లంచం కేసులో తహసీల్దార్‌కు మూడేళ్లు జైలు | Ramasamudram Tehsildar on Bribery case | Sakshi
Sakshi News home page

లంచం కేసులో తహసీల్దార్‌కు మూడేళ్లు జైలు

Jul 13 2016 2:36 AM | Updated on Aug 28 2018 7:09 PM

వ్యవసాయ భూమి పట్టాకోసం లంచం తీసుకున్నాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో చిత్తూరు జిల్లా రామసముద్రం తహసీల్దార్ పనిచేసిన...

నెల్లూరు(లీగల్) : వ్యవసాయ భూమి పట్టాకోసం లంచం తీసుకున్నాడని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో చిత్తూరు జిల్లా రామసముద్రం తహసీల్దార్ పనిచేసిన సీమనపల్లి రెడ్డెప్పకు మూడేళ్ల జైలుశిక్షతోపాటు రూ.90 వేలు జరిమానా విధిస్తూ ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నరసింహరాజు మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. రామసముద్రం మండలం బోగవాడి గ్రామానికి చెందిన ఫిర్యాది దొడ్డారెడ్డిగారి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబానికి సదరు గ్రామ పరిధిలో 8 ఎకరాల కలప, మామిడి, వివిధ రకాలచెట్లున్నాయి.

వాటిని కొట్టేందుకు అనుమతి, వ్యవసాయభూమి మార్చుకునేందుకు పట్టాకోసం 24-12-2012న రామసముద్రం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ పెట్టుకున్నాడు. సంబంధిత తహశీల్దార్ రెడ్డప్ప 15-02-2013న అర్జీలను పరిశీలించి  తనకు రూ.40వేలు లంచం ఇస్తే అనుమతి ఇస్తామన్నాడు. రూ.20 వేలకు అంగీకారాన్ని కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని ఫిర్యాది 20-02-2013న తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదుచేసిన అధికారులు మరుసటి రోజు పుంగనూరులోని తన ఇంటి వద్ద ఉన్న తహసీల్దార్ ఫిర్యాదు వద్ద నుంచి లంచం తీసుకొని పక్కన ఉన్న డ్రైవర్‌కు ఇచ్చాడు.

డ్రైవర్ ఆ డబ్బును లెక్కపెడుతుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని, రెడ్డప్ప, డ్రైవర్ పొన్నాల బాలమునిరెడ్డిపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో రెడ్డప్పపై నేరం రుజువు కావడంతో పై మేరకు శిక్ష, జరిమానా విధించారు. కారుడ్రైవర్‌పై నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టి వేస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement