ఉపాధికి దారి ఇది.. | This is the way for employment | Sakshi
Sakshi News home page

ఉపాధికి దారి ఇది..

Oct 16 2016 11:02 PM | Updated on Sep 4 2017 5:25 PM

ఉపాధికి దారి ఇది..

ఉపాధికి దారి ఇది..

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని వృతి నైపుణ్యతా శిక్షణా కేంద్రం నిరుద్యోగులకు వరంలా మారింది.

ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని వృతి నైపుణ్యతా శిక్షణా కేంద్రం నిరుద్యోగులకు వరంలా  మారింది. రాజధాని పేరుతో పంట భూములన్నీ లాక్కున్న ప్రభుత్వం.. నిరుద్యోగులకు శిక్షణ.. ఆపై ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసగించింది. ఈ నేపథ్యంలో జీవిత గమ్యం తెలియక అయోమయంలో ఉన్న రాజధాని నిరుద్యోగులకు ఈ కేంద్రం పూలబాట వేస్తోంది. ఉచితంగా శిక్షణతో పాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దుతోంది.
 
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని కోసం పంట భూములను ఇచ్చిన రైతు కుటుంబాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. వృత్తి నైపుణ్యతా కేంద్రాల ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పిన మాట మరిచిపోయింది. ఈ నేపథ్యంలో ఉపాధి లేక వలసపోతున్న నిరుద్యోగులకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండగా నిలుస్తోంది. వృత్తి నైపుణ్యతా కేంద్రం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. రాజధాని ప్రాంత నిరుద్యోగ యువతకు పలు కంపెనీల సహకారంతో శిక్షణ ఇప్పించడంతో పాటు వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. 
 
రాజధాని ప్రాంత నిరుద్యోగుల కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత ఏడాది స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ప్రారంభించారు. వర్సిటీలోని వాణిజ్య భవనంలో గదులను ఈ కోర్సులకు కేటాయించారు. బీటెక్, ఎంటెక్‌ చదివిన విద్యార్థులతో పాటు పదో తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు వారి చదువును బట్టి వృత్తి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. బీటెక్, ఎంటెక్‌ విద్యార్థులకు విజయవాడలోని ఎఫ్రా్టనిక్స్‌ కొలబోరేషన్‌ కంపెనీతో ఒప్పందం చేసుకుని వారికి శిక్షణ ఇచ్చేలా చేశారు. ఆ కంపెనీకి అవసరమైన టెక్నికల్‌ కోర్సులు సిగ్నలింగ్, ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ టెక్నాలజీ, పీసీబీ డిసెగ్నేషన్, ఎల్‌ఈడీ లైట్‌ టెస్టింగ్, ఇంటర్నెట్‌ థింగ్స్, సిగ్నలింగ్‌ టెలికామ్‌ సెంటర్స్, ఇన్‌స్టాలేషన్‌–సర్వీసింగ్‌ స్కిల్స్, త్రీడీ డెషన్, డిజిటల్‌ మార్కెటింగ్, యాప్‌ డెవలప్‌మెంట్‌ వంటి కోర్సుల్లో ఆరు నెలలు శిక్షణ ఇచ్చి ఆ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. గత ఏడాది 32 మంది విద్యార్థులు శిక్షణ పొందగా, అందులో 20 మందికి ఉద్యోగం ఇచ్చారు. మిగిలిన వారు సర్టిఫికెట్‌ తీసుకుని ఇతర కంపెనీల్లో మెరుగైన జీతం కోసం వెళ్లారు. అలాగే, పదో తరగతి, ఇంటర్‌ చదివిన 10 మందికి అపోలో ఆస్పత్రిలో ఉద్యోగాలు కల్పించారు. లైఫ్‌ సైన్స్‌లో డిగ్రీ చదివిన 10మంది విద్యార్థులకు ఆక్వా కల్చర్‌ టెక్నీషియన్స్‌గా శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించారు. డాన్‌బాస్కో టెక్నికల్‌ స్కూల్‌తో ఒప్పందం చేసుకుని మహిళలకు కుట్టు మిషన్లు, డీటీపీ, గార్మెంట్‌ మేకింగ్‌ కోర్సుల్లో తర్ఫీదు ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తున్నారు. డీజిల్, పెట్రోల్‌ ఇంజన్‌ మెకానిక్, హౌస్‌ వైరింగ్, మోటర్‌ వైండింగ్‌ కోర్సుల్లో శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
 
ప్రోత్సాహం కరువు..
రాజధాని ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతో విఫలమైన చంద్రబాబు సర్కార్‌... నాగార్జున యూనివర్సిటీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులను ప్రోత్సహించడంలోనూ విఫలమైంది. ప్రభుత్వ తోడ్పాటు లేకుండానే సొంతంగా నిరుద్యోగులకు వృత్తి నైపుణ్య శిక్షణా తరగతులు ప్రారంభించిన వర్సిటీతో ఇటీవలే ప్రభుత్వ పెద్దలు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. యువతకు ఉపాధి ప్రోత్సాహం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ అధికారులు చెప్పారు. రెండో ఏడాది శిక్షణకు సిద్ధమవుతున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి చొరవ చూపలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement