దురాక్రమణకు ట్రంప్‌ వంతపాట

Sakshi Editorial On Donald Trump Decision On West Bank Settlements

జెరూసలేంను ఇజ్రాయెల్‌ రాజధానిగా గుర్తిస్తున్నట్టు ప్రకటించిన రెండేళ్లకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశానికి ప్రయోజనం కలిగించే మరో నిర్ణయం తీసుకున్నారు. వెస్ట్‌బ్యాంక్‌ను ఆక్రమించి అక్కడ ఇజ్రాయెల్‌ ఏర్పాటుచేసిన ఆవాసాలు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణ మైనవేనని గుర్తిస్తున్నట్టు అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో మంగళవారం ప్రకటించారు. 1978లో వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్‌ నిర్మాణాలు మొదలెట్టినప్పుడు ఆ చర్య పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతుందని, తక్షణం దాన్ని విరమించుకోవాలని ప్రపంచ దేశాలన్నీ ముక్తకంఠంతో హెచ్చరించాయి. అప్పట్లో ప్రపంచ ప్రజానీకం అభీష్టాన్ని మన్నించి ఆనాటి అమెరికా అధ్యక్షుడు, డెమొక్రటిక్‌ పార్టీ నేత జిమ్మీ కార్టర్‌ సైతం ఇజ్రాయెల్‌ చర్య చట్టవిరుద్ధమని ప్రకటించారు. అమె రికా–ఇజ్రాయెల్‌ దేశాలది జన్మజన్మల బంధం. డెమొక్రాట్ల ఏలుబడిలో ఉన్నా, రిపబ్లికన్లు అధికా రంలో ఉన్నా అది కొనసాగుతూనే ఉంటుంది. కానీ డెమొక్రాట్లతో పోలిస్తే రిపబ్లికన్లు ఇజ్రాయెల్‌తో అంటకాగడం అధికం. కార్టర్‌ అనంతరం అధికారంలోకొచ్చిన రిపబ్లికన్‌ రోనాల్డ్‌ రీగన్‌ కూడా కార్టర్‌ నిర్ణయాన్ని సవరించడానికి ప్రయత్నించలేదు. కాకపోతే ఇజ్రాయెల్‌ చర్య ‘చట్టవిరుద్ధం’ అనడాన్ని వ్యతిరేకించి అది ‘అక్రమం’ మాత్రమేనని చెప్పారు. 2016లో బరాక్‌ ఒబామా మరో అడుగు ముందు కేసి ఇజ్రాయెల్‌ చట్టవిరుద్ధ ఆవాసాలకు స్వస్తి పలకాలని కోరే భద్రతామండలి తీర్మానాన్ని వీటో చేసే సంప్రదాయాన్ని సైతం మార్చారు. ఇలా నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తున్న విధానాన్ని ట్రంప్‌ అడ్డగోలుగా రద్దు చేశారు.

వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరూసలేం ప్రాంతాల్లో ఉన్న యూదు ఆవాసాలపైనే ఇజ్రాయెల్, పాల స్తీనాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ చట్టవిరుద్ధ ఆవాసాల సమస్య ఆ రెండు దేశాల మధ్య మాత్రమే కాదు... మొత్తంగా పశ్చిమాసియాలో కల్లోలం రేపుతోంది. ఈ విషయంలో రెండు దేశాలనూ చర్చలకు ఒప్పించి సుస్థిర శాంతి స్థాపించాలన్న ప్రయత్నాలకు ఇజ్రాయెల్‌ మోకా లడ్డుతోంది. రెండేళ్లక్రితం బెంజిమిన్‌ నెతన్యాహు ప్రభుత్వం పాలస్తీనా భూభాగంలోని వివాదాస్పద ఆవాసాలకు చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నారు. తనకు సార్వభౌమాధికారం లేని ప్రాంతాలపై ఇలా ఇష్టానుసారం చట్టాలు చేయడం తగదని ఎందరు చెప్పినా ఇజ్రాయెల్‌ పట్టించుకోలేదు.

ఈ చర్యకు ట్రంప్‌ లోపాయికారీ మద్దతు ఉన్నదని ఆరో పణలొచ్చినా ఆయన స్పందించలేదు. ఇన్నాళ్ల తర్వాత అమెరికా వైఖరి మారిందంటూ ప్రకటించి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఒకపక్క ఇరు దేశాల మధ్యా సంధి కుదిర్చి, శాంతి స్థాపనకు పాటుపడతామని చెబుతూ వచ్చిన అమెరికా ఇలా ఉన్నట్టుండి ఆ ప్రాంతాన్ని భగ్గున మండించే చర్యకు ఎందుకు దిగజారిందన్నది చూడాలి. వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన పరిస్థితిని మెరుగుపర్చుకోవడం కోసం ట్రంప్‌ ఈ ఎత్తు వేశారు. అమెరికాలో ఉన్న యూదు ఓట్లు ఒక్క కలంపోటుతో సొంతం చేసుకోవచ్చునన్నది ఆయన ఎత్తుగడ సారాంశం. అదే సమయంలో ఇజ్రాయెల్‌లో జరిగిన రెండు వరస ఎన్నికల్లో మెజారిటీ దక్కక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైన నెతన్యాహును ఏదో మేరకు గట్టెక్కించడానికి ఇది తోడ్పడుతుందన్న అభిప్రాయం ట్రంప్‌కు ఉంది. ఐక్య సంఘటన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని నెతన్యాహు పాకులాడుతున్నా ఇజ్రాయెల్‌లోని మరో ప్రధాన పక్షం బ్లూ అండ్‌ వైట్‌ పార్టీ ససేమిరా అంటున్నది. మరోపక్క అవినీతి కేసులు నెతన్యాహును వెంటాడుతున్నాయి. ట్రంప్‌ నిర్ణయం తన ప్రయత్నం పర్యవసానమేనని చెప్పుకుని రాజకీయ లబ్ధి పొందాలని నెతన్యాహు చివరి ప్రయత్నం చేస్తున్నారు.

వెస్ట్‌బ్యాంక్, తూర్పు జెరుసలేం ప్రాంతాలు రెండింటినీ 1967నాటి పశ్చిమాసియా యుద్ధంలో  ఇజ్రాయెల్‌ ఆక్రమించింది. దాదాపు 7 లక్షలమంది ఇజ్రాయెల్‌ పౌరులను అక్కడకు తరలించి ఆవా సాలు ఏర్పరుచుకోవడానికి సహకరించింది. అప్పట్లో ఆరురోజులపాటు సాగిన యుద్ధంలో పాల స్తీనాకు చెందిన ఈ రెండు ప్రాంతాలతోపాటు సిరియాలోని గోలన్‌హైట్స్, ఈజిప్టులో భాగంగా ఉన్న సినాయ్‌ ద్వీపకల్పం ఇజ్రాయెల్‌ స్వాధీనం చేసుకుంది. అయితే ఈజిప్టుతో 1979లో ఒప్పందం కుదిరాక సినాయ్‌లో ఏర్పాటు చేసిన 18 ఆవాసాలనూ కూల్చేసి అక్కడి నుంచి ఇజ్రాయెల్‌ నిష్క్ర మించింది. అలాగే గాజాలోని 21 సెటిల్‌మెంట్‌లను, వెస్ట్‌బ్యాంక్‌లోని నాలుగింటిని సైతం 2005లో వదులుకుంది. అయితే ఈ ప్రాంతాలను అంతర్జాతీయ అభిశంసనలకు జడిసి, లాంఛనంగా విలీనం చేసుకోలేదు. దురాక్రమించినవాటని ఖాళీ చేయాల్సిందేనని ఐక్యరాజ్యసమితి అనేకసార్లు ఇజ్రా యెల్‌కు తెలియజేసింది.

2004లో అంతర్జాతీయ న్యాయస్థానం సైతం తప్పుబట్టింది. అంతర్జాతీయ వేదికలు తరచు చెప్పే హితవచనాలను తలకెక్కించుకోని ఇజ్రాయెల్, తన దురాక్రమణకు వ్యతి రేకంగా ఉద్యమించిన పాలస్తీనా పౌరులపై బాంబుల వర్షం కురిపించి వందలమంది ఉసురు తీస్తోంది. ‘ఆత్మరక్షణ’ కోసమే ఈ దాడులని దబాయిస్తోంది. వేరొకరి భూభాగాన్ని కబ్జా చేయ డమేకాక... ప్రశ్నించినవారిని, బయటకు పోవాలన్నవారిని పొట్టనబెట్టుకోవడం ఇజ్రాయెల్‌ అనుస రిస్తున్న రాజనీతి. తమ ప్రాంతాలకు చొచ్చుకొచ్చి సైనికులను మొహరించి, రహదారులు మూసేసి, చెక్‌పోస్టులు ఏర్పరిచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కబళిస్తున్న ఇజ్రాయెల్‌ తీరుపై పాలస్తీనావాసులు ఆగ్రహంతో ఉన్నారు. అంతర్జాతీయ అభిశంసనల పరంపర కారణంగా ఎంతో కొంత తగ్గి ఉన్న ఇజ్రాయెల్‌ ట్రంప్‌ తాజా చర్యతో మరింత పేట్రేగుతుంది. ఇదంతా సహజంగానే ఆ ప్రాంతాన్ని రణరంగంగా మారుస్తుంది. నిస్సహాయ పౌరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. తమకంటూ ఒక భూభాగం ఏర్పడి, స్వతంత్ర దేశంగా మనగలగాలన్నది పాలస్తీనీయుల చిరకాల స్వప్నం. ఇజ్రా యెల్‌తో చేతులు కలిపి దానికి భంగం కలిగిస్తున్న అమెరికా చర్యను ప్రపంచ ప్రజానీకం నిరసిం చకమానదు. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top