కరువు మేఘం | Sakshi
Sakshi News home page

కరువు మేఘం

Published Tue, Aug 8 2017 10:43 PM

కరువు మేఘం - Sakshi

  • ముఖం చాటేసిన వరుణుడు
  • అరకొరగానే ప్రధాన పంటల సాగు
  • ‘ప్రత్యామ్నాయం’ ఏర్పాట్లలో వెనుకంజ
  • వర్షం వస్తే అందుబాటులో లేని విత్తనం
  • కాలయాపన చేస్తున్న వ్యవసాయ శాఖ
  • రైతుల్లో సన్నగిల్లుతున్న సాగు ఆశలు 
  •  

    ఖరీఫ్‌ సాధారణ సాగు                     : 8.01 లక్షల హెక్టార్లు

    ఆగస్టు 7 నాటికి సాగు             : 2.54 లక్షల హెక్టార్లు

     

    వేరుశనగ సాధారణ సాగు          : 06.04 లక్షల హెక్టార్లు

    ఇప్పటి వరకుచేపట్టిన సాగు        : 02.08 లక్షల హెక్టార్లు

    ప్రత్యామ్నాయ పంటల సాగు అంచనా             : 05.36 లక్షల హెక్టార్లు

    అవసరమైన ప్రత్యామ్నాయ విత్తనాలు              : 48,942 క్వింటాళ్లు

     

    అనంతపురం అగ్రికల్చర్‌:

    కరువు మేఘం జిల్లాను కమ్మేస్తోంది. వర్షాలు విస్తారంగా కురవాల్సిన సమయంలో వరుణుడు ముఖం చాటేశాడు. నైరుతి రుతు పవనాల జాడలేకపోగా.. అల్పపీడనం కూడా కన్నెత్తి చూడని పరిస్థితి. ఫలితంగా చినుకు పడటం గగనమవుతోంది. కురిసిన అరకొర వర్షానికి అక్కడక్కడ విత్తు వేసినా.. 40 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత, 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు మొలకలు ఎండిపోతున్నాయి. రక్షకతడి పేరిట  రాష్ట్ర ప్రభుత్వం హడావుడి చేస్తున్నా.. నీళ్లు లేకపోవడంతో ఒక్క ఎకరాను కూడా కాపాడే పరిస్థితి లేదని తెలుస్తోంది. మొత్తం మీద ఖరీఫ్‌లో ప్రధాన పంటల సాగు పడకేయగా.. ప్రత్యామ్నాయం కనుచూపు మేరలో కనిపించట్లేదు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంటోంది.

     

    32 శాతం లోటు వర్షపాతం

    తొలకరి వర్షాలతో ఖరీఫ్‌ ఆశాజనకంగా ప్రారంభమైనా అది ఎక్కువ కాలం కొనసాగకపోవడంతో ఖరీఫ్‌ సాగు కల్లోలంగా తయారైంది. జూన్‌ నెల సాధారణ వర్షాపాతం 63.9 మి.మీ., కాగా.. 59.2 మి.మీ వర్షం కురిసింది. అది కూడా నైరుతి రుతు పవనాలు రాకమునుపే. ఆ తర్వాత వర్షాలు మొహం చాటేశాయి. పంటల సాగుకు కీలకమైన జూలై నెలలో 67.4 మి.మీ., గాను 54 శాతం తక్కువగా కేవలం 31 మి.మీ వర్షం పడింది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 88.7 మి.మీ కాగా.. ఇప్పటి వరకు 11 మి.మీ మాత్రమే కురిసింది. మొత్తం మీద ఇప్పటివరకు 148 మి.మీ గానూ 102 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే ఇప్పటి వరకు 32 శాతం లోటు వర్షపాతం ఉంది. 42 మండలాల్లో సాధారణం కన్నా తక్కువగా వర్షాలు కురిశాయి. కేవలం నాలుగు మండలాల్లో మాత్రమే సాధారణం కన్నా కాస్త ఎక్కువ వర్షం పడగా.. మిగతా 17 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది.

     

    2.54 లక్షల హెక్టార్లకు పరిమితం

    జూన్, జూలైలో కురిసిన అరకొర వర్షాలకు 8.01 లక్షల హెక్టార్ల సాధారణ సాగులో ఇప్పటి వరకు 2.54 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో 6.04 లక్షల హెక్టార్లలో వేయాల్సిన వేరుశనగ 2.08 లక్షల హెక్టార్ల వద్ద నిలిచిపోయింది. కంది 12 వేల హెక్టార్లు, పత్తి 10వేల హెక్టార్లు, ఆముదం 6వేల హెక్టార్లు, మిగతా పంటలు మరో 15వేల హెక్టార్లలో సాగైనట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. మిగతా 5.47 లక్షల హెక్టార్లు పంటలు వేయలేక బీళ్లుగా ఉండిపోయాయి.

     

    ఎక్కడ ప్రత్యామ్నాయ విత్తనాలు

    వరుణ దేవుడు దయతలచి వర్షం కురిపిస్తే ఇప్పటికిప్పుడు పంటలు సాగు చేయడానికి ప్రత్యామ్నాయ విత్తనాలు అందుబాటులో లేవు. ఈ నెల ఒకటోతేదీ నుంచి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమల్లోకి వచ్చిందని స్వయంగా వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ సెలవిచ్చినా... ఆచరణలో విఫలమయ్యారు. 5.36 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన 48,942 క్వింటాళ్లు ప్రత్యామ్నాయ విత్తనాలు 75 శాతం రాయితీతో ఇస్తామని చెప్పినా.. ఒక క్వింటా కూడా జిల్లాకు సరఫరా కాలేదు. కనీసం వాటి ధరలు, రాయితీలు కూడా ప్రకటించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో వర్షం వస్తే ప్రత్యామ్నాయం కూడా ముందుకు సాగే పరిస్థితి లేదనేది స్పష్టమవుతోంది.

     

    అందుబాటులో కందులు - పీవీ శ్రీరామమూర్తి, వ్యవసాయశాఖ జేడీ

    ప్రస్తుతం కందులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన విత్తనాలు రెండు మూడు రోజుల్లో సరఫరా అయ్యే అవకాశం ఉంది.

     

Advertisement
 
Advertisement
 
Advertisement