'కార్లు కడిగితే రూ.10 వేలు జరిమానా' | Hyderabad water board combat water misuse and wastage | Sakshi
Sakshi News home page

GHMC: నల్లా నీరు వ‌దిలిన వెంట‌నే వ‌చ్చేస్తారు.. జాగ్ర‌త్త‌!

Published Mon, Mar 24 2025 7:24 PM | Last Updated on Mon, Mar 24 2025 7:34 PM

Hyderabad water board combat water misuse and wastage

తాగు నీటితో బైక్‌ శుభ్రం చేస్తున్న యువకుడు (ఫైల్‌)

నల్లా నీరు విడుదల చేసిన సమయంలో పరిశీలన

వాహనాలు కడిగినా.. ఇంటి ముందు నల్లానీరు పారినా.. 

రూ.1000 నుంచి రూ.10000 వరకు జరిమానా

సాక్షి, హైదరాబాద్‌: వేసవిలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు జలమండలి పడరాని పాట్లు పడుతోంది. పదేళ్ల నాటి జనాభాకు తగ్గట్టు కేటాయింపులున్నా... వాటినే సర్దుబాటు చేసి ఎండకాలంలో గట్టెక్కేందుకు అనువైన అన్ని మార్గాలపై దృష్టి సారించింది. ఇప్పటికే నీటి సరఫరాలోని లీకేజీలను గుర్తించి చెక్‌ పెట్టిన జలమండలి (Water Board) తాజాగా సరఫరా చేసే నీరు తాగునీటికి మినహా ఇతర అవసరాలకు వాడకుండా కట్టడి చేసే చర్యలకు ఉపక్రమించింది. నల్లా వదిలిన సమయంలో తాగు నీటితో వాహనాలు, ఇంటి ముందు బండలు కడగడంతో పాటు గార్డెన్‌ ఇతర అవసరాలకు వినియోగించడాన్ని జలమండలి సీరియస్‌గా పరిగణించింది. మండుటెండలకు తాగునీటి వినియోగంతో పాటు పడిపోతున్న భూగర్భజలాలతో నీటికి డిమాండ్‌ పెరగుతోంది.

ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీటి కంటే అధికంగా సరఫరా చేసే పరిస్థితులు లేవు. దీంతో బెంగళూరు తరహాలో తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగించేవారిపై జరిమానాతో కొరఢా ఝళిపిస్తోంది. తాజాగా జీహెచ్‌ఎంసీ (GHMC) మేయర్‌ గద్వాల విజయలక్ష్మీ కూడా తాగు నీటి వృథాను సీరియస్‌గా పరిగణించి రూ. 10 వేల జరిమానా విధించాలని జలమండలి యంత్రాంగానికి సూచించారు. ఇప్పటికే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఇద్దరు వినియోగదారును గుర్తించి తొలిసారిగా జరిమానాగా రూ. వెయ్యి విధించి జలమండలి నోటీసులు జారీ చేసింది. తాజాగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి క్షేత్ర స్థాయిలో నీటివృధాపై బృందాలను రంగంలోకి దింపింది.  

యువకుడికి ఫైన్‌ 
15 రోజుల క్రితం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం. 78లో ఒక యువకుడు తాగు నీటితో బైక్‌ వాషింగ్‌ (Bike Washing) చేస్తుండగా గమనించి తొలిసారి తప్పుగా భావించి రూ.1000 జరిమానా విధించారు. జర్నలిస్టు కాలనీలో ఒక మహిళ తాగునీటితో వాహనం శుభ్రం చేయడం గుర్తించి ఫైన్‌ విధించారు.  

ప్రస్తుతం 547 ఎంజీడీల నీరు సరఫరా
జలమండలి పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 547.86 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తోంది. పదేళ్ల నాటి నీటి కేటాయింపులతో  రెండింతలు పెరిగిన జనాభాకు రోజువారీగా తాగు నీరు సరఫరా (Drinking Water Supply) పెద్ద సవాలుగా తయారైంది. నగరంలో తగినంత స్థాయిలో భూగర్భ జలాలు లేకపోవడం వల్ల 150–200 కిలో మీటర్ల దూరం నుంచి జలాలను తరలించి శుద్ది చేసి తాగునీరు సరఫరా చేస్తోంది. ప్రతి వెయ్యి లీటర్‌ నీటి సరఫరాకు రూ.48 ఖర్చు భరిస్తోంది. ఇదిలా ఉండగా జలమండలి సరఫరా చేస్తున్న నీటిలో సుమారు 20 శాతం పైగా నీరు లీకేజీలతో వధా పోతున్నట్లు  తెలుస్తోంది.  

చ‌ద‌వండి: ఇక RRR వరకు హెచ్‌ఎండీఏ అనుమతులే..

ఇప్పటికే లీకేజీలు చెక్‌...! 
ఇప్పటికే తాగు నీటి సరఫరాలో లీకేజీలను చెక్‌పెట్టింది. ప్రధాన జలాశయాల నుంచి సర్వీస్‌ రిజర్వాయర్ల వరకు మార్గమధ్యలో లీకేజీలను గుర్తించి మరమత్తు పనులు పూర్తి చేసింది. మరోవైపు క్షేత్ర స్థాయిలో సర్వీస్‌ పైప్‌లైన్లపై దష్టి సారించి లీకేజీలలను నివారించింది.  

కార్లు కడిగితే రూ.10 వేలు జరిమానా వేయండి 
తాగు నీటితో కొందరు  నిత్యం తమ కార్లు, ఇంటి ముందున్న బండలు, రోడ్లు కడుగుతున్నారు. వారికి తాగు నీటి విలువ తెలియడం లేదు. అలా వ్యవహరిస్తున్న వారిపై రూ. 10 వేల జరిమానా విధించాలి.  
– గద్వాల్‌ విజయలక్ష్మి, జీహెచ్‌ఎంసీ మేయర్‌

తాగు నీరు వృథా చేయొద్దు 
తాగు నీరు అనేది విలాసవంతమైనది కాదు. అత్యవసరమైనది. నీటి వృథా (Water wastage) తగ్గించగలగితే ఇతరులకు దాహార్తి తీర్చినవారవుతారు. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నీటిని తరలించి శుద్ది చేసి సరఫరా చేస్తున్నాం. ఇంతటి ప్రాముఖ్యమైన నీటిని వృథా చేయకూడదు.  
- అశోక్‌ రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్, జలమండలి

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement