రామా.. జాడచూపవా..! | rama..where the gold items | Sakshi
Sakshi News home page

రామా.. జాడచూపవా..!

Aug 25 2016 10:56 PM | Updated on Sep 4 2017 10:52 AM

రామా.. జాడచూపవా..!

రామా.. జాడచూపవా..!

భద్రాచలం దేవస్థానంలో నగల మాయంపై మిస్టరీ కొనసాగుతోంది. వారం రోజులు గడిచినా మాయమైన నగలు ఎక్కడున్నాయనేది ఇంకా వెల్లడి కాలేదు. రెండు ఆభరణాలు కనిపించటం లేదని నిర్ధారణ అయినప్పటికీ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవటంలో దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది.

  •  నగల మాయంపై వీడని మిస్టరీ
  • మంగళసూత్రం పోయినా చర్యల్లేవ్‌
  • భద్రాద్రి అర్చకుల్లో అంతర్మథనం
  • ................................................................................
    భద్రాచలం : భద్రాచలం దేవస్థానంలో నగల మాయంపై మిస్టరీ కొనసాగుతోంది. వారం రోజులు గడిచినా మాయమైన నగలు ఎక్కడున్నాయనేది ఇంకా వెల్లడి కాలేదు. రెండు ఆభరణాలు కనిపించటం లేదని నిర్ధారణ అయినప్పటికీ దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవటంలో దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు వెనుకంజ వేస్తున్నారనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. నగలు హుండీల్లో కూడా కనిపించకపోవటంతో దాదాపుగా పోయినట్లేనని దేవస్థానం అధికారులు నిర్ధారణకు వచ్చారు. వంశపారంపర్యంగా అర్చకత్వం చేసే పదకొండు మంది అర్చకుల ఆధీనంలోనే స్వామివారి నిత్యాలంకరణకు సంబంధించిన బంగారు ఆభరణాలు ఉంటాయి. నగలు కనిపించకపోతే వారంతా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీంతో వీరిలో ఎవరిపై చర్యలు తీసుకోవాలనే దానిపై దేవస్థానం అధికారుల నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. గతంలో చిన్నపాటి చోరీలు, విధుల పట్ల బాధ్యతారాహిత్యం వంటి అంశాల్లో ఉద్యోగులపై దేవస్థానం అధికారులు కఠినంగా వ్యవహరించారు. చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఈఓగా పనిచేసిన కాలంలో ఆలయం నుంచి వస్త్రాలను తీసుకెళుతున్న ఓ అర్చకుడిని గుర్తించి ఉన్న ఫలంగా అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. కానీ.. ప్రస్తుతం సీతమ్మ వారి మంగళసూత్రాలు పోయినా, అంతా కమిషనర్‌ ఆదేశానుసారమే చర్యలు తీసుకుంటామని ప్రస్తుత ఈఓ రమేష్‌బాబు చెబుతుండటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే కొందరు అర్చకులపై అనుమానంతో నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నప్పటికీ, విచారణ ఆ స్థాయిలో జరగటం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఆభరణాలు మాయమైతే సంబంధిత శాఖల అధికారులంతా దీనిని తేలిగ్గా తీసుకోవటం సరైందికాదని భక్తులు అంటున్నారు.
    మార్పులు ఉంటాయా..?
    రెండు ఆభరణాలు మాయమైన నేపథ్యంలో త్వరలోనే అర్చకుల బాధ్యతల్లో చేర్పులు.. మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. బంగారు ఆభరణాలకు పదకొండు మంది అర్చకులు బాధ్యులే కాబట్టి వారందరితోనే తలా ఇంత డబ్బులు పోగు చేసి, ఆభరణాలను చేయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే భక్తుల మనోభావాలతో కూడిన అంశం కావటంతో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇక్కడి అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. జరిగిన పరిణామాలన్నింటిపై పూర్తి నివేదికను కమిషనర్‌కు అందజేసిన ఈఓ రమేష్‌బాబు, అక్కడ నుంచి వచ్చే సందేశం కోసం ఎదురుచూస్తున్నారు.  
    అర్చకుల్లో అంతర్మథనం
    నగల మాయంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావటం, దీనిపై సర్వత్రా ఆక్షేపణలు వస్తున్నాయి. ఒకరిద్దరి చేసిన చేష్టలతో భద్రాద్రి రాములోరి సేవ చేసుకోవటమే మహాభాగ్యంగా భావిస్తూ విధులు నిర్వహిస్తున్న మిగతా అర్చకులు దీనిపై తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఈ వివాదానికి సాధ్యమైనంత తెరదించాలని వారు కోరుతున్నారు.
     

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement