బకాయిలు చెల్లించని వాణిజ్య నల్లాలు కట్‌ | people who does not paid water bill dissconected their water connection | Sakshi
Sakshi News home page

బకాయిలు చెల్లించని వాణిజ్య నల్లాలు కట్‌

Nov 22 2016 11:03 PM | Updated on Sep 4 2018 5:24 PM

డైరెక్టర్లతో వివిధ అంశాలపై సమీక్షిస్తున్న జలమండలి ఎండీ దానకిశోర్‌ - Sakshi

డైరెక్టర్లతో వివిధ అంశాలపై సమీక్షిస్తున్న జలమండలి ఎండీ దానకిశోర్‌

ఆరునెలలుగా బకాయిలు చెల్లించని వాణిజ్యనల్లా కనెక్షన్లను తొలగించాలని దానకిశోర్‌ అధికారులను ఆదేశించారు

సాక్షి, సిటీబ్యూరో: ఆరు నెలలుగా నల్లా బిల్లుల బకాయిలు చెల్లించని వాణిజ్య నల్లా కనెక్షన్లను డిసెంబర్‌ 15లోగా తొలగించాలని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఖైరతాబాద్‌లోని బోర్డు కార్యాలయంలో పలు అంశాలపై బోర్డు డైరెక్టర్లతో సమీక్షించారు. ప్రపంచ బ్యాంక్‌ నిధులతో చేపట్టిన మల్కాజ్‌గిరి మంచినీటి పథకంలో భాగంగా మీటర్ల ఏర్పాటు, నూతనంగా కనెక్షన్ చార్జీల వసూలు తదితర అంశాలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు రెవెన్యూ, ఫైనాన్స్, ఆపరేషన్స్, ప్రాజెక్ట్, రెవెన్యూ విభాగం డైరెక్టర్లతో కమిటీని నియమించినట్లు తెలిపారు.

మల్కాజ్‌గిరిలో నీటిమీటర్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించినా స్పందన లేకపోవడంపై అధికారులను ఆరా తీశారు. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలించాలని ఆదేశించారు. ప్రధాన నగరంలో నల్లాలకు మీటర్లు ఏర్పాటు చేసే అంశం త్వరలో కొలిక్కి రానుందని చెప్పారు. మంచినీరు, మురుగునీటి పారుదల పైప్‌లైన్ల ఉనికిపై జీఐఎస్‌ మ్యాపుల తయారీ, హడ్కో నిధులతో శివార్లలో చేపట్టిన పైప్‌లైన్, స్టోరేజీ రిజర్వాయర్‌ నిర్మాణం పనుల తీరును సమీక్షించారు. నగరంలోని అన్ని మ్యాన్ హోళ్లను సత్వరం జియోట్యాగింగ్‌ చేయాలని ఆదేశించారు.

ఇరుకు వీధుల్లోకి వెళ్లేందుకు వీలుగా ప్రవేశపెట్టనున్న మినీ ఎయిర్‌టెక్‌ యంత్రాలను సత్వరం రంగంలోకి దించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సెక్షన్ల పునర్విభజనపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు రామేశ్వర్‌రావు, సత్యసూర్యనారాయణ, ఎల్లాస్వామి, రవీందర్‌రెడ్డి, అజ్మీరా కృష్ణ, శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement