడా పురస్కారాలు


2017 ఏడాదికి క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 22న ప్రకటించింది. వీటిని ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో ప్రదానం చేశారు. ఇద్దరికి ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’, ఏడుగురికి ‘అర్జున’, మరో ఏడుగురికి ‘ద్రోణాచార్య’, ముగ్గురుకి ‘ధ్యాన్‌చంద్‌’ పురస్కారాలు అందజేసింది. భారత పారా అథ్లెట్‌ దేవేంద్ర జఝరియాకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న దక్కింది. రియో పారాలింపిక్స్‌లో జావెలిన్‌ త్రోయర్‌ దేవేంద్ర జఝరియా రెండు స్వర్ణాలు గెలుపొందాడు. 25 ఏళ్ల ఖేల్‌రత్న అవార్డుల చరిత్రలో ఈ పురస్కారాన్ని ఓ  పారాలింపియన్‌ అందుకోవడం ఇదే తొలిసారి. దశాబ్ద కాలానికి పైగా భారత హాకీకి సేవలందిస్తున్న మాజీ కెప్టెన్‌ సర్దార్‌ సింగ్‌కు కూడా ఖేల్‌రత్న దక్కింది.∙ రాజీవ్‌ ఖేల్‌రత్న: దేవేంద్ర జఝరియా

(పారా అథ్లెటిక్స్‌), సర్దార్‌ సింగ్‌ (హాకీ) ∙అర్జున: జ్యోతి సురేఖ(ఆర్చరీ), సాకేత్‌ మైనేని(టెన్నిస్‌), ఖుష్బీర్‌ కౌర్, రాజీవ్‌ (అథ్లెటిక్స్‌), ప్రశాంతి(బాస్కెట్‌ బాల్‌), దేవేంద్రోసింగ్‌(బాక్సింగ్‌); పుజారా, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌(క్రికెట్‌); ఒయినమ్‌ బెంబెందేవి(ఫుట్‌బాల్‌), చౌరాసియా (గోల్ఫ్‌), సునీల్‌(హాకీ), జస్వీర్‌ సింగ్‌ (కబడ్డీ), ప్రకాశ్‌ నంజప్ప(షూటింగ్‌), ఆంథోనీ అమల్‌రాజ్‌ (టేబుల్‌ టెన్నిస్‌), మరియప్పన్‌ తంగవేలు, వరుణ్‌ భటి (పారా అథ్లెటిక్స్‌), సత్యవర్త్‌ కడియన్‌ (రెజ్లింగ్‌).ద్రోణాచార్య: డాక్టర్‌ ఆర్‌.గాంధీ (అథ్లెటిక్స్‌), హీరానంద్‌ కటారియా (కబడ్డీ), జీఎస్‌వీ ప్రసాద్‌(బ్యాడ్మింటన్‌), బ్రిజ్‌ భూషన్‌ మహంతి(బాక్సింగ్‌), రోహన్‌లాల్‌(రెజ్లింగ్‌), రాఫెల్‌(హాకీ), సంజయ్‌ చక్రవర్తి(షూటింగ్‌). ధ్యాన్‌చంద్‌: భూపిందర్‌ సింగ్‌(అథ్లెటిక్స్‌), సయ్యద షాహిద్‌ హకీం(ఫుట్‌బాల్‌), సుమరాయ్‌ టకే(హాకీ).

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top