
మద్యం దుకాణాల ఏర్పాటుపై మహిళల సమరం
జనావాసాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేసి, మహిళల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వైఎస్సార్‌సీపీ 39వ డివిజన్ కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి మండిపడ్డారు.
- నడిమివంకలో మద్యంషాపుల ఎదుట ఆందోళన
- వంటావార్పుకు యత్నం, మహిళా నాయకులు అరెస్ట్
అనంతపురం సెంట్రల్: జనావాసాల్లో మద్యం షాపులు ఏర్పాటు చేసి, మహిళల మనోభావాలు దెబ్బతీస్తున్నారని వైఎస్సార్‌సీపీ 39వ డివిజన్ కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రి మండిపడ్డారు. ఆదివారం నడిమివంకలో మద్యం షాపుల ఎదుట 13 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దాదాపు రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. శాశ్వతంగా తొలగించేవరకూ ఆందోళన విరమించేదిలేదని భీష్మించుకూర్చున్నారు. వంటావార్పు చేసిన నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో పోలీసులు జోక్యం చేసుకొని అరెస్ట్ చేసి నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానిక కార్పొరేటర్ సుశీలమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రమ్మ మాట్లాడుతూ మద్యం షాపుల వల్ల స్థానిక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. నెలరోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల మహిళలు అటుగా వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
వెంటనే జనావాసాలు, గుడి, బడి, బస్టాండ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ మల్లికార్జునవర్మ ఆందోళనకారులతో చర్చించారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మిదేవి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శి వరలక్ష్మి, పద్మావతి, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నాయకులు శ్రీదేవి, కార్పొరేటర్ హిమబిందు, భూలక్ష్మి, డీఓడబ్ల్యూవో జిల్లా కార్యదర్శి హేమలత, ఆవాజ్ నాయకులు వలి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు సూర్యచంద్ర, రమేష్, డీఎవైఎఫ్‌ఐ నాయకులు ఆంజనేయులు, నూరుల్లా, ఎపీరైతు సంఘం నాయకులు సరస్వతి, జేవీవీ నాయకులు ప్రసాద్, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.