అధికారుల నెత్తిన దీక్షాభారం | YSRCP leaders fire on TDP govt | Sakshi
Sakshi News home page

అధికారుల నెత్తిన దీక్షాభారం

Jun 9 2016 9:29 AM | Updated on May 25 2018 9:20 PM

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు.

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి విమర్శించారు. ఇచ్చిన హామీలను ఏ కారణం చేత అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వంపై జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీసు స్టేషన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బుధవారం ఫిర్యాదులు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ‘బాబు’ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
 
 అతిథులకు స్నాక్స్... హాజరై న వారికి భోజనాలు... వేదిక నిర్వహణ ఖర్చులు కలిపి సుమారు ఏడు లక్షల రూపాయలు! ఇది ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గంలో లెక్క తేలిన ఖర్చు. ఈ భారం భరించింది ప్రభుత్వమో, మంత్రులో కాదు! అదంతా రెవెన్యూ, నగరపాలక సంస్థ, మెప్మా, ఇతర శాఖల అధికారులు. ఇలా జిల్లాలోని మిగతా నియోజకవర్గాల్లోనూ సుమారు రెండు లక్షల రూపాయలు  చొప్పున చేతిచమురు వదిలినట్లు అధికారుల మాటలను బట్టి తెలుస్తోంది. ఇదీ ఈ నెల రెండో తేదీ నుంచి బుధవారం వరకూ జరిగిన నవనిర్మాణ దీక్షల ఫలితం! అన్ని నియోజకవర్గాల్లోనూ వారం రోజుల పాటు దీక్షలు, రోజుకో అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పిన ప్రభుత్వం... అందుకోసం అయ్యే ఖర్చుల కోసం పైసా కూడా విదల్చలేదు.  దీంతో తమ జేబులకు పడిన చిల్లులను ఎలా పూడ్చుకోవాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు గడిచిపోయింది. ఈ విభజనతో జరిగిన నష్టాలపై నవనిర్మాణ దీక్ష కార్యక్రమం పేరుతో రోజుకొక అంశాలన్ని తీసుకొని చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ రెండేళ్లలో జిల్లాలో ఎలాంటి ప్రగతి కనిపించకపోయినా పాత హామీలన్నీ నెరవేర్చాశామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మస్తుతికి, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై పరనింద వేయడానికి పరిమితమయ్యారు.  క్షేత్రస్థాయిలో ప్రజ లు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆసక్తి చూపలే దు. దీంతో అధికారుల ఒత్తిడి మేరకు చిరుద్యోగులు, డ్వాక్రా మహిళలు, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడి వర్కర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బందే విధిలేని పరిస్థితుల్లో హాజరయ్యారు. మంత్రులు హాజరైన సభలకు మాత్రం టీడీపీ కార్యకర్తల హడావుడి కనిపించింది.
 
 అఖరి రోజు అట్టర్‌ఫ్లాప్!
 నవనిర్మాణ దీక్షల్లో చివరి రోజైన మహాసంకల్ప దీక్షకు ప్రజాదరణ కరువైంది. జిల్లా కేంద్రంలోని కోడి రామమూర్తి స్టేడియంలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీకాకుళంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలను బస్సులు పెట్టి మరీ తరలించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం 4.30 గంటల సమయంలో జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగం ప్రారంభించే సమయానికి ఒక్కొక్కరు సభ నుంచి లేచివెళ్లిపోవడం మొదలైంది. ఆ తర్వాత 5 గంటకు తెరపై ముఖ్యమంత్రి ప్రసంగం ప్రారంభించే సమయానికి అది మరింత ఎక్కువైంది. సభలో ప్రజలు కనిపించకపోయేసరికి కంగారుపడిన అధికారులు వారిని ఆపాలని పోలీసులకు సూచించారు. వారు ప్రధాన గేట్లను మూసేశారు. అయినా చాలామంది గోడలు దూకి వెళ్లిపోయారు.
 
 కష్టమే మిగిలింది
 ఎంతకష్టపడిన ఫలితం దక్కలేదని పలువురు అధికారులు వాపోతున్నారు. శ్రీకాకుళం రూరల్, గార మండలాల నుంచి పదేసి బస్సుల్లో మహిళలను తరలించారు. అలాగే శ్రీకాకుళం నగరం నుంచి డ్వాక్రా మహిళలను తీసుకురావడానికి మెప్మా, నగరపాలక సంస్థ అధికారులు అష్టకష్టాలు పడ్డారు. ఏది ఏమైనా చివరిరోజు మహాసంకల్పదీక్షను విజయవంతం చేయాలని దాదాపుగా రూ.5 లక్షల వరకూ ఖర్చు చేశారు. తీరా సీఎం ప్రసంగం మొదలయ్యే సమయానికి వేదిక వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులే మిగలడం కొసమెరుపు.
 
  భారం ఎవ్వరిది
 ఏడు రోజుల పాటు జిల్లా కేంద్రంతో పాటు పది నియోజకవర్గాల్లో నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం కార్యక్రమాలకు అయ్యే ఖర్చును పూర్తిగా అధికారులే భరించారు. వేదిక వద్ద షామియానాలు, కుర్చీలు, మెక్‌లు, లైటింగ్ వగైరా ఖర్చుతో పాటు అతిథులకు స్నాక్స్, హాజరైనవారికి భోజనాలు ఇలా జిల్లా మొత్తం మీద రూ.25 లక్షల వరకూ ఖర్చు అయ్యిందని అధికారుల అంచనా. అయితే ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు మంజూరుకాలేదు. దీంతో ఈ భారం ఎవ్వరిపై వేయాలనే విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement