ఏం చేద్దాం.., అసలు ఏమైతాంది...?

ఏం చేద్దాం.., అసలు ఏమైతాంది...? - Sakshi


*జిల్లా కాంగ్రెస్‌ పరిణామాలపై జానా, రాజగోపాల్‌ సమాలోచనలు

*వెంకట్‌రెడ్డి, గుత్తా వ్యవహారంపై చర్చ

*రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై కూడా..4 గంటలపాటు సుదీర్ఘ మంతనాలు

*ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడేది లేదన్న ఎమ్మెల్సీ

*త్వరలోనే అధినేత్రి సోనియా వద్దకు..




సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మరో మలుపు తిరిగాయి. వారం రోజులుగా పార్టీని కుదిపేస్తున్న అంశాలపై ఆ పార్టీ సీనియర్‌ నేతలు కె.జానారెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు మంగళవారం సమాలోచనలు చేశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ రాజగోపాల్‌ నివాసానికి వెళ్లిన కాంగ్రెస్‌ శాసన సభాపక్ష (సీఎల్పీ)నేత జానారెడ్డి దాదాపు నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పార్టీ మారుతున్న వార్తలతో పాటు రెండు, మూడు రోజులుగా సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తున్న సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఇద్దరు నేతల జిల్లాలో జరుగుతున్న పరిణామాలతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతంపై చర్చించినట్లు తెలుస్తోంది.



అసలు ఏమైతాంది...



వాస్తవానికి వారం రోజులుగా జిల్లా కాంగ్రెస్‌ అట్టుడికిపోతోంది. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే ఎపిసోడ్‌తోపాటు ఉన్నట్టుండి తెరమీదకొచ్చిన నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వ్యాఖ్యలు, ఆయనకు షోకాజ్‌ జారీ అంశాలు పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. సుఖేందర్‌రెడ్డి పార్టీ వీడడం దాదాపు ఖాయమేనని, కోమటిరెడ్డి కూడా పార్టీతో అమీతుమీ తేల్చుకునేందుకే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ను టార్గెట్‌ చేస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల పర్యవసానం ఎలా ఉంటుందన్న దానిపై జానా, రాజగోపాల్‌రెడ్డి చర్చించారు. ఎవరు ఉన్నా... ఎవరు వెళ్లిపోయినా కాంగ్రెస్‌ పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యతను తీసుకోవాలని ఇరువురు నేతలు ఈ భేటిలో ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ ఓటు బ్యాంకును కాపాడే దిశగా భవిష్యత్‌లో అడుగులు వేయాలని, ఇటు జిల్లాలోను, అటు రాష్ట్రంలోనూ అందరు నేతలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని.. అందుకోసం తామే పెద్దన్న పాత్ర పోషించాలని ఇద్దరు నేతలు మాట్లాడుకున్నట్లు సమాచారం. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్‌ నోటీసుల జారీ గురించి కూడా మాట్లాడిన నేతలు అన్ని విషయాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.



త్వరలోనే ఢిల్లీకి రాజగోపాల్‌



జిల్లాతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ వ్యవహారాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కూడా కలిసి అన్ని పరిస్థితులను వివరించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. జానాతో భేటి నుంచే ఢిల్లీ పార్టీ పెద్దలకు ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, జానాతో భేటి సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌ కూడా పార్టీ మారే అంశం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా రాజగోపాల్‌ మాట్లాడుతూ తాము ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వీడి వెళ్లేది లేదని, ఎన్ని కష్టాలు వచ్చినా, పార్టీని కాపాడుకుంటానని, పార్టీ కోసమే పనిచేస్తానని, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని కుండబద్దలు కొట్టినట్టు సమాచారం.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top