
సీటు కోసం పట్టు
మున్సిపల్ చైర్మన్ పదవి పంచాయతీ మరో సారి సీఎం వద్ద జరుగనుంది.
► మున్సిపల్ చైర్మన్ పదవికి పోటాపోటీ
► టీడీపీలో వర్గపోరు
► పంచాయితీని సీఎం వద్దకు తీసుకెళ్లేందుకు యత్నం
ప్రొద్దుటూరు టౌన్: మున్సిపల్ చైర్మన్ పదవి పంచాయతీ మరో సారి సీఎం వద్ద జరుగనుంది. ఈ నెల 10న ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి వస్తున్న ముఖ్యమంత్రి వద్ద పార్టీ పెద్దలు చర్చించనున్నారు. టీడీపీలో లింగారెడ్డి, వరద వర్గాలుగా ఏర్పడిన కౌన్సిలర్లు చైర్మన్ సీటు కోసం పోటీ పడటంతో ఇప్పటికే ఆసం రఘురామిరెడ్డి పేరు ప్రకటించినా ఆయనకు పదవి దక్కుతుందో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోటీలో నేను కూడా ఉన్నానంటూ వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి చేరిన ముక్తియార్ ప్రకటించడం, 12 మంది కౌన్సిలర్లతో శిబిరానికి వెళ్లడంతో పోటీ తప్పలేదు. అయితే ముక్తియార్‌కే ఎక్కువ మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటిస్తుండటంతో పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి ఎవరిని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినా 15 మంది కౌన్సిలర్లు తాము మద్దతు ఇవ్వమని స్పష్టం చేసిన నేపథ్యంలో అధిష్ఠానం ఎలా వ్యవహరిస్తుందో వేచి చూడాల్సిందే. ముక్తియార్ టీడీపీని వీడాల్సిన పరిస్థితుల్లోనే పోటీలో ఉంటాడు తప్ప పార్టీలో ఉండి పోటీకి అధిష్ఠానం ఒప్పుకోదని వరద వర్గీయ కౌన్సిలర్లు చెబుతున్నారు.
శిబిరం ఏర్పాటుపై చర్చ: ముక్తియార్ మాట్లాడి వెళ్లిన తర్వాత వీరు ఎంపీతో చైర్మన్ పదవిపై చర్చించారు. ముక్తియార్ ఇప్పటికే 12 మంది కౌన్సిలర్లను శిబిరానికి పిలుచుకెళ్లడంపై ఆయనతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఈనెల 10న జిల్లాకు వస్తారని, అప్పుడు ఈ విషయంపై చర్చించి తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని ఎంపీ చెప్పినట్లు తెలిసింది.
ముక్తియార్ శిబిరంలోకి మరో నలుగురు కౌన్సిలర్లు: ముక్తియార్ వర్గంలోకి మరో నలుగురు కౌన్సిలర్లు వెళ్లేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే కౌన్సిలర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో ముక్తియార్‌కు పూర్తి స్థాయిలో మెజారిటీ దక్కనుంది.
ఎంపీ రమేశ్‌ను కలిసిన ముక్తియార్, ఆసం..: శనివారం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి, విఎస్ ముక్తియార్ పోట్లదుర్తిలో ఎంపీ రమేష్‌నాయుడును కలిసి చైర్మన్ పదవిపై చర్చించారు. ముక్తియార్ పోటీలో ఉన్నాడన్న విషయంపై మాట్లాడినట్లు సమాచారం. వరదరాజులరెడ్డి కాంగ్రెస్‌పార్టీలో ఉండి టీడీపీలో చేరిన వారిని తప్ప ఏళ్ల తరబడి టీడీపీలో ఉన్న వారిని కలుపుకొని వెళ్లడం లేదని, ఎంతకాలం ఇలా పార్టీలో ఉండాలని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే వీరు అక్కడ ఉండగానే రెండో చైర్మన్ అభ్యర్థిగా ఉన్న ఆసం రఘురామిరెడ్డి, మున్సిపల్ ఇన్‌చార్జి చైర్మన్ వైఎస్ జబీవుల్లాతోపాటు ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లు పోట్లదుర్తికి వెళ్లారు. మరికొంత మంది కౌన్సిలర్లను పిలవగా మేము రామని ఆసంతో చెప్పడం చూస్తుంటే అసలు వరదరాజులరెడ్డి వర్గంలో ఎంత మంది కౌన్సిలర్లు ఆసంకు మద్దతుగా ఉన్నారనే విషయం తెలియడం లేదు.