‘అనంత’లో ఉద్రిక్తత | varadapuram suri at sp banglaw | Sakshi
Sakshi News home page

‘అనంత’లో ఉద్రిక్తత

Mar 11 2017 11:35 PM | Updated on Sep 5 2017 5:49 AM

‘అనంత’లో ఉద్రిక్తత

‘అనంత’లో ఉద్రిక్తత

తన నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత అనుచరుల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) ఆందోళనకు దిగారు.

– ఎస్పీ బంగ్లా ఎదుట ధర్మవరం ఎమ్మెల్యే ఆందోళన
– మంత్రి పరిటాల సునీత అనుచరులు, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తమవారిని కొట్టారంటూ ఆరోపణ
– ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డిలను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌

 
అనంతపురం సెంట్రల్‌ : తన నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత అనుచరుల ఆగడాలు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) ఆందోళనకు దిగారు. తన అనుచరులతో కలిసి శనివారం అనంతపురంలో ఎస్పీ బంగ్లా (క్యాంపు కార్యాలయం) ఎదుట బైఠాయించారు. ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో పాటు భారీగా సిబ్బందిని మోహరించారు. వజ్రా, వాటర్‌క్యాన్‌ వాహనాలనూ సిద్ధంగా ఉంచారు.

వందలాది మంది కార్యకర్తలు, ధర్మవరంలో శుక్రవారం జరిగిన ఘర్షణలో గాయపడిన తన అనుచరులతో కలిసి ఎస్పీ బంగ్లా ఎదుట బైఠాయించిన వరదాపురం.. మంత్రి సునీత, పోలీసుల తీరుపై మండిపడ్డారు. ధర్మవరం చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. ఒకే ఘటనలో దాదాపు వంద మంది తమ పార్టీ కార్యకర్తలు, నాయకులు, వార్డు కౌన్సిలర్‌ గాయపడి ఆస్పత్రుల పాలయ్యారన్నారు. చిగిచెర్ల రోడ్డు వద్ద తమపార్టీ నాయకులు చేపడుతున్న పనులకు మంత్రి పరిటాల సునీత అనుచరులు అడ్డు తగులుతున్నారని చెప్పడంతో తాను వెళ్లి సర్ది చెప్పానన్నారు. తర్వాత దాదాపు 200 మంది మంత్రి పరిటాల సునీత, శ్రీరాం అనుచరులు వచ్చి తమ వారిపై విచక్షణారహితంగా దాడి చేశారన్నారు.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు కూడా కొట్టారన్నారు. మంత్రి అనుచరులు, పోలీసులు కలిసి ఉద్దేశపూర్వకంగానే తమవారిపై దాడి చేశారని ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నాయకుల తరహాలో ధర్నా చేయాల్సి వస్తోందన్నారు.  ఈ విషయాన్ని సీఎం దృష్టికి కూడా తీసుకుపోతామన్నారు. ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్, ఎస్‌ఐ రాజశేఖరరెడ్డిలను సస్పెండ్‌ చేయాలని,  పరిటాల అనుచరులను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. ఎస్పీ స్పందిస్తూ ధర్మవరం ఘటనపై విచారణ చేయిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

ధర్మవరంలో 144 సెక‌్షన్‌
ధర్మవరంటౌన్ :మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే సూరి అనుచరుల మధ్య ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ధర్మవరంలో ఈ నెల 21వ తేదీ వరకు 144 సెక‌్షన్‌ అమలు చేస్తున్నారు.  పట్టణ శివారు ప్రాంతాలు, ప్రధాన వీధుల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. గుంపులుగా అనుమానితులు ఎవరైనా తిరుగుతుంటే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement