యువతిపై పెళ్లి పేరుతో నయవంచన! | Sakshi
Sakshi News home page

యువతిపై పెళ్లి పేరుతో నయవంచన!

Published Sun, Feb 7 2016 5:57 PM

యువతిపై పెళ్లి పేరుతో నయవంచన! - Sakshi

= ఓ యువతిపై పెళ్లి పేరుతో వేర్వేరుగా ఇద్దరు యువకుల లైంగిక దాడి
 = గర్భం దాల్చిన తర్వాత పెళ్లి చేసుకోకుండా మోసం చేసిన మృగాళ్లు
 = అప్పటికే భర్త వదిలేయడంతో మేనమామ ఇంటి వద్దే ఉంటున్న బాధితురాలు
 = పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి.. నిందితుల అరెస్టు
 = ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైంగిక దాడి కేసుల నమోదు
 = బాధితురాలిని విచారించిన దర్శి డీఎస్పీ

 
 ఆ యువతికి తల్లిదండ్రులు లేరు. పెంచిన తాత, నాయనమ్మలూ కాలం చేశారు. చివరకు తన తోబుట్టువులతో కలిసి మేనమామ పంచన చేరింది. ఆయన అన్నీ తానై ముగ్గురు మేనకోడళ్లు, మేనల్లుడిని పెంచి పెద్ద చేశాడు. పెద్ద మేనకోడలిని ఓ యువకుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అంత వరకూ బాగానే ఉంది. కొద్ది కాలం తర్వాత భర్త వదిలేయడంతో పెద్ద మేనకోడలు మళ్లీ మేనమామ ఇంటికే వచ్చి తలదాచుకుంటోంది. అక్కడ ఇద్దరు యువకులు ఆమెపై కన్నేసి పెళ్లి ఆశ చూపి వేర్వేరుగా లైంగిక దాడులకు పాల్పడ్డారు. చివరకు గర్భం దాల్చడంతో ఇద్దరూ ముఖం చాటేశారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను కటకటాల వెనక్కి నెట్టారు.         

గుంటూరు జిల్లా నకిరికల్లు మండలానికి చెందిన యువతికి చిన్న వయసులోనే తల్లిదండ్రులు, కొద్ది కాలం తర్వాత తాతయ్య, నాయనమ్మలు మరణించారు. ఆమెకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. స్వగ్రామంలోనా అన్న వారు లేక అనాథలుగా మిగిలారు. అద్దంకి మండలం చక్రాయపాలెంలో ఉంటున్న మేనమామ ఆ నలుగురినీ తన ఇంట్లో ఉంచుకుని పెంచి పెద్ద చేశాడు. ఇద్దరు మేనకోడళ్లకు పెళ్లి కూడా చేశాడు. మూడో మేనకోడలు గుంటూరులో చదువుకుంటోంది. మేనల్లుడు హైదరాబాద్‌లో బేలుదారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మనస్పర్థలు వచ్చి పెద్ద మేనకోడలిని ఆమె భర్త వదిలేశాడు. ఆ తర్వాత నుంచీ మళ్లీ చక్రాయపాలెంలోని మేనమామ వద్దే ఉంటోంది. కందిపప్పు మిల్లులో కూలీనాలి చేసుకుంటూ జీవిస్తోంది.

 కాటేసిన కామాంధులు
 ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం గ్రామానికి చెందిన గంగాధర్, పేరయ్యల కన్ను భర్త వదిలేసిన ఆమెపై పడింది. ఎవరికి వారు తాము వివాహం చేసుకుంటామంటూ ఆశ చూపి వేర్వేరుగా పశువాంఛ తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలు గర్భం ధరించడంతో ఇద్దరూ ముఖం చాటేశారు. తీవ్ర ఆవేదనకు లోనైన బాధితురాలు నేరుగా వెళ్లి అద్దంకి పోలీసులకు తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేసినట్లు దర్శి డీఎస్పీ శ్రీరాంబాబు తెలిపారు. వారిపై లైంగిక దాడి, అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరూ లేకపోవడంతో పాటు గర్భం ధరించి ఉండటంతో బాధితురాలిని ఐసీడీఎస్ అధికారులకు అప్పగించనున్నట్లు వివ రించారు. ఆమెను డీఎస్పీ పాటు తహశీల్దార్ అశోక్‌వర్థన్ విచారించారు. ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్లు, వీఆర్‌వో ఉన్నారు.
 

Advertisement
Advertisement