100 పడకల ఆసుపత్రికి నిధుల్లేవ్‌

100 పడకల ఆసుపత్రికి నిధుల్లేవ్‌

చింతలపూడి : చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రికి నిధులు మంజూరు చేయడం సాధ్యం కాదని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. చింతలపూడి మండలం యర్రగుంటపల్లిలో రూ.78.15 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భననాలను మాజీ మంత్రి పీతల సుజాతతో కలిసి గురువారం ఆయన  ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన  ప్రశ్నకు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కాగితాలపైనే 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిందన్నారు. తమ ప్రభుత్వం వద్ద డబ్బు లేదని ఉన్న ఆసుపత్రిలో సౌకర్యాలను మెరుగుపరుస్తామని సమాధానం చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకే ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల కొరతను తీర్చడానికి చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం చింతలపూడి ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యసేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలో ఎనస్తీషియన్, పిడియాట్రిక్‌ వైద్యులను నియమించాలని, అంబులెన్స్‌ 

  సౌకర్యం కల్పించాలని సుజాత మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఇన్‌టెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ తో పాటు, గైనకాలజిస్ట్‌ను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.కోటేశ్వరి, జెడ్పీటీసీ తాళ్లూరి రాధారాణి, ఎంపీపీ దాసరి రామక్క, సర్పంచ్‌ ఎస్‌.వరలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ జయవరపు శ్రీరామ్మూర్తి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్‌ టి.కుటుంబరావు పాల్గొన్నారు. 

అన్ని ఆసుపత్రుల్లో సౌకర్యాలు

కామవరపుకోట : అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ పేర్కొన్నారు. కామవరపుకోటలో రూ.68.50 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. మాజీ మంత్రి పీతల సుజాత, జెడ్పీటీసీ సభ్యుడు జి.సుధీర్‌బాబు, మండల పరిషత్‌ అధ్యక్షురాలు మద్దిపోటి సుబ్బలక్ష్మి, సర్పంచ్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.  

 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు 

Read also in:
Back to Top