ప్రతీకార దాడులు

ప్రతీకార దాడులు


మణిపూర్‌లో ఈ నెల 4న మిలిటెంట్లు రెచ్చిపోయి జవాన్లపై దాడి జరిపి 20మందిని పొట్టనబెట్టుకున్న ఉదంతం అనంతరం అందరూ ఊహిస్తున్నదే జరిగింది. ఈ దాడికి ప్రతీకారంగా మన సైన్యం మయన్మార్ భూభాగంలో ఉంటున్న మిలిటెంట్ల స్థావరాలపై విమానాలు, హెలికాప్టర్ల సాయంతో మంగళవారం మెరుపు దాడులు నిర్వహించింది. ఆ దేశ భూభాగంలో 5 కిలోమీటర్ల లోపలకు వెళ్లి ఈ దాడులు చేసింది.



ఇందులో మృతులెంతమందో, మిలిటెంట్లకు ఇతరత్రా జరిగిన నష్టమేమిటో వివరాలు లేవు. ఇవి బుధవారం కూడా కొనసాగుతాయని సైన్యం ప్రకటించింది. మరో దాడికి పథకం పన్నుతున్నారని తెలిసి దాన్ని నివారించడం కోసం ఈ చర్యకు పూనుకోవాల్సివచ్చిందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఉగ్రవాదమైనా, మరే ఇతర వర్గాలు చేసే హింస అయినా ఏ దేశంలోని ప్రభుత్వాలకైనా సమస్యే. ఆ సమస్యను ఎదుర్కొనడానికి ప్రభుత్వాలు అవలంబించే పద్ధతులపై భిన్న కోణాల్లో చర్చ జరుగుతుంటుంది.



సరిహద్దుల అవతల స్థావరాలను ఏర్పాటుచేసుకుని ఉగ్రవాద ఘటనలకు పాల్పడుతున్నవారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని, అవసరమైతే పాక్ భూభాగంలోకి ప్రవేశించి బాంబు దాడులు నిర్వహించాలని విపక్షంలో ఉన్నప్పుడే బీజేపీ డిమాండ్ చేసేది. నాలుగేళ్లక్రితం ఉగ్రవాద నేత బిన్ లాడెన్ తలదాచుకున్న స్థావరాన్ని గుర్తించి అమెరికా మెరైన్ కమాండోలు అర్థరాత్రి దాడులు నిర్వహించి అతన్ని మట్టుబెట్టినప్పుడు అప్పటి మన ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ ‘అలాంటి సామర్థ్యం భారత్‌కు సైతం ఉన్నద’ని ప్రకటించినప్పుడు పెద్ద సంచలనం కలిగింది. ఆ తరహా దుస్సాహసానికి పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని వెనువెంటనే పాకిస్థాన్ జవాబిచ్చింది.



కారణం ఏమైనా కావొచ్చుగానీ... ఒక దేశం భూభాగంలోకి మరో దేశానికి చెందిన సైన్యం ముందస్తు సమాచారం ఇవ్వకుండా చొరబడటం, సైనిక చర్యకు పాల్పడి వెళ్లడం అసాధారణమే కాదు, అవాంఛనీయ పరిణామం కూడా. అందులో సందేహం లేదు. అందునా పరస్పరం కత్తులు నూరుకునే రెండు ఇరుగు పొరుగు దేశాలమధ్య అలాంటి పరిణామం చోటుచేసుకోవడం మంచిది కానే కాదు.



ఇప్పుడు మయన్మార్ భూభాగంలో నేషనల్ సోషలిస్టు కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సీఎన్)-ఖప్లాంగ్ వర్గం, కాంగ్లీ యవోల్ కన్నా లుప్ (కెవెకైఎల్) శిబిరాలపై మయన్మార్ ప్రభుత్వానికి ముందస్తుగా తెలియజెప్పి దాడులు నిర్వహించామని మన సైన్యం ప్రకటించింది. భారత్-మయన్మార్ సైన్యాల మధ్య ఇటువంటి సన్నిహిత సహకారం ఎన్నాళ్లనుంచో ఉన్నదని కూడా చెప్పింది. దాడులు జరిగిన ప్రాంతం మయన్మార్‌లోనిదే అయినా ఆ ప్రాంతంపై అక్కడి ప్రభుత్వానికి ఏనాడూ పట్టులేదు. అక్కడ మిలిటెంట్ వర్గాలదే హవా.



ఇలా పరస్పర సహకారంతో పొరుగుదేశాల భూభాగాల్లో మన దేశం దాడులు నిర్వహించడం ఇది మొదటిసారేమీ కాదు. 2003లో భూటాన్ భూభాగంలో మిలిటెంట్ల స్థావరాలపై ఇలాంటి దాడులే జరిగాయి. 1995లో,  2006లో మయన్మార్‌లోనే మన సైన్యం దాడులు చేసింది. ఆ సందర్భాల్లో పలువురు మిలిటెంట్లను హతమార్చడంతోపాటు వందల సంఖ్యలోమిలిటెంట్లను అదుపులోనికి తీసుకున్నారు.



అయితే, వాటిని బాహాటంగా ప్రచారం చేసుకోవడం, పాక్‌తోసహా మిలిటెంట్లకు ఆశ్రయమిచ్చే దేశాలన్నిటికీ ఇది హెచ్చరికలాంటిదని చెప్పడం ఇదే ప్రథమం. ఉగ్రవాదులకూ, మిలిటెంట్లకూ ఆశ్రయమిచ్చే దేశాల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై మన దేశానికి ఇప్పటికే స్పష్టత ఉంది. అలాంటి దేశాలతో నిరంతర చర్చలద్వారా వాటిని దారికి తీసుకురావడానికి ప్రయత్నించడం, తన విధానాలను మార్చుకోనట్టయితే ఆ దేశంపై అంతర్జాతీయ వేదికలపై ఒత్తిళ్లు తీసుకురావడం వంటివి చేస్తారు.



పాకిస్థాన్ విషయంలో మన దేశం ఇప్పటికే ఈ తరహా మార్గాల్లో ఒత్తిళ్లు తెస్తున్నది. ఆ మార్గాలన్నీ మూసుకుపోయినప్పుడు ఏం చేయాలన్నది వేరే విషయం. అందుకు అంతర్జాతీయంగా అంగీకరించిన విధానాలున్నాయి. ఆ పరిస్థితులేర్పడిన పక్షంలో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలి, అగ్రరాజ్యాలు...అన్నీ రంగంలోకొస్తాయి. అప్పుడు ఎలాంటి పరిష్కారం లభిస్తుందో, దానివల్ల చేకూరే ప్రయోజనం ఎంత అన్నది ఎవరూ చెప్పలేరు.



ప్రపంచ అభీష్టానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ వ్యవహరించదల్చుకుంటే అందుకు ఆ దేశం మూల్యం చెల్లించకతప్పదు. అలాంటి మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుండగా ఇప్పుడు మయన్మార్ దాడుల సందర్భంలో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం,హెచ్చరించడం ఎందుకో అర్థంకాని విషయం. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలో అది చేయడమే వివేకవంతంగా వ్యవహరించడం అవుతుంది తప్ప, ముందే ఉత్సాహంగా ప్రకటనలు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. అది మన వ్యూహాన్ని, మన ఆలోచనలనూ బహిరంగ చర్చకు పెట్టడమే అవుతుంది. అందువల్ల అనవసర రాద్ధాంతం మాత్రమే మిగులుతుంది.



ప్రతి అంశాన్నీ రాజకీయ ప్రయోజనాలతో ముడిపెట్టి ఆలోచించడం, ప్రజలను ఉత్సాహపరిచే ప్రకటనలు చేయడం ఎంతవరకూ అవసరమో ఆలోచించాల్సి ఉంది. మంత్రి ప్రకటనవల్ల సహజంగానే మాటల యుద్ధం బయల్దేరింది. చూస్తూ ఊరుకోవడానికి తమ దేశం మయన్మార్ కాదని పాక్ బదులిచ్చింది. పాకిస్థాన్ ప్రాపకంతో సాగే ఉగ్రవాదం వల్ల మన దేశం ఎంత నష్టపోయిందో ప్రపంచానికంతకూ తెలుసు. 2008లో ముంబైపై దాడి జరిపి ఉగ్రవాదులు సాగించిన ఊచకోతకు సంబంధించి హఫీజ్ సయీద్ వంటివారిని వెంటనే అప్పగించాలని మన దేశం పాకిస్థాన్‌ను కోరుతూనే ఉంది. అందుకు సంబంధించి అవసరమైన సాక్ష్యాధారాలను మన దేశం అందజేసింది. అవి అసమగ్రంగా ఉన్నాయని, వాటికి విలువలేదని పాక్ వాదిస్తోంది.



అలాగే దావూద్ ఇబ్రహీం ఇప్పటికీ పాక్‌లోనే తలదాచుకున్నాడని మన దేశం చెబుతుంటే లేనేలేడని ఆ దేశం బుకాయిస్తున్నది. అటు అమెరికా ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోంది. ఉగ్రవాదానికి పాకిస్థాన్ నారూ నీరూ పోస్తున్న తీరు తెలిసినా ఆ దేశానికి ఆయుధాలు అమ్మడం, ఆర్థిక సాయం చేయడం మానుకోలేదు. కేవలం తన ప్రయోజనాలు చూసుకోవడం తప్ప వాస్తవాలేమిటో ఆలోచించి ప్రవర్తించడంలేదు. సమస్యలు చాలా ఉన్నాయి. అయితే పరిష్కారాలు వెదకడం, వాటిని చాకచక్యంగా అమలు చేయడంలో ఎంతో పరిణతిని ప్రదర్శించాలి. లేనట్టయితే ఎప్పటికీ బాధితులుగా మిగులుతాం.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top