నట్టేట ‘ముంచిన’ టీ! | six members died in flood water | Sakshi
Sakshi News home page

నట్టేట ‘ముంచిన’ టీ!

Oct 1 2016 10:42 PM | Updated on Aug 14 2018 3:22 PM

రాజు ఇంటి వద్ద విషాదం - Sakshi

రాజు ఇంటి వద్ద విషాదం

చిన్నారుల కేరింతలతో ఆ ఇల్లు ఎంతో సందడిగా ఉంది.. తల్లి వంటింట్లో పిల్లల కోసం టీ చేస్తోంది.. ఇంట్లోని ఐదుగురు చిన్నారులు ఆటపాటల్లో మునిగారు.

ఐదుగురు చిన్నారులు, తల్లి జల సమాధి
వరద నీటిలో కొట్టుకుపోయిన కుటుంబం
కారులో ఆస్పత్రికి వెళుతుండగా దుర్ఘటన
తడ్కల్‌లో విషాద ఘటన
ఇంటికి నేనెలా వెళ్లేది: పిల్లల తండ్రి రాజు రోదన

కంగ్టి: చిన్నారుల కేరింతలతో ఆ ఇల్లు ఎంతో సందడిగా ఉంది.. తల్లి వంటింట్లో పిల్లల కోసం టీ చేస్తోంది.. ఇంట్లోని ఐదుగురు చిన్నారులు ఆటపాటల్లో మునిగారు. తల్లి టీ వేడివేడిగా తీసుకువచ్చి గ్లాస్‌ల్లో పోస్తోంది.. పిల్లలంతా ఒకే చోటుకుచేరుకున్నారు.. అంతలోనే తొట్లెలో ఉన్న 13 నెలల పసికందు టీ గిన్నెపై పడటంతో శరీరం కాలింది.. తల్లి తల్లడిల్లింది.. చేసేదిలేక ఉన్న పళంగా కారులో పిల్లలందరినీ తీసుకుని ఆస్పత్రికి బయలుదేరింది.. మార్గమధ్యంలో నిజామాబాద్‌ జిల్లా పిట్లం మండలంలోని పిల్లివాగులో నీటి ఉధృతికి తల్లి, ఐదుగురు పిల్లలు కొట్టుకుపోయారు. తీరని శోకం మిగిలింది.

కంగ్టి మండలం తడ్కల్‌కు చెందిన రాజు విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌గా రేగోడ్‌ మండలంలో పనిచేస్తున్నారు. అతని భార్య  భార్య రాజమణి(35), ఐదుగురు కూతుళ్లు ప్రియా(7) జ్యోతి(6), జ్ఞాన హంసిక (3), జ్ఞాన సమిత (3)(కవలలు), దీపాంక్ష(13 నెలలు) ఈ దుర్ఘటనలో జలసమాధి అయ్యారు.  

నేనవరి కోసం ఇంటికి వెళ్లాలి
‘పిల్లలను గారాబంగా పెంచుతున్నాను.. వారి కోసమే కారు తెచ్చాను .. అదే కారు పిల్లలతో పాటు భార్యను తీసుకెళ్లింది’.. అంటూ జంగం రాజు శోకం అందరిని కలిచి వేసింది. నా పిల్లలు లేని ఇంట్లోకి ఎలా వెళ్లాలంటూ రాజు రోదించసాగాడు. విద్యుత్‌ బకాయిల వసూళ్లకోనం తాను విధి నిర్వహణలో ఉండగా నా కుటుంబం మొత్తం వరద నీటిలో కొట్టుకుపోయినట్లు తెలిసిందని తెలిపాడు. దుర్మరణం చెందిన  ప్రియ, జ్యోతి స్థానికంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుకొంటున్నారు. మిగతా ఇద్దరు కవలలు.  

మా పిల్లల్ని తెచ్చియ్యండి సారు
బాధితులను పరామర్శించడానికి వచ్చిన జిల్లా బీసీ కార్పొరేషన్‌ ఈడీ, మండల ప్రత్యేకాధికారి కాళ్లపై పడి నా పిల్లల్ని తెచ్చియ్యండి సారు అంటూ రాజు వేడుకున్నాడు.  అధైర్య పడవద్దని పై అధికారులకు తెలిపి అందరిని అప్రమత్తం చేయడం జరిగిందని ప్రత్యేకాధికారి వారికి తెలిపారు.

ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గరే ఉంచమన్నాను
ఇద్దరు పిల్లలను ఇంట్లో ఉంచమని చెప్పాను. చావు వారిని వెంటాడి పిలిచిందని పిల్లల నాన్నమ్మ జంగం లచ్చవ్వ తల బాదుకొంటూ ఏడ్చింది. దిక్కుమాలిన వర్షాలు మా అంతం కోసమే వచ్చాయని ఏడ్వడంతో కాలనీ ప్రజలు దుఃఖంలో మునిగిపోయారు. చెల్లెలు ఓ కూతురిని దత్తత అడిగినా ఇవ్వలేదని.. ఇస్తే కనీసం ఒక్క కూతురైన బతికి ఉండేదేమోనని పలువురు మాట్లాడుకున్నారు. కాగా, డ్రైవర్‌ నిర్లక్ష్యమే ఆరుగురి ఉసురు తీసిందని ప్రత్యేక్షసాక్షులు తెలిపారు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ ఉపద్రవాన్ని పట్టించుకోకుండా నడపడం వల్లే ఈ ఘోరం జరిగిందని వారు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement